అతి అలంకారాల్లేని కవిత
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:32 AM
గాఢ అనుభూతిని చిక్కటి కవిత చేయడం ఒక పద్ధతి. ఓ మామూలు భావనను సింపుల్ నరేటివ్‌గా కవిత చేయడం ఇంకో పద్ధతి. కవి సామర్థ్యం ఆయా కవితల నాణ్యతను...

ప్రియ పద్యం
గాఢ అనుభూతిని చిక్కటి కవిత చేయడం ఒక పద్ధతి. ఓ మామూలు భావనను సింపుల్ నరేటివ్‌గా కవిత చేయడం ఇంకో పద్ధతి. కవి సామర్థ్యం ఆయా కవితల నాణ్యతను నిర్ణయి స్తుంది. నిర్గుణ్ రెండో పద్ధతిలో అల్లిన కవిత ‘Outdated Parents’.
ముందుకెళ్ళిపోయిన తరం వెనక్కైనా తిరిగి చూడకుండా నడిచొచ్చిన దారి తెలివి తేటలను తూకంవేసి అవి తుక్కు అని నిర్దా క్షిణ్యంగా ముద్ర వేయడం ఇక్కడ ఇతివృత్తం. ప్రతి తరం తన ముందు తరంతో ఎలా వ్యవహరించిందో అదే విధంగా తన తరువాతి తరం తనతోనూ వ్యవహరించడం అనే సహజ న్యాయసూత్రాన్ని సహించలేకపోవడంలోని ప్రహేళికను కవి సమర్థంగా పొరలు పొరలుగా పేర్చుకుంటూ పోయాడు. నాకు బాగా నచ్చిన అంశం కవి తన సారాన్ని రూపంతో అతిగా అలంకరించకపోవడం. మేఘాలు, పూలు, తేనెలు, పక్షులను అక్కడక్కడా చల్లకపోవడం. రూపకాన్నో ఇంకేదో అలంకారాన్నో పట్టుకు వేళ్ళాడకపోవడం. తన భావనను సూటిగా బాణమంత నేరుగా గురిపెట్టడం.
ముసలోళ్లను పర్ణశాలల్లో పడేయడమే కాదు మీకేమీ తెలియదు అనడం కూడా వదిలించుకోవడమేనని కవి చెప్పాడు. ఈ వదిలించుకోవడమనే డిలీట్ ఆప్షన్ ఇప్పుడు మానవ జీవన కీ బోర్డులో కీలకం అని, తరాల అంతరాలలో deletion is key అనీ చెపుతున్నాడు కవి. దాన్ని ముందు తరాలకోసం కొత్త తరమే ఆవిష్కరించాలని కల కంటున్నాడు కవి.
అవుట్‌డేట్ అనే పాతముద్రకూ అప్‌డేట్ అనే పాదముద్రకూ మధ్య జరిగే సంఘర్షణలో తల్లితండ్రుల వేదనను సంయమనంతో నిర్వహించడం కవి గొప్పతనం. ఎక్కడా తరవాతి తరాన్ని తిట్టకపోవడం, నిందించకపోవడం నాకు నచ్చిన మరో అంశం.
ఇప్పుడిది నిస్సందేహంగా మంచి కవిత. నిర్మాణం విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే గొప్ప కవిత అయి ఉండేది. ఎంచుకున్నది కొత్త ఇతివృత్తం కనుకా, ఇతివృత్త ప్రధాన కవిత కనుకా కవిని ఆ మేరకు క్షమించేసి మనస్ఫూర్తిగా అభినందించవచ్చు.
ప్రసేన్
Outdated Parents
సరే... అన్నీ మీకే తెలుసు!
ఊరోళ్లమేనని చెప్పుకోవడానికి మేం సిగ్గుపడం
సరే.. మీ భాషలో మేం అవుట్‌డేటెడ్
మా కాలం లోనే ఇంకా ప్రయాణిస్తూ
మీ కాలపు ఉరుకు పరుగులలో
మేమింకా వెనుకబడేవున్నాం
ఆట బొమ్మలతో ఎలా ఆడుకోవాలో
మీకు నేర్పిన మమ్మల్ని
ఎలా బుడి బుడిగా నడవాలో
ఎలా ముద్దుముద్దుగా మాట్లాడాలో
మీకు నేర్పిన మేం
అవుట్‌డేటెడ్ అయ్యామా
అవుట్‌డేటెడ్ చేశారా
ఈ కాలం మీ కాలంలా లేదని
మాకెందుకు మీరు విడమరచి చెప్పడం లేదో
ఏదీ చెప్పకుండానే మీకేం తెలియదులే అని
మమ్మల్ని Outdated Parents ని
ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు
నీకేం తెలియదు డ్యాడ్ నీకు తెలియదులే మమ్మీ
అనే మాట కూడా ఒకటుంటుందని
మీరు పలికాకే మేము కూడా ఈ మాటను
మా అయ్యా అమ్మలపై వాడామని
ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది
మీలా ఇన్ని గందరగోళాలు
మా మెదడు కీ బోర్డులో అప్పట్లో లేక
ఆ మాటను మేమూ అప్పుడు డిలీట్ కొట్టలేదు
ఆ మాట
ఇప్పుడు మీరూ డిలీట్ చేసుకోలేరు
మీ తరం కూడా డిలీట్ చేసుకోవడానికి అంగీకరించదేమో
Updated Children కదా మీరు
మీ దగ్గర బోలెడు డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి కదా
బోధి వృక్షాలున్నాయి తథాగతుడే లేడు
ఏ తరంలోనైనా ఆ మాట
తల్లిదండ్రుల మనసులు తెగేసే ఖడ్గమవుతుంది
అనాథ శరణాలయాల్లో పడేయడం మాత్రమేనా
ఊర్కోండంటూ తల్లిదండ్రుల్ని తోసిరాజనడమూ
అవుట్‌డేటెడ్ పేరెంట్స్ అని గంట కట్టడమే
ఇప్పుడిక డిలీషన్ సాఫ్ట్‌వేర్ కావాలి
లేకుంటే రాబోయే తరాలు
అసలు డిలీట్ ఆప్షన్ లేకుండానే పుడతాయి
తరతరాలుగా ఇది తీరం దాటని తుఫాన్
నిత్యం కురుస్తూనే ఉంటుంది కుండపోతగా...
ఇబ్రహీం నిర్గుణ్
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..