Share News

A Tribute To Fallen Air Warriors: ఆకాశయోధులకు వెక్కిరింతల నివాళా

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:21 AM

ఇండియన్‌ ఏయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్‌ యుద్ధవిమానం దుబాయి ఏయిర్‌ షోలో కుప్పకూలటం పత్రికల పతాక శీర్షికలకు అతీతమైన విషాదం. విమానాలు ఆవిరిజాడలతో ఆకాశంలో రాసే కవిత్వం ఈ వైమానిక...

A Tribute To Fallen Air Warriors: ఆకాశయోధులకు వెక్కిరింతల నివాళా

ఇండియన్‌ ఏయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్‌ యుద్ధవిమానం దుబాయి ఏయిర్‌ షోలో కుప్పకూలటం పత్రికల పతాక శీర్షికలకు అతీతమైన విషాదం. విమానాలు ఆవిరిజాడలతో ఆకాశంలో రాసే కవిత్వం ఈ వైమానిక విన్యాసాలు. ఈ విన్యాసాల్లో నైపుణ్యమే ప్రార్థన, ధైర్యమే నివేదన. ఇవి కెమెరాల కోసం జరిగే ప్రదర్శనలు కావు; మానవ కౌశలానికి అత్యున్నత తార్కాణాలు. ఈ వీరులు భూమ్యాకర్షణశక్తికీ తమ అదృష్టానికీ మధ్య ఒక ప్రమాదకరమైన అంగీకారంతో విమానాలు నడుపుతారు. తమ దేశ జెండా తరఫున ప్రాణాలు ఒడ్డేందుకు సిద్ధపడతారు.

భారత వైమానికదళానికీ, సముద్రమంత విషాదంలో తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికీ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ బాధ ఎలాంటిదో రెక్కల మీద ఎగిరే తోటి యోధులకే పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నేలకొరిగింది ఒక పైలట్‌ కాదు. ఊహకందని ఎత్తుల్లో పహారా కాసే ఆకాశ సంరక్షకుడు. ఈ రాత్రి ఎక్కడో ఒక యూనిఫామ్‌ ఖాళీగా వేలాడుతుంది. ఎవరో ఒక పిల్లాడు ‘నాన్న ఎప్పుడు వస్తాడు?’ అని అడుగుతాడు. మొత్తం ఆకాశమే మరింత ఖాళీ అయినట్టు కనిపిస్తుంది.

ఈ దుర్ఘటనకు మించి, ఈ విషాదానికి మించి, నన్ను బాధపెడుతున్నది సరిహద్దుకు ఇటువైపు మా దేశం నుంచి పొంగుతున్న వెక్కిరింతల విషం. దేశ సరిహద్దు అయినా సరే, గగన వీరుల సహోదరత్వాన్ని విడదీయకూడదు. ఇలాంటి ప్రవర్తన దివాలాకోరుతనమే తప్ప దేశభక్తి అనిపించుకోదు. మనం అవతలివారి సిద్ధాంతాలనూ, వ్యూహాలనూ, విధానాలనూ ఎంతయినా ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ, మర్యాదకు విలువ ఉండే ప్రపంచంలో బతికే ఎవ్వరూ కూడా, ఆకాశపుటంచుల్లో విధులు నిర్వహించే యోధుడి సాహసాన్ని వెక్కిరించకూడదు. ఆ యోధుడు చప్పట్ల కోసం కాదు, దేశంపై ప్రేమతో ఎగిరాడు, మన దేశ యోధుల్లాగానే. అందుకు మనం ఇవ్వాల్సింది మర్యాద. కుళ్లిపోయిన దేశాభిమానాన్ని ముసుగు వేసుకుని వెక్కిరించటం కాదు.


ఇలాంటి విషాద నీరవంలోకే మన యోధులెందరో మాయమవటాన్ని నేను చూశాను. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ ఆలందార్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌ హసంత్‌ ఇలాంటివారే. వీరంతా దేవతలు ఊపిరిబిగబట్టి చూసేంత ఎత్తుల్లో విహరించారు, ఆకాశం ఎంతో తెగింపును కోరుతుందనీ, బదులుగా ఎలాంటి భద్రతనూ హామీ ఇవ్వదనీ వారు అర్థం చేసుకున్నారు.

గగనతలంలో యుద్ధవిమానం హఠాత్తుగా నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు– ఇక అక్కడ దేశ పౌరసత్వాలు లేవు, జాతీయ గీతాలు లేవు, జెండాలు లేవు. అక్కడ మిగిలేదల్లా అందరికీ సమానమైన విషాదమే! మేఘాల్లో కలిసిపోయిన వారి ఫొటోలను తడిమి రోదించే కుటుంబాలే!

నిజమైన ప్రొఫెషనల్‌, తోటి ప్రొఫెషనల్‌ను ఎన్ని అడ్డుగోడల అవతలనుంచైనా గుర్తుపడతాడు. నిజమైన యోధుడు తోటి యోధుడి ధైర్యానికి– అది వేరే రంగు యూనిఫామ్‌ తొడుక్కున్నా, వేరే రంగు జెండా కింద ఎగిరినా, వేరే భాష మాట్లాడినా– సెల్యూట్‌ కొడతాడు.

అంతకంటే ఏ మాత్రం తక్కువ స్థాయిలో వ్యవహరించినా అది వారికి కాదు, మనకే అప్రతిష్ఠ. మన వెక్కిరింత మన రెక్కలకే మరకలాగా అంటుకుంటుంది, నేలకొరిగిన మన యోధుల గౌరవాన్నే మంటగలుపుతుంది, మన వీరాలాపాలనే డొల్లచప్పుళ్లుగా మారుస్తుంది.

ధైర్యానికి పాస్‌పోర్టులు ఉండవు. బలిదానానికి సరిహద్దు విభజనలు తెలియవు. దేశ ప్రతిష్ఠ కోసం తన యుద్ధ విమానాన్ని గగనతల అవధుల్లోకి దూకించే పైలట్‌ మన మర్యాదకు పాత్రుడు– అతను కాషాయ, తెలుపు, పచ్చ జెండా తరఫున ఎగిరినా; లేక పచ్చ, తెలుపుజెండా తరఫున ఎగిరినా!

నిష్ర్కమించిన ఆ వైమానిక యోధుడు ఇక విమానాలు విఫలం కాని, ఏ కల్లోలాలూ లేని ఆకాశాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. అతని కుటుంబం తమ వియోగాన్ని మానవుని సాహసికాంశకు ఉత్కృష్ట తార్కాణంగా అర్థం చేసుకుంటారనీ భావిస్తున్నాను.

ఇక మనం– రక్తంతో గీసిన సరిహద్దులకు ఇరువైపులా ఉన్న మనం– మర్యాద ఇవ్వాల్సిన దానికి మర్యాద ఇచ్చే పెద్దరికాన్నీ, బాధపడాల్సిన వాటికి బాధపడే పరిణతినీ సాధిస్తామని తలుస్తాను. వేర్వేరు దేశాలకు పౌరులుగా మారే కంటే ముందే మనమంతా ఆకాశదేశానికి పౌరులం. ఏదో రోజు నశించిపోయే మనమంతా, శాశ్వతమైనది ఏదో అందుకునే ప్రయత్నంలో పైకి ఎగిరేవాళ్లమే, భూమ్యాకర్షణ వెనక్కు లాక్కునేలోగా.

ఆకాశం సరిహద్దులకు అతీతంగా దుఃఖిస్తుంది!

మనమూ అదే మర్యాదను పాటిద్దాం!

ఏయిర్‌ కమొడోర్‌ పెర్వెజ్‌ అక్తర్‌ఖాన్‌

ఇవి కూడా చదవండి

5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

Updated Date - Nov 27 , 2025 | 01:21 AM