Karthika Masam: కార్తీక మాస కృష్ణపక్షం ప్రారంభం.. అన్నీ మంచి రోజులే అంటున్న పండితులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 07:43 AM
కార్తీక మాసం శుక్లపక్షంలో పండుగలు ఉన్నట్లే.. కృష్ణపక్షంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. తొలిరోజులకంటే.. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే 15 రోజులు కూడా విశేషమైనవిగానే చెబుతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా దీపారాధన చేయడం, శివకేశవులను పూజించడంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 6: ఏడాదిలోని 12 నెలల్లో శ్రావణ, కార్తీక మాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతలకు అత్యంత ఇష్టమైన సమయంగా ఈ మాసాలను చెబుతారు. శ్రావణ మాసంలో వర్షాలతో ప్రకృతి అందంగా మారుతుంది. ఆకులు రాలిన చెట్లు కొత్త చిగురు సంతరించుకొని పండ్లను, పూలను ఇస్తుంది. ప్రకృతి అంతా ఎంతో సుందరభరితంగా ఉంటుంది. ఇక చలికాలంలో వచ్చే కార్తీక మాసం.. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమని చెబుతారు. ఈ మాసంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం తొలిరోజు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం అని చెబుతారు. మొదటి రోజునుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు అత్యంత దేవతారాధన చేసే రోజులుగా చెబుతారు.
శుక్లపక్షంలో పండుగలు
కేదారగౌరి వ్రతం, బలిపాడ్యమి, గోవర్ధనపూజ, ఆకాశదీపారంభం, కార్తిక స్నానారంభం, చంద్రోదయం, యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం, తిరుమల శ్రీవారి పెద్ద శేషవాహనం నాగ పంచమి, తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, తిరుమల శ్రీవారి పుష్పయాగం, చిలుక ఏకాదశి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం, కైశిక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, తులసి కళ్యాణం, తిరుమల శ్రీవారి ఆస్థానం, వైకుంఠ చతుర్దశి తదితర పండుగలు శుక్లపక్షంలో వస్తాయి. ఈ మాసంలో కార్తీక స్నానాలు చేసి ఉసిరి, ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం, హరిహరులను దర్శించుకొని పూజలు చేయడం, నదుల్లో కార్తీక దీపాలను వదలటం, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తారు.
కృష్ణపక్షంలో పండుగలు
కార్తీక మాసం శుక్లపక్షంలో పండుగలు ఉన్నట్లే.. కృష్ణపక్షంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. తొలిరోజులకంటే.. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే 15 రోజులు కూడా విశేషమైనవిగానే చెబుతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా దీపారాధన చేయడం, శివకేశవులను పూజించడంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సత్యదేవుడి అనుగ్రహం కోసం నోమును ఆచరిస్తారు. వ్రతం అనంతరం బంధు మిత్రులతో సాత్వికమైన భోజనాన్ని చేస్తారు. ఈ పక్షంలో సంకష్ట చతుర్థి, ఉత్పత్తి ఏకాదశి, సర్వ ఏకాదశి, కార్తిక బహుళ ద్వాదశి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, శ్రీ వేదనారాయణ స్వామి పవిత్రోత్సవం, మాసశివరాత్రి పండుగలు వస్తాయి.
ఈ మాసంలో లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి పూజలు చేస్తారు. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్' అంటూ కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యం శివనామస్మరణ చేయాలి. విష్ణుభక్తులైతే దశావతారాలను స్మరించాలి. శ్రీ లలితాదేవి భక్తులైతే శ్రీ మాత్రే నమః అంటూ జపిస్తూ ఉంటే విశేష పుణ్యఫలం లభిస్తుంది. కృష్ణ పక్షంలోని 15 రోజులు కూడా మంచిరోజులని పండితులు చెబుతున్నారు. వివాహాలు చేసుకోవడానికి కూడా ఈ సమయం అనువైనదిగా చెబుతారు.
ఇవి కూడా చదవండి:
ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు