Scientist Dies After Neighbour's Assault: బైక్ పార్కింగ్‌పై వివాదం.. పొరుగింటి వ్యక్తి దాడిలో శాస్త్రవేత్త దుర్మరణం
ABN , Publish Date - Mar 13 , 2025 | 07:22 PM
మోహాలీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వాహన పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువత శాస్త్రవేత్త మరణానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ విషయంలో తాగాదాలో పొరుగింటి వ్యక్తి దాడి చేయడంతో ఓ యువ శాస్త్రవేత్త దుర్మరణం చెందారు. మృతుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా ఉన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, యువ శాస్త్రవేత్త పేరు డా. అభిషేక్ సర్ణకార్ (39). అనేక అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన పరిశోధనలు ప్రచురితమయ్యాయి. గతంలో స్విట్జర్‌లాండ్‌లో పనిచేసిన ఆయన ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్టు సైంటిస్టుగా చేరారు. అయితే, ఇటీవలే ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా జరిగింది. సోదరి అతడికి కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం డయాలిసిస్ జరుగుతోంది. మోహాలీలోని సెక్టర్ 67లో అతడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా పార్కింగ్ విషయంలో పొరుగింటి మాంటీతో వివాదం నడుస్తోంది. నిత్యం అతడు తమను వేధించేవాడని మృతుడి తల్లి పేర్కొన్నారు (Scientist Dies After Neighbour's Assault).
Indiana Foster kid Death: 10 ఏళ్ల బాలుడి ఛాతిపై కూర్చొన్న తల్లి.. చిన్నారి దుర్మరణం
‘‘ఘటన జరిగిన రోజు రాత్రి కూడా అభిషేక్ ఎప్పటిలాగే ఇంటికి వచ్చి తన బైక్‌ను పార్క్ చేశాడు. వాళ్లు వచ్చి బైక్‌ను తొలగించమన్నారు. దీంతో, వాగ్వివాదం మొదలైంది. మా అబ్బాయి ఆ తరువాత పైకి వచ్చేశాడు. ఇంతలో వాళ్లు నీ బైక్‌ను నీ కళ్ల ముందే పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మా అబ్బాయికి కోపం రావడంతో కిందకు వెళ్లాడు. అప్పటికే మా ఆయన అక్కడ వారితో మాట్లాడుతున్నారు. కిందకు వెళ్లిన మా అబ్బాయి వారితో మాట్లాడాడు. వారు చెప్పిన చోట బండిని పార్క్ చేస్తే ఎంత ఇబ్బందో చెప్పుకొచ్చారు. చివరకు మా అబ్బాయి కంప్లెయింట్ చేస్తానని అన్నాడు’’
Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం
దీంతో, నాపై ఫిర్యాదు చేస్తానంటావా అంటూ మాంటీ అభిషేక్‌ను కింద పడేలా తోసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. వెంటనే మా అబ్బాయిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని మృతుడి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాంటీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి జాడ కనిపెట్టేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామని అన్నారు. మాటీ ఫోన్‌ను కూడా ట్రాక్ చేస్తున్నట్టు తెలిపారు.