Horror In Medaram Forest: మేడారం అడవుల్లో దారుణం.. యువకుడి సజీవ దహనం
ABN , Publish Date - Sep 06 , 2025 | 10:16 AM
గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బాసిత్‌పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో బాసిత్ తల్లి పోలీసులను ఆశ్రయించింది.
మేడారం అడవుల్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడ్ని సజీవ దహనం చేశారు. కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. మేడారం అడవుల్లోని తాడ్వాయి సమీపంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఎండీ బాసిత్ అనే యువకుడు ఈ నెల 3వ తేదీన తన మిత్రుడు అరుణ్‌తో కలిసి రోడ్డుపై వెళుతున్నాడు.
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సమీపంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బాసిత్‌పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో బాసిత్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకును కారులో తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తాడ్వాయి సమీపంలో బాసిత్ శవమై తేలాడు. అటువైపు వెళుతున్న కొందరు వ్యక్తులు కాలిపోయి ఉన్న శవాన్ని చూశారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని బాసిత్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాసిత్‌ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు అతడ్ని సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. బాసిత్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు హత్య చేశారు? అన్నది తెలియరావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
కోతుల దారుణం.. 2 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి..
గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..