22ఏ భూములపై మూడుముక్కలాట!
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:22 AM
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరిగేటప్పుడు మూడుముక్కలాట తప్పకుండా ఉండేది. ఇప్పుడది కాసినో రూపంలో డబ్బున్న వారి ఆటగా మారిందనుకోండి. అమాయకులైన...
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరిగేటప్పుడు మూడుముక్కలాట తప్పకుండా ఉండేది. ఇప్పుడది కాసినో రూపంలో డబ్బున్న వారి ఆటగా మారిందనుకోండి. అమాయకులైన గ్రామీణ ప్రజలు ఆ మూడుముక్కలపై ఆశతో పందెం కాసి, జేబులు ఖాళీ చేసుకొనేవారు. ఈ మూడుముక్కలాట అనే పదం జగన్ ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో మారుమోగి పోయింది. కానీ 2015 నుంచి రాష్ట్ర రెవెన్యూ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ శాఖలు రాష్ట్రంలోని రైతులతో సెక్షన్ 22–ఏ పేరుతో మూడుముక్కలాట ఆడుతున్నాయి. ఆ శాఖలు ప్రజలను తమ కార్యాలయాల చుట్టూ నెలలు, సంవత్సరాల తరబడి తిప్పుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి.
అదెలాగంటే... ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి రిజిస్ట్రేషన్‌లు జరగకుండా సెక్షన్ 22–ఏ కింద ఆ భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్‌కు పంపితే, వాటిని సబ్ రిజిస్ట్రార్లు నిషేధిత జాబితాలో ఉంచి, రిజిస్ట్రేషన్లు చేయరు. ఇది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఏర్పాటు చేసిన రక్షణ. రెవెన్యూ, దేవాదాయ శాఖ వారు ఆ సర్వే నెంబర్ల జాబితా పంపినపుడు చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు బిచ్చగాళ్ళు మాదిరి ఆ ఆఫీసుల చుట్టూ, కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇది గత తొమిదేళ్లుగా సాగుతున్న ప్రహసనం.
ప్రభుత్వ భూములు అంటే... రోడ్లు, చెరువులు, శ్మశానాలు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, సాగుకోసం ఇచ్చిన ‘డి’ పట్టా భూములు, అలాగే ల్యాండ్ సీలింగ్ చట్టం కింద తీసుకున్న భూముల వివరాలను గ్రామాల వారీగా, మండలాల వారీగా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు తహశీల్దార్లు. అలా పంపేటప్పుడు చాలా తప్పులు చేశారు. అదెలాగంటే ఒక సర్వే నంబర్‌లో కొంత భూమిని ఇళ్ల స్థలాల కోసం, లేదా రోడ్డు కోసం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ భూముల వివరాలు సబ్ డివిజన్ చేసి పెట్టాలి. అలా చేయకుండా మొత్తం సర్వే నెంబర్‌ను పేర్కొనడం వల్ల, ఆ సర్వే నంబర్‌లో ఇంకా భూమి కలిగిన ఇతర రైతులు వారి అవసరాల కోసం అమ్మదలిచినపుడు... రెవెన్యూశాఖ వారు మీ భూమిని 22–ఏలో పెట్టారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అని చెబుతున్నారు సబ్ రిజిస్ట్రార్లు. అలాగే బ్యాంకు అధికారులు ఆ భూమికి రైతులకు లోన్లు ఇవ్వం అని చెబుతున్నారు. తప్పు చేసిన రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లిన రైతులు/భూ యజమానులు... అయ్యా! ఒక సర్వే నెంబర్‌లో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే, మొత్తం 10 ఎకరాల భూమి ఉన్న సర్వే నెంబర్‌ని 22–ఏలో పెట్టడం వల్ల, మిగిలిన 8 ఎకరాలను అవసరాలకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాము అని మొరబెట్టుకుంటున్నారు. భూమిని సబ్ డివిజన్ చేసి రెండు నెలల్లో తీర్చాల్సిన సమస్యను ఆ అధికారులు పట్టించుకోకుండా నెలల తరబడి రైతులను తిప్పుకుంటున్నారు. సొమ్ములు చెల్లించనిదే ఆ తప్పును వారు సవరించడం లేదు.
అలాగే గ్రామ కంఠం భూములను కూడా 22–ఏలో పెట్టారు. గ్రామ కంఠం భూములు ప్రైవేటు భూములని ప్రభుత్వం 2015లో స్పష్టంగా ప్రకటించినా కూడా, నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా వారి భూములను సబ్ రిజిస్ట్రార్లకు పంపినపుడు రెవెన్యూశాఖ వారు చేసిన తప్పునే చేశారు. ఒక సర్వే నెంబర్‌లో 10 ఎకరాల భూమి ఉంటే, అందులో దేవాదాయ శాఖకు చెందినది మూడు ఎకరాలు మాత్రమే. దానిని సబ్ డివిజన్ చేయకుండా మొత్తం 10 ఎకరాలను 22–ఏలో పెట్టారు. దీనివల్ల మిగిలిన ఏడు ఎకరాల్లో భూములున్న రైతులు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు తహశీల్దార్లతో సంప్రదించి, తమ భూములను విడిగా సబ్ డివిజన్ చేయించుకుని ఆ వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు పంపితే సమస్య పరిష్కారమవుతుంది. అలా చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ వరకు రైతులను నెలలు, సంవత్సరాల తరబడి తమ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు.
అలాగే ఒక గ్రామంలో చిన్న దేవాలయం ఐదు నుంచి 10 సెంట్ల భూమిలో ఉన్నా, ఆ గ్రామ కంఠం సర్వే నెంబర్ మొత్తాన్ని 22–ఏలో పెట్టినందువల్ల మొత్తం ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల యజమానులు ఆ ఇళ్లను అమ్మాలన్నా లేదా బ్యాంకు లోను తెచ్చుకోవాలన్నా వీలుకావడం లేదు. దారుణమైన విషయం ఏమంటే దేవాదాయ శాఖ బహిరంగంగా వేలంలో అమ్మిన భూములను కూడా మళ్లీ 22–ఏలో పెట్టారు. ఇదేమని అడిగితే కోట్ల రూపాయల విలువైన భూములు చాలా జాగ్రత్తగా చూసి చేయాలని కథలు చెబుతున్నారు. పైగా దేవాదాయ శాఖ నాలుగు లక్షల ఎకరాల భూములను రక్షించాల్సి ఉంది అని లోకాయుక్తకు చెప్పుకున్నారు. వందలాది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లు దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నారు. ఆ భూములపై వాస్తవ వివరాలు ఒక నెల రోజుల్లో అందించవచ్చు. మూడు నెలల్లో 22–ఏలో పెట్టిన తమ శాఖకు చెందని భూములను తొలగించవచ్చు.
విశాఖలోని శారదాపీఠం అధిపతిని గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు పదే పదే దర్శించేవారు. అదే దారిలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి ఈఓ స్థాయి వరకు ఆయన ముందు సాగిలపడ్డారు. అది వారి వ్యక్తిగతం అని సరిపెట్టుకుందాం. అలాగే మొన్నీమధ్య సనాతన ధర్మం పేరుతో ఓ నాయకుడు మెట్లు కడిగితే ఓ అధికారి మగ్గుతో నీళ్లు అందించారు. కానీ వేలాది మంది రైతుల భూములను తమ శాఖ అధికారులు తప్పుగా నమోదు చేసిన పాపాన్ని మాత్రం కడగలేకపోతున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు 22–ఏ కింద సబ్ డివిజన్ వివరాలు లేకుండా భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్లకు పంపితే, వారు వాటిని వెనక్కి తిప్పి పంపాలి. అలా కాకుండా రైతులు, భూ యజమానులు రిజిస్ట్రేషన్ల కోసం వారి కార్యాలయాలకు వచ్చినపుడు మీ భూమి 22–ఏ కింద ఉందని, మీరు దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారుల వద్దకు వెళ్లి సరి చేయించుకుని రమ్మని చెబుతున్నారు. ఈ రకంగా రిజిస్ట్రేషన్ శాఖ కూడా రైతులను ఇబ్బంది పెడుతోంది.
ఆర్టికల్ 300–ఏ కింద ఆస్తి హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపడం ఒక రకంగా ఈ హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ విధంగా మూడు శాఖలు రైతుల జీవితాలతో మూడుముక్కలాట ఆడుకుంటున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు కూడా బాధ్యులే. గత నవంబరు 26న 75వ రాజ్యాంగ దినోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. మండల స్థాయి అధికారి నుంచి గౌరవ రాష్ట్రపతి వరకు రాజ్యాంగాన్ని స్తుతించి రాజ్యాంగ పీఠికను అందరూ ఎలుగెత్తి పఠించారు. రెవెన్యూ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్టికల్ 300–ఏని తమ కోర్టు హాలులో చదివిస్తే తప్ప 22–ఏలో భూముల్ని తప్పుగా పెట్టిన అధికారులకు కనువిప్పు కలగదేమో!
మారిశెట్టి జితేంద్ర
రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్