Fake Wedding: ఆస్తి కోసం 45 ఏళ్ల వ్యక్తిని ట్రాప్.. పెళ్లైన గంటల్లోనే..
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:00 PM
Fake Wedding: ఆ పోస్టు ఉత్తర ప్రదేశ్, ఖుషీ నగర్‌కు చెందిన సాహిబా బానో చూసింది. అప్పుడు ఆమెకు ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే అతడికి ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది.
ఆస్తి కోసం ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. 45 ఏళ్ల వ్యక్తిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే అతడ్ని చంపేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, జబల్‌పూర్‌కు చెందిన కుమార్ తివారీకి 45 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాలేదు. ఆస్తి, అందం అన్నీ ఉన్నా తనకు ఎందుకు పెళ్లి కావటం లేదని అతడు బాధపడుతూ ఉండేవాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రోజు ఓ పోస్టు పెట్టాడు.
తనకు 18 ఎకరాల పొలం ఉందని, అయినా తనకు పెళ్లి కావటం లేదని బాధపడ్డాడు. ఆ పోస్టు ఉత్తర ప్రదేశ్, ఖుషీ నగర్‌కు చెందిన సాహిబా బానో చూసింది. అప్పుడు ఆమెకు ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే అతడికి ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది. తివారీకి తన పేరు మార్చి చెప్పింది. నకిలీ ఆధార్‌ను చూపించి గోరఖ్‌పూర్ రప్పించింది. మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో తివారీని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే అతడ్ని చంపేసింది.
తర్వాత శవాన్ని హటా ఏరియాలోని మురికి కాల్వలో పడేశారు. జూన్ 6వ తేదీన పోలీసులకు ఆ శవం గురించిన సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సాహిబా బానోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. పెళ్లి సందర్భంగా దిగిన ఫొటోలను చూపించి సాహిబా ఆస్తి మొత్తం కాజేయాలని భావించింది. కథ అడ్డం తిరిగి జైలు పాలైంది. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..