Indian Immigrants In USA: ప్రవాసుల పాలిట విద్వేషనామ సంవత్సరం
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:19 AM
ఈ సంవత్సరపు పరిణామాలను ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, అమెరికాలోని భారతీయుల అనుభవాల రీత్యా, 2025ను ‘విద్వేషనామ సంవత్సరం’ అనాలేమో అనిపిస్తోంది. సుంకాల రూపేణా ప్రపంచం...
ఈ సంవత్సరపు పరిణామాలను ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, అమెరికాలోని భారతీయుల అనుభవాల రీత్యా, 2025ను ‘విద్వేషనామ సంవత్సరం’ అనాలేమో అనిపిస్తోంది. సుంకాల రూపేణా ప్రపంచం అంతటి దృష్టినీ ఆకర్షించిన ఈ విద్వేష సంకేతాలు ఇప్పటివరకు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. శ్వేతసౌధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్ నియమితుడైనప్పుడు వెల్లువెత్తిన దురహంకార ద్వేష వ్యాఖ్యలతో ఈ సంవత్సరం ప్రారంభం అయింది. అది ఏకంగా ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకి, రాజకీయ వ్యాఖ్యాత నిక్ ఫ్యూయెంటెస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దాకా వచ్చింది. వీటికి స్పందనగా ‘‘తన భార్య గురించి మాట్లాడేవారు అశుద్ధం తింటున్నట్టే’’ అంటూ జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు కూడా. భారతీయుల పట్ల అమెరికన్లు విద్వేష విషం కక్కడం ఈ సంవత్సరాంతం వరకూ కొనసాగుతూనే ఉన్నదనడానికి ఇది తార్కాణం.
యథారాజా తథా ప్రజా అనే సామెత అందరికీ తెలిసిందే. పాలకుల్లో కొందరి ఆలోచనల్లోని విద్వేషాన్ని వారి వీరభక్తులు అందిపుచ్చుకుంటున్న తీరు అమెరికాలో అత్యంత ప్రమాదకర సంకేతంగా మారింది. ఇప్పటిదాకా అమెరికా ‘యూనివర్సల్ యాక్సెప్టార్’ వంటి దేశం. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది వచ్చి అమెరికాలో స్థిరపడి, అక్కడే బతుకుతుంటారు. ఇలాంటి సమయంలో పరస్పర సహనంతో కూడిన జీవన విధానం మాత్రమే సమాజానికి మేలు చేస్తుంది. కానీ ట్రంప్ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికాలో ప్రభావశీల కమ్యూనిటీగా ఎదిగిన భారతీయుల పట్ల విద్వేషం పెచ్చరిల్లుతోంది.
అమెరికన్లతో పోలిస్తే భారతీయుల్లో కష్టపడే తత్వం ఎక్కువ. అమెరికాలో స్థిరపడిన భారతీయ సమాజం ఎదుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. అమెరికాలో ఎంతో ప్రభావశీలమైన కమ్యూనిటీగా ఇవాళ భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి పట్ల స్థానికులు కొందరిలో అసూయతో కూడిన విద్వేషం అప్పుడప్పుడూ బయట పడుతూండేది. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అలాంటివారందరికీ బలం వచ్చినట్టయింది. ప్రజలు విద్వేషాల్ని విచ్చలవిడిగా వెళ్లగక్కుతున్నారు. సామరస్య వాతావరణం పూర్తిగా దెబ్బతింటోంది. ఇందుకు ఉదాహరణలు అనేకం.
దీపావళి పర్వదినం సందర్భంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన ఎక్స్ వేదిక ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అదే ఆయన చేసిన నేరమైంది. ‘నీ ఇంటికి పో.. నీ మట్టి దెయ్యాలను పూజించుకో.. నా దేశం నుంచి వెళ్లిపో..’ అంటూ అమెరికన్లలోని అతివాదులు ఆయన మీద సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇది ఒక్క కాష్ పటేల్‌కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాపానికి ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ, అధ్యక్ష అభ్యర్థిగా తలపడిన వివేక్ రామస్వామి, పౌరహక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ థిల్లాన్ తదితరులందరికీ ఇలాంటి ట్రోలింగ్ తప్పలేదు. వైట్‌హౌస్ నుంచి, అమెరికా విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ‘ఎక్స్’లో పోస్టు చేసిన దీపావళి శుభాకాంక్షల సందేశాలకు టెక్సస్ గవర్నర్ గ్రెగ్ ఆబట్, అర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ సాండర్స్ వంటి ప్రముఖులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ‘హెచ్ 1బీ వీసా ఉన్న ఒక్కో ఉద్యోగి, పదిమంది అక్రమ వలసదారులతో సమానం’ అంటూ అమెరికా పోల్‌స్టర్ రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ అనడం కూడా భారతీయులపై అసహనాన్ని వెళ్లగక్కడమే. వాళ్లందరినీ వెనక్కు పంపేయడానికి ట్రంప్ చర్యలు తీసుకోవడం లేదనేది ఆయన ఆవేదన.
‘ఎక్స్’లో ఒక యూజర్ ‘భారతీయుల ఉనికి వెగటు పుట్టిస్తోంది’ అని పోస్టు చేశాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే నినాదాన్ని ట్రంప్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఏ దేశమైనా ఇలాంటి నినాదాన్ని ఆదరిస్తుంది. అయితే ఆ నినాదానికి ఆచరణ రూపం ఇతరులపట్ల ద్వేషాన్ని పెంచుకోవడమే అన్నట్టుగా అమెరికాలో చలామణీ అవుతోంది. అమెరికా శ్వేతజాతి క్రైస్తవులది మాత్రమే అని ప్రచారం చేస్తూ, ఆ మేరకు ఇతరుల్ని ద్వేషించడం తమ కర్తవ్యం అనుకుంటున్నారు.
అమెరికాలో స్థిరపడిన భారతయులకు వ్యతిరేకంగా గత అక్టోబర్ ఒక్క నెలలోనే దాదాపు 2,700 పోస్టులను తమ బృందం రికార్డు చేసిందని, ఇవన్నీ జాతి విద్వేషాన్ని, జీనోఫోబియాను (విదేశీయుల పట్ల అకారణ భయం) రెచ్చగొట్టేలా ఉన్నాయని ‘సెంటర్ ఫర్ ది ఆర్గనైజ్డ్ హేట్’ వ్యవస్థాపకుడు రకీబ్ నాయక్ వెల్లడించారు. ‘ట్విట్టర్’ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకుని, దానిని ‘ఎక్స్’గా మార్చిన తర్వాత ఇలాంటి పోస్టులు గణనీయంగా పెరిగాయని, ఇదివరకు కొంత కట్టడి ఉండేదని చెప్పారు. అయితే, ఈ విమర్శపై ‘ఎక్స్’ స్పందించలేదు.
ఈ ద్వేషాన్ని మరిన్ని కోణాల నుంచి కూడా గమనించాలి. అమెరికాలోని భారతీయుల పట్ల, అక్కడి పౌర సమాజంలో ఒక అసహనం నిర్మాణం కావడానికి కేవలం ట్రంప్ విధానాలు మాత్రమే కారణమా? అందులో మనవారి బాధ్యత/ పాత్ర ఏమీ లేదా– అని కూడా తర్కించి చూసుకోవాలి. అమెరికాలో సంఖ్యాపరంగా గణనీయంగా పెరుగుతున్న భారతీయుల ప్రవర్తన అనేక సందర్భాల్లో శ్రుతిమించుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఒక తెలుగు టాప్ హీరో సినిమా విడుదల అయితే ఎక్కడాలేనంత హడావుడి చేసి, ఏకంగా అమెరికాలో ట్రాఫిక్ స్తంభింపజేసిన సందర్భం ఉంది. అమెరికాలో భారతీయులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాల పేరిట కొన్ని రోడ్లను మూసివేస్తున్నారు, లౌడ్‌స్పీకర్లతో హోరెత్తిస్తున్నారు. బాణసంచా కాలుస్తున్నారు, నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు. కొంతకాలం కిందట తెలుగువారు వేడుకలు చేసుకుంటున్న ఒక ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. జనం మధ్యలో చిక్కుకుపోయిన ఒక అమెరికన్ కారు దిగి, తన తుపాకీ చూపి బెదిరించడంతో జనం కకావికలై పారిపోయారు. అలా ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు భారతీయులకు అమెరికన్ సమాజంలో ఉండే మర్యాదను పలుచన చేస్తున్నాయి. భారతదేశం నుంచి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేసే హడావుడి కూడా భారతీయులకే వెగటు పుట్టించేంతగా ఉంటున్నది. ఎక్కడైనా సరే ‘లా ఆఫ్ ది ల్యాండ్’ అంటూ ఒకటి ఉంటుంది. మనం ఏ దేశంలో ఉంటే అక్కడి మర్యాదలను పాటించాలి. అక్కడి చట్టాలను గౌరవించాలి, అక్కడ జీవన శైలుల్ని అనుసరించాలి. అలా కాకుండా అమెరికన్ చట్టాలను అతిక్రమించేలా, మర్యాదలను ధిక్కరించేలా వ్యవహరిస్తే అది మనవారిపై విద్వేషం పెరగడానికి ఒక కారణం అవుతుంది.
ఏది ఏమైనప్పటికీ అమెరికాలో భారతీయులను ద్వేషించే నయా సంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఏడాదిగా అలాంటి పరిణామాలు తారస్థాయికి చేరుకున్నాయి. రకరకాల కారణాలు ఇందుకు దారితీస్తున్నప్పటికీ, ఈ పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం మాత్రం భారతీయుల అవసరం. అందుకు మార్గాలను మనమే అన్వేషించుకోవాలి. ట్రంప్ విధానాలపరంగా పుట్టే ద్వేషం విషయంలో చేయగలిగేది లేకపోయినా అమెరికన్ సమాజంలో సామరస్య జీవనం దెబ్బతినకుండా చూసుకోవడం మన పరిధిలోని సంగతి అని గుర్తుంచుకోవాలి.
కృష్ణమోహన్ దాసరి
పాత్రికేయుడు, డల్లాస్
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..