Share News

ఏబీవీపీ నుంచి ఎదిగినవారెందరో

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:12 AM

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు మన దేశంలో క్రియాశీలమైన విద్యార్థి సంఘం. దేశంలోని యువతను సంఘటితపరిచి వారిలో దేశభక్తి, దేశాభివృద్ధి పట్ల నిష్ఠను పాదుకొల్పడం, వారిలో ‘జ్ఞానం, శీలం, ఏకత’లే ధ్యేయంగా...

ఏబీవీపీ నుంచి ఎదిగినవారెందరో

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు మన దేశంలో క్రియాశీలమైన విద్యార్థి సంఘం. దేశంలోని యువతను సంఘటితపరిచి వారిలో దేశభక్తి, దేశాభివృద్ధి పట్ల నిష్ఠను పాదుకొల్పడం, వారిలో ‘జ్ఞానం, శీలం, ఏకత’లే ధ్యేయంగా ఏబీవీపీ పనిచేస్తోంది. బాల్‌రాజ్‌ మధూక్‌, యశ్వంతరావు కేల్కర్, దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి జనమంచి గౌరీశంకర్ లాంటి ఎందరో మహామహులు ఏబీవీపీకి పునాదులు వేశారు. ఏబీవీపీ 1948లోనే ఢిల్లీ యూనివర్సిటీలో అతికొద్ది మందితో తన ప్రస్థానాన్ని కొనసాగించినా, 1949 జూలై 9 నుంచి అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేటితో 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ అమృతోత్సవ సంబరాల్లోకి ఏబీవీపీ అడుగుపెడుతోంది.

ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తర్వాత జాతీయ స్థాయిలో గొప్ప నేతలుగా ఎదిగినవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ అలా ఎదిగినవారే. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా ఏబీవీపీ నుంచి నాయకులుగా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇద్దరూ తమ రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీ నుంచే ప్రారంభించారు.

ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వామపక్షవాదులు, నక్సల్స్ దాడులకు పాల్పడ్డారు. జేఎన్‌టీయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ వంటి చోట్ల ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఏబీవీపీ దేశభక్తి, నిబద్ధతతో ముందుకు సాగుతోంది. సభ్యత్వం, దేశవ్యాప్తంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే నెంబర్‌ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా ఏబీవీపీ గుర్తింపు పొందింది.


ఏబీవీపీ- స్టూడెంట్ ఫర్ డెవలప్‌మెంట్‌ (SFD) ఫోరం ద్వారా విద్యార్థులకు ప్రకృతిపై ప్రేమను పెంచి, జల్, జంగల్, జన్వర్, జన్, జమీన్‌ల పరిరక్షణకు నేడు దేశవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ‘వృక్ష మిత్ర’ అభియాన్ ద్వారా నిర్వహిస్తున్నది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికులు, గల్ఫ్ కార్మికులు, సంచార జాతులపై సర్వే, ఫ్లోరోసిస్ బాధితుల కోసం సర్వే నిర్వహించి వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రధానపాత్ర పోషిస్తోంది.

థింక్ ఇండియా, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ & యూత్, మెడికల్ & డెంటల్ విద్యార్థుల ఫోరం వంటి మొత్తం 15 ఫోరమ్స్ ద్వారా పలు కోర్సుల్లోని విద్యార్థుల అభ్యున్నతికి ఏబీవీపీ కృషి సలుపుతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, భాషా, జీవన వైవిధ్యాన్ని పరిచయం చేయడం కోసం ఏబీవీపీ SEILను చేపట్టింది.

1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో జయప్రకాశ్‌ నారాయణ్ నేతృత్వంలో ఏబీవీపీ క్రియాశీలక పాత్ర పోషించింది. చలో అస్సాం కార్యక్రమం ద్వారా ‘సేవ్ అస్సాం- సేవ్ ఇండియా’ పేరుతో లాయర్స్ గ్రౌండ్స్‌లో సత్యాగ్రహం చేసింది. 1983 నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరంతరం జనజాగరణ, ఆందోళన నిర్వహిస్తూనే ఉంది. ఏబీవీపీ పోరాట ఫలితమే ‘నూతన జాతీయ విద్యా విధానం’. ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించింది.


కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్లు నాటడం, స్టడీ సర్కిల్, ఉచిత కోచింగ్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేయడం, BC, SC, ST విద్యార్థుల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అనేక విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. దేశ నాయకులను స్మరిస్తూ వివేకానంద, డా.బీ.ఆర్. అంబేడ్కర్ వంటి వారి సంస్మరణ దినాలను ఘనంగా నిర్వహిస్తోంది. నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నది గత నినాదం. నేటి విద్యార్థి నేటి పౌరుడే అనే స్పృహతో ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలపై అవగాహనతో స్పందిస్తూ, పరిష్కారాలను చూపే విధంగా విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే విద్యార్థి పరిషత్ ధ్యేయం. విద్యార్థిని టెక్నాలజీ, వైద్య, సామాజిక, కళా మొదలైన రంగాల్లో సమాజంతో మమేకం చేస్తూ ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా వారిలో ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా, ఏకాత్మ భావనను పెంపొందించే విధంగా ఏబీవీపీ కృషి చేస్తోంది.

జీవన్

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

ఈ వార్తలు చదవండి:

అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..

యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Read Latest and NRI News

Updated Date - Jul 09 , 2025 | 04:12 AM