Fake Marriage: గురూజీతో బాధ చెప్పుకున్నాడు.. వీడియో చూసి మర్డర్ ప్లాన్
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:05 PM
Fake Marriage: తివారీకి 18 ఎకరాల పొలం ఉన్నా.. టీచర్ ఉద్యోగం చేస్తున్నా పెళ్లి మాత్రం కాలేదు. ఎక్కడా పిల్ల దొరకలేదు. దీంతో మానసికంగా బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ ఆచార్య మహరాజ్ ప్రవచనాలకు వెళ్లాడు. ఆయనకు తన బాధ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావించాడు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఖుషీ తివారీ అలియాస్ సాహిబా బానో ఆస్తి కోసం మధ్య ప్రదేశ్‌కు చెందిన 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీని ట్రాప్ చేసి చంపిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న గంటల్లోనే ఆమె భర్త ప్రాణాలు తీసింది. అయితే, ఈ మొత్తం మర్డర్‌కు కారణం అయింది ఓ వీడియో. ఆ వీడియో కారణంగానే ఇంద్రకుమార్ తివారీ ప్రాణాలు పోయాయి. ఇంతకీ ఆ వీడియో తివారీ ప్రాణాలు పోవడానికి ఎలా కారణం అయిందంటే.. మధ్య ప్రదేశ్‌లోని పడ్వర్‌కు చెందిన ఇంద్రకుమార్ తివారీ పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేసేవాడు.
అతడికి 18 ఎకరాల పొలం కూడా ఉంది. వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాడు. అయితే, తివారీకి 18 ఎకరాల పొలం ఉన్నా.. టీచర్ ఉద్యోగం చేస్తున్నా పెళ్లి మాత్రం కాలేదు. ఎక్కడా పిల్ల దొరకలేదు. దీంతో మానసికంగా బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ ఆచార్య మహరాజ్ ప్రవచనాలకు వెళ్లాడు. ఆయనకు తన బాధ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావించాడు. ప్రవచనాల సమయంలో అనిరుధ్ ఆచార్య మహరాజ్‌కు తన బాధనంత చెప్పుకున్నాడు.
అనిరుధ్ మహరాజ్ సమాధానం ఇస్తూ..‘45 ఏళ్లు వచ్చాయి. అయినా పెళ్లి చేసుకుంటావా.. నువ్వు సాధువుగా మారు. భజనలు చేయ్. మంచి పనులు చేయ్.. పేద పిల్లల్ని చదివించు. సేవాకార్యక్రమాలు చేయ్’ అని చెప్పాడు. అయితే, తివారీకి మాత్రం పెళ్లి మీద ఆశ చావలేదు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాహిబా బానో చూసింది. తివారీని చంపి అతడి ఆస్తి కొట్టేయాలని అనుకుంది. ఇందుకోసం తన ఇద్దరు మిత్రులతో మర్డర్ ప్లాన్ వేసింది.
సోషల్ మీడియా ద్వారా తివారీకి ఖుషీ అనే పేరుతో దగ్గరైంది. పెళ్లి చేసుకుందామని చెప్పి గోరఖ్‌పూర్ రప్పించింది. తన మిత్రుల సాయంతో తివారీని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే అతడ్ని చంపేసింది. తర్వాత ముగ్గురూ కలిసి శవాన్ని హటా ఏరియాలోని మురికి కాల్వలో పడేశారు. జూన్ 6వ తేదీన పోలీసులకు ఆ శవం గురించిన సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాహిబాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమెతో పాటు మిగిలిన ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కూతురి కోసం తండ్రి సాహసం.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి..
ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతిపై కూర్చుని..