సర్వ ‘ముక్క’లూ సమానమే !
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:18 AM
ప్రధాన పండుగలైన భోగి, సంక్రాంతి, కనుమల తర్వాత, తెలుగు ప్రజలందరూ ఈరోజు చిట్టచివరిదైన ముక్కనుమ పండుగతో ఆనవాయితీగా, ప్రతీ సంవత్సరం ఈ సంక్రాంతి ఉత్సవాలను...

ప్రధాన పండుగలైన భోగి, సంక్రాంతి, కనుమల తర్వాత, తెలుగు ప్రజలందరూ ఈరోజు చిట్టచివరిదైన ముక్కనుమ పండుగతో ఆనవాయితీగా, ప్రతీ సంవత్సరం ఈ సంక్రాంతి ఉత్సవాలను ముగిస్తారు. ఇది అందరికీ తెలిసినదే అయినా, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ‘వెజ్ – నాన్-వెజ్’ అనుమానాల నివృత్తి కోసం...!
ఇప్పుడైతే వారం వర్జ్యం వంటివేవీ చూడకుండా ప్రతి రోజూ మాంసాహారం తింటున్నాం గానీ, ఒకప్పటి రోజుల్లో సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులూ– అంటే భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో కేవలం శాకాహారమే భుజించాలి అని ఒక నియమం ఉండేది. ఇది మంచి ఆరోగ్యసూత్రం కూడా అంటారు. ఈ ఉత్తరాయణ మకర సంక్రమణ శీతల కాలంలో, ప్రకృతిలో వచ్చే మార్పుల వలన, సప్త ధాతువుల మిళితమైన మానవ శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఈ రోజుల్లో ప్రకృతి పరంగా లభించే పండ్లూ, ఇతరత్రా శాకాహారం, ఎక్కువగా మినుములు, నెయ్యి, బియ్యప్పిండి, నువ్వులు... వగైరాలతో చేసే పిండి వంటకాలను తినాలని పెద్దలు చెబుతారు.
మన పురాణాల్లో, శాస్త్రాల్లో లిఖితపూర్వకంగా ఎక్కడా రాసినట్లు లేకపోయినా ‘ముక్కనుమ’ పండుగ రోజున ఖచ్చితంగా ‘ముక్క’ తినాలి అన్న మాట క్రమంగా ఎలాగో స్థిరపడింది. ముక్క + కనుమ = ముక్కనుమ అన్న లాజిక్ ప్రకారం ఇది ఒకరకంగా నిజమే అనిపిస్తుంది. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే– ఏ ‘ముక్క’ అనే దగ్గర! ముక్కనుమలో ‘ముక్క’ అంటే ప్యూర్ ‘నాన్- వెజిటేరియన్’ ముక్కే అని మాంసాహారులు వాదిస్తే– ‘కాదు... అది ప్యూర్ వెజిటేరియన్ ముక్కే’ అని శాకాహారులు కూడా అంతే గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు! ఏ ‘ముక్క’ అయితే ఏముంది, ఎవరికి నచ్చిన ముక్కలను వాళ్లు కోసుకుని వండుకొని కడుపునిండా -తిని ఈ ముక్కనుమ అనే పొట్ట పూజా మహోత్సవ మహాపండుగను విజయవంతం చేయవలసిందిగా నా విజ్ఞప్తి!
అంటే, నాన్-వెజ్ బ్యాచ్ అంతా చికెన్ ముక్కో, మటన్ ముక్కో, చేప ముక్కో, రొయ్య ముక్కో, పీత ముక్కో, కనీసం కోడిగుడ్డు ముక్కో... వగైరా వగైరాలతో; అలాగే వెజ్ బ్యాచ్ అంతా బెండకాయ ముక్కో, బీరకాయ ముక్కో, వంకాయ ముక్కో, సొరకాయ ముక్కో, గుమ్మడికాయ ముక్కో... కనీసం కంద ముక్కో, చిట్టి గారె ముక్కో, పూర్ణం బూరె ముక్కో ఇలా ఏదో ఒక ముక్కతో కలిసి-మెలిసి విందు భోజనం ఆరగించండి! ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన ‘ఏకం సత్ విప్రా – బహుధా వదంతి’కి అర్థం– ‘సత్యం అనేది ఒక్కటే, అనేక రీతులుగా పిలువబడుతుంది’ అని. ఈ సత్యం మనకు బోధపడితే రుచులు వేరైనా సారం ఒక్కటే అనీ, సర్వ ‘ముక్కలూ’ సమానమే అనీ అర్థమవుతుంది.
ఐతే లిక్కర్ తాగడం విషయంలో వెజ్ – నాన్‌వెజ్‌లకు అతీతంగా సర్వసమైక్య భావం పాటించే ‘మందు’బాబులు పైన పేర్కొన్న ఏ ముక్కల్నీ మంచింగ్ సరుకుగా మార్చి మందు తాగవద్దనీ, తద్వారా లివర్‌ను కాపాడుకోమనీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే వారి జీవితాలకు వారు ‘ఏక్టివ్’గా పొగ పెట్టుకోవడమే కాకుండా, పక్కవారి- జీవితాలకు కూడా ‘పాసివ్’గా పొగ పెడుతూ, అందర్నీ మెల్లగా చంపుతున్న మన స్మోకింగ్ బాబులు కూడా సిగరెట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ... ఈ ‘ముక్కనుమ’ పండుగతో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఉత్సవాలకు వీడ్కోలు పలుకుతూ... సర్వేజనా సుఖినోభవంతు!
పెన్మెత్స రవిప్రకాష్ అశోకవర్మ
శృంగవరం