SIR 2 Voter List Revision: సర్ 2.0 పదికోట్ల ఓట్లకు ఎసరు
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:07 AM
బిహార్‌లో కంటే మెరుగ్గా ఉన్నదా? లేనే లేదు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలవుతున్న రెండవ విడత ‘ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –సర్) గురించి...
బిహార్‌లో కంటే మెరుగ్గా ఉన్నదా? లేనే లేదు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలవుతున్న రెండవ విడత ‘ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –సర్) గురించి మేము ప్రస్తావిస్తున్నాము. ఈ రెండో విడతలో ఓట్ల తొలగింపు మరింత అధికంగా, మరింత నష్టదాయకంగా ఉంటుందనేది స్పష్టం. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని, మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెలువడుతున్న వార్తలను సమష్టిగా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న ఓటర్ జాబితాల నుంచి 11 కోట్ల పేర్లు సంభావ్య తొలగింపులకు గురయ్యేందుకు ఆస్కారమున్నది. ఈ రెండో విడతలో తుది తొలగింపుల సంఖ్య కొంచెం తక్కువగా ఉండవచ్చు. అయితే దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ పూర్తయినప్పుడు దాదాపు పది కోట్ల తొలగింపులను మనం చూసే అవకాశమున్నది.
పది కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును కోల్పోవడమనేది భారత ప్రజాస్వామ్యానికి శుభప్రదమేనా? కానేకాదు. ఇది స్పష్టం. అయినా ఈ రాబోయే విపత్తు పతాకశీర్షికలలో ఉండడం లేదు. సంబంధిత సమాచారం చెల్లాచెదురుగా, క్రమరహితంగా ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. బిహార్ ఎన్నికల తరువాత జాతీయ పత్రికలలో సర్ గురించిన వార్తలు బాగా తగ్గిపోయాయి. ప్రాంతీయ మీడియాకు, స్థానిక పేజీలకు మాత్రమే పరిమితమైపోయాయి. ఓటర్ నమోదు గడువును ఈసీఐ (భారత ఎన్నికల సంఘం) పదే పదే పొడిగిస్తోంది. తుది ఓటర్ జాబితాలు నాలుగు విడతలుగా అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చిన్న చిన్న వివరాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిజిటలైజ్ చేసిన డేటా శాతం గురించి అద్భుతమనిపించే అర్థరహిత గణాంకాలు వెల్లడించడమనే కొత్త పద్ధతిని ప్రారంభించడం ద్వారా సత్యాన్ని దాచడానికి, గందరగోళాన్ని సృష్టించడానికి ఈసీఐ తన శక్తిమేరకు ప్రయత్నించింది. ఇది మనకు అవసరమైన రెండు రకాల డేటాను అర్థం కాకుండా చేసింది: ఎన్యూమరేషన్ ఫామ్‌లను నింపకుండా, ముసాయిదా జాబితా నుంచి తొలగింపు నెదుర్కొంటున్న వారి సంఖ్య; పాత ఓటర్ జాబితాలతో తమ పేర్లను సంధానించుకోలేక సంభావ్య తొలగింపు నెదుర్కొంటున్న వారి సంఖ్య.
ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, లక్షద్వీప్, పాండిచ్చేరి) ముసాయిదా ఓటర్ జాబితాల విడుదలతో ప్రత్యేక సమగ్ర సవరణ నిజమైన వాస్తవాలను బహిరంగపరిచింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమాచారానికి మీడియా వార్తలే ఆధారంగా ఉన్నాయి. ఇవి వాస్తవ సమాచారాన్ని వెల్లడిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అధికారిక గణాంకాలు సంబంధిత రాష్ట్రాలలోని మీడియా వార్తలను ధ్రువీకరించాయి. ఎన్నికల సంఘం అధికారుల, రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా మీడియా వార్తలను ధ్రువీకరించాయి. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి, మేము పరిగణనలోకి తీసుకున్న అనధికారిక గణాంకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే బహిరంగంగా ధ్రువీకరించారు.
వివిధ రాష్ట్రాలలో సామూహిక మినహాయింపులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈసీఐ నిర్దేశించిన గడువులోగా వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను సమర్పించనివారి సంఖ్య ఉత్తరప్రదేశ్‌లో 2.93 కోట్లుగా ఉన్నది. ఇటువంటి ఓటర్ల సంఖ్య తమిళనాడులో 80 లక్షలు, గుజరాత్‌లో 72లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 58లక్షలు, రాజస్థాన్‌లో 43లక్షలుగా ఉండగా, మధ్య ప్రదేశ్‌లో 30లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 28లక్షలు, కేరళలో 21 లక్షలుగా ఉన్నది. చిన్న రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. గోవాలో లక్ష, పాండిచ్చేరిలో లక్ష, అండమాన్ నికోబార్‌లో 0.6లక్షలుగా ఉన్నది. పెద్ద, చిన్న రాష్ట్రాలలో సర్‌కు పూర్వపు ఓటర్ జాబితాలలోని మొత్తం ఓటర్ల సంఖ్య నుంచి 6.3కోట్ల పేర్లు ముసాయిదా జాబితాల నుంచి సగటు మినహాయింపులు బిహార్‌లో కంటే అధికంగా ఉండవచ్చని స్పష్టమవుతున్నది.
ఈ మినహాయింపులు సహజమైనవి కావు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవని చెప్పక తప్పదు. తమిళనాడు, కొంతమేరకు కేరళలో మినహా, ఇంతకు ముందున్న ఓటర్ జాబితా– ఓటుహక్కుకు అర్హులైనవారి సంఖ్య కంటే పెద్దదిగా ఉన్న రాష్ట్రమేదీలేదు. ప్రతి రాష్ట్రంలోను వయోజనుల– ఓటర్ల జాబితా నిష్పత్తి తగ్గిపోనున్నది. మొత్తంగా ఈ తగ్గుదల 12శాతం పాయింట్ల వరకు ఉన్నది. బిహార్ ముసాయిదా సర్ జాబితా 8శాతం పాయింట్ల కంటే ఎక్కువ. ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యత్యాసం భారీ స్థాయిలో ఉన్నది: అలాగే తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఇటువంటి పరిస్థితే ఉన్నది.
ఈ తగ్గుదల గణాంకాల్లో రాబోయే రోజుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నది. అయితే గణనీయమైన మార్పులు ఉండబోవు. ఓటర్ల మినహాయింపుల అధిక రేటును ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అనే తరగతులుగా ఈసీఐ వర్గీకరించింది. చాలా రాష్ట్రాలకు సంబంధించి ఈ వేర్వేరు తరగతుల మినహాయింపులపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ‘మృతులు’, ‘నకిలీ ఓటర్లు’గా గుర్తింపబడిన వారు చాలా రాష్ట్రాలలో ఇంచుమించు ఒకే విధంగా ఉండగా, ‘ఆబ్సెంట్’’, ‘షిఫ్టెడ్’ తరగతుల మినహాయింపులు కొన్ని రాష్ట్రాలలో ఆందోళనకరంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 9శాతం, గుజరాత్‌లో 10శాతం, ఉత్తరప్రదేశ్‌లో 13.7 శాతంగా ఉండగా పశ్చిమబెంగాల్‌లో 1.6శాతంగా ఉన్నది. సర్ ప్రక్రియ కొత్త తరగతి భారతీయులను– భారత్‌లో పుట్టి, భారత్‌లో నివసిస్తూనే స్వస్థలాలలోగానీ, ఉపాధి పొందుతున్న స్థలాలలోగానీ ఓటర్లుగా లేనివారు–సృష్టించే అవకాశమున్నది!
కొనసాగుతున్న రెండవ దశ సర్ ప్రక్రియ ‘unma-pped’ ఓటర్ల తొలగింపునకు మరొక మార్గాన్ని సమకూర్చుతోంది. ఓటరుగా నమోదు చేయించుకునేందుకు, 2002 లేదా 2003 ఓటర్ జాబితాలలో తమ పేరు ఉన్నట్టు లేదా తమ ‘బంధువు’ (ఈ పదాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికీ నిర్వచించలేదు) పేరు ఉన్నట్టు రుజువులు చూపకుండా తమ దరఖాస్తులను సమర్పించినవారే ఈ ‘unmapped’ ఓటర్లు. ఈ ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలలో తాత్కాలికంగా మాత్రమే చేర్చుతారు. తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్లు సమర్పించాలని వారికి నోటీసు జారీ అవుతుంది. అయినా అటువంటి డాక్యుమెంట్లను నిర్దేశించిన గడువులోగా సమర్పించని పక్షంలో తుది ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు.
సరే, ప్రస్తుతం ‘unmapped’ ఓటర్ల పేర్లు ఎన్ని ఉన్నాయి? ఈ పేర్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏ రాష్ట్రమూ విడుదల చేయలేదు. కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారం సైతం లేదు. ఈ ఓటర్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారంలో భారీ వైవిధ్యం కనిపిస్తోంది. ఎన్నికల సంఘానికి అందిన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో దిగ్భ్రాంతికరంగా అధిక స్థాయిలో ఉన్నది. ఈ ఓటర్లు యూపీలో 27.1శాతం, గుజరాత్‌లో 16శాతంగా ఉన్నారు. తమిళనాడులో మధ్యస్థంగా 10శాతం మేరకు ఉన్నారు. అయితే పశ్చిమబెంగాల్ (4శాతం), రాజస్థాన్ (3శాతం), మధ్యప్రదేశ్‌లో (2.4శాతం) చాలా తక్కువగా ఉన్నారు. ఇది విచిత్రమైన విషయమే. మొత్తం మీద తుది ఓటర్ల జాబితా నుంచి 5.25 కోట్ల మంది సంభావ్య తొలగింపు నెదుర్కోనున్నారు. వీరిలో 3.39 కోట్ల మంది ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం.
ఎన్నికల సంఘం కోరిన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను సమర్పించని 6.3కోట్ల మంది, తమ పౌరసత్వాన్ని నిరూపించని 5.3కోట్ల మంది.. వెరసి 11.6 కోట్ల మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదమున్నది. రెండవ దశ సర్ అమలవుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రస్తుతమున్న మొత్తం ఓటర్లలో, ఈ రెండు విధాలుగా ఓటుహక్కును కోల్పోయేవారి సంఖ్య ఐదో వంతుకు పైగా ఉంటుంది! రాబోయే కొద్ది రోజులలో వీరి సంఖ్య, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిపోయే అవకాశమున్నది. అయితే పశ్చిమబెంగాల్‌లో మాత్రం ‘unmapped’ ఓటర్ల సంఖ్యకు మరింత మందిని కలిపే అవకాశమున్నది. పౌరసత్వం నిరూపించుకోవాలని నోటీసు అందుకున్న వయోజనులలో అంతిమంగా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపునకు గురయ్యే వారి నిష్పత్తి తక్కువగానే ఉంటుంది. ఇది నిజమే. అయితే అంతిమ తొలగింపులు తాత్కాలిక ఓటర్ల సంఖ్యలో సగంగా ఉంటాయని భావించినా ఈ ఓటుహక్కు తొలగింపులు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతి పెద్ద ఓట్ల తొలగింపు అనడంలో సందేహం లేదు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
(భారత్ జోడో అభియాన్ పరిశోధకుడు
రాహుల్ శాస్త్రి సహకారంతో)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?