Share News

Shukra Moudham: మూఢం ఎఫెక్ట్.. పలు రంగాలపై ఆర్థిక ప్రభావం.!

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:15 PM

సాధారణంగా మంచి ముహూర్తంలో తలపెట్టిన ఏ కార్యమైనా జయప్రదమవుతుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ ముహూర్తాలు గ్రహబలాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఏ శుభకార్యం తలపెట్టాలన్నా గురు, శుక్ర గ్రహబలాల ఆధారంగా పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. అయితే.. ప్రస్తుతం మౌఢ్య కాలం నడుస్తుండటంతో 84 రోజుల పాటు శుభకార్యాలకు ముహూర్తాల్లేవంటూ పురోహితులు అంటున్నారు. ఆ విశేషాలేమిటంటే..

Shukra Moudham: మూఢం ఎఫెక్ట్.. పలు రంగాలపై ఆర్థిక ప్రభావం.!
Shukra Moudhyam halts auspicious events for 84 days

ఇంటర్నెట్ డెస్క్: గ్రహాల స్థితిని బట్టి కర్మకాలాలు లేదా మూఢమి లాంటివి జ్యోతిష్య శాస్త్రం ద్వారా వినిపించే మాటలు. ఈసారి దాదాపు మూడు నెలల పాటు శుభ ముహూర్తాలకు విరామం వచ్చింది. ఈనెల 26న మార్గశిర మాసం శుద్ధ షష్ఠి నుంచి ప్రారంభమైన శుక్ర మౌఢ్యమి మాఘ బహుళ అమావాస్య ఫిబ్రవరి 17 వరకూ కొనసాగనుంది. దీంతో సుమారు 84 రోజుల పాటు శుభకార్యాలకు ముహూర్తాలు లేవు.


పవిత్ర తిథులు..

మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. అయితే.. ఈసారి మార్గశిరంలో ఒకటి, రెండు ముహూర్తాలే ఉండగా.. పుష్యం శూన్య మాసం అవుతుంది. ఇక మాఘంలోనూ ఒక్క మూహూర్తం లేకపోవడం గమనార్హం. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథ సప్తమి, సరస్వతి జన్మదినమైన వసంత పంచమి మహమాఘ్‌గా కీర్తించబడే మాఘ పౌర్ణమి వంటి తిథులూ ఈసారి మూఢంలోనే కలిసిపోయాయి.


మూఢం అంటే.?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం సూర్యుడి కిరణాలలో కనుమరుగై పోవడాన్ని మౌఢ్యమి. దీనినే వాడుక భాషలో మూఢమి(చీకటి) అంటారు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో శుక్రుడూ అంతే ప్రభావం కలవాడు. గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్ర గ్రహం సూచించే ఫలితాలు అంతగా అనుకూలంగా ఉండవు. శుక్రుడు బలహీనం అయితే సంబంధాలు, వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వంలో ప్రతికూలతలు ఏర్పడతాయని జ్యోతిషులు చెబుతున్నారు. అందుకే శుక్ర మౌఢ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరిపించడం శుభసూచకం కాదని సూచిస్తున్నారు.


వ్యాపారులపై ప్రభావం..

శుభకార్యాలు లేకపోతే వివాహ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వస్త్ర, ఆభరణాల దుకాణాలు, స్వర్ణకారులు, క్యాటరింగ్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, టెంట్ హౌస్, పూల దుకాణాలు, లైటింగ్, డీజేలు, అద్దె కార్లు, బస్సులు, సన్నాయి మేళం ఇలా సంబంధిత వర్గాలు నెలల కొద్దీ నష్టపోవాల్సి వస్తుంది. పౌరోహిత్యంపై ఆధారపడ్డ వారికీ గడ్డుకాలమే.


అప్పటివరకూ ముహూర్తాల్లేవ్..

ఈ నెల 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు దాదాపు మూడు నెలల పాటు శుభకార్యాలకు మంచిరోజులు లేవని కోటప్పకొండ తుర్లపాటి ఉమామహేశ్వర శర్మ తెలిపారు. శుక్రమౌఢ్యం వల్ల ఒక్క శుభముహూర్తం కూడా ఉండదని అన్నారు. శుభకార్యాలతో పాటు గృహ ప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలూ వంటివీ నిర్వహించరాదని సూచించారు.


ఇవీ చదవండి:

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎంతో తెలుసా..

బంధమా, బతుకా.. దాంపత్యంలో ఏది ముఖ్యం.?

Updated Date - Nov 29 , 2025 | 12:16 PM