Share News

Dr Shivaji: రాజకీయవేత్తల్లో చాలా అరుదు

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:09 AM

భారతదేశపు ఆర్థిక సంస్కరణలు ఐదేళ్లుగా కొనసాగుతున్నాయి. మనం గనుక అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అత్యంత గరిష్ఠ మొత్తాన్ని అత్యవసర సమయాల్లో వినియోగార్థం రుణంగా స్వీకరించాలని...

Dr Shivaji: రాజకీయవేత్తల్లో చాలా అరుదు

బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడు, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, విద్యావేత్త, సాంస్కృతిక చరిత్రకారుడు లార్డ్‌ మేఘనాథ్‌ దేశాయ్‌ తన 85వ ఏట ఇటీవల కన్నుమూశారు. 1988–1994 మధ్యకాలంలో డాక్టర్‌ యలమంచిలి శివాజీ రాజ్యసభ ప్రసంగాల సంకలనం ‘ఎగైన్‌స్ట్‌ ఆడ్స్‌’ (ఎదురీత)కు మేఘనాథ్‌ దేశాయ్‌ రాసిన ముందుమాట ఇది.

భారతదేశపు ఆర్థిక సంస్కరణలు ఐదేళ్లుగా కొనసాగుతున్నాయి. మనం గనుక అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అత్యంత గరిష్ఠ మొత్తాన్ని అత్యవసర సమయాల్లో వినియోగార్థం రుణంగా స్వీకరించాలని ఇందిరాగాంధీ నిర్ణయించిన నాటి నుంచి లెక్కించేట్లయితే పదిహేనేళ్లుగా కొనసాగుతున్నట్లు. అంతేగాకుండా ఆర్థిక అంశాలపై చర్చలు భారతదేశంలో ఇంకా ప్రబల విశ్వాసాలతో; సుస్పష్టంగా, సుదీర్ఘంగా దట్టించిన కుతర్కాలతో; ప్రజానురంజక బాధ్యతారాహిత్యంతో ముసురుకుని ఉంటాయి. (అయితే ఈ విషయంలో బ్రిటిషు రాజకీయవేత్తలు ఏ మాత్రం మెరుగ్గా ఉండరనేది వారి పార్లమెంటులో కూడా ఐరోపా వ్యవహారాలపై ఏ చర్చను గమనించినా ఇట్టే అవగతమవుతుంది.) వాస్తవాలను అధ్యయనం చేసి, సిద్ధాంతాలను జీర్ణించుకుని నిష్పాక్షికంగా చర్చించగలిగేది రాజకీయవేత్తల్లో చాలా అరుదు. ఆర్థికశాస్త్రంలో నిష్ణాతులు కావటం కష్టమే; అయితే జాతి ఆర్థిక స్థితిగతుల గురించి అయోమయంలో పయనించడం కూడా అభిలషణీయం కాదు. మన రాజకీయవేత్తలు అలా మబ్బులో ఉండటమూ అంతే ముఖ్యం. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో వేసవి శిబిరంలో ఆర్థిక శాస్త్రాధ్యయనానికి వచ్చినప్పుడు డా. శివాజీని కలిశాను. ఆయన వంటి ఒక అవిశ్రాంత రాజకీయవేత్త... ఇతర రాజకీయవేత్తల వలె తన సమయాన్ని రాజకీయ కుతంత్రాలతో గడపక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఆర్థికశాస్త్ర అధ్యయనపు కాఠిన్యాన్ని కోరుకోవడం నన్నెంతగానో ఆకట్టుకుంది.


నేను రాజ్యసభలో ఆయన ప్రసంగాల సంకలనాన్ని చూచినప్పుడు ఆయన ఆర్థిక అంశాలపై ఎడతెగని ఉత్సుకతను చూపటాన్ని, వివిధ విషయాలపై వర్ణ విన్యాసాన్ని గమనించాను. ఇతర విషయాల్లో కూడ ఆయన విమర్శనాత్మక ధోరణిని కనబర్చగలడు కాని, నన్ను ఆకట్టుకునేవి మాత్రం ఆర్థిక అంశాలే. బడ్జెట్లను, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్ని పరిశీలించటం, వాటిని డా. శివాజీ మాదిరిగా క్షుణ్ణంగా విశ్లేషణకు గురిచేసే ప్రయత్నాలు చేయడం మన రాజకీయ జీవితాల్లో ఆర్థిక అంశాలపై చర్చల స్థాయిని పెంచగలవు. డా. శివాజీ మాదిరిగా ఆర్థికాంశాలకు తగిన ప్రాధాన్యతను సమకూర్చే వాళ్లు ప్రపంచానికి చాలా అవసరం. ముందు ముందు ఆర్థిక అంశాలపై చర్చను కొనసాగించే ఆయన కృషిలో విజయాన్ని ఆకాంక్షిస్తూ...‍ 22–12–1995

ప్రొఫెసర్‌ ది లార్డ్‌ దేశాయ్‌

ఇవీ చదవండి:

ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Aug 08 , 2025 | 01:09 AM