Share News

జీఎ్‌సటీకి సంబంధించి బడ్జెట్‌లో చేసిన మార్పులేమిటంటే ?

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:04 AM

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చే అంతఃరాష్ట్ర సరఫరాలు పొందినప్పుడు సంబంధిత క్రెడిట్‌ను పంపిణీ చేసే సదుపాయం ఇప్పటి వరకు ఉండేది కాదు. ఇప్పుడు చేసిన మార్పుతో, ఆ క్రెడిట్‌ను కూడా...

జీఎ్‌సటీకి సంబంధించి బడ్జెట్‌లో చేసిన మార్పులేమిటంటే ?

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జీఎ్‌సటీకి సంబంధించి కొన్ని మార్పులు ప్రతిపాదించారు.

ఆ వివరాలు..

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చే అంతఃరాష్ట్ర సరఫరాలు పొందినప్పుడు సంబంధిత క్రెడిట్‌ను పంపిణీ చేసే సదుపాయం ఇప్పటి వరకు ఉండేది కాదు. ఇప్పుడు చేసిన మార్పుతో, ఆ క్రెడిట్‌ను కూడా డిస్టింక్ట్‌ పర్సన్స్‌ అంటే అదే పాన్‌ సంఖ్యతో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ పొందిన ఇతర యూనిట్లకు పంపిణీ చేసే సదుపాయం కల్పించారు.

అలాగే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకోవటానికి వివిధ నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు నిర్మాణ రంగం ఉపయోగించే సరఫరాల మీద క్రెడిట్‌ తీసుకోవటానికి ప్రత్యేక పరిమితులు ఉన్నాయి. దీని ప్రకారం అన్ని రకాల సరఫరాల మీద క్రెడిట్‌ తీసుకోవటం సాధ్యం కాదు. అలాగే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉండేవి. అంటే పొందిన సరఫరా అనేది ప్లాంట్‌ ‘లేదా’ మెషినరీకి సంబంధించినది అయితే క్రెడిట్‌ తీసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. ఇప్పుడు చేసిన సవరణ ప్రకారం తీసుకున్న సరఫరా.. ప్లాంట్‌ ‘మరియు’ మెషినరీకి సంబంధించినది అయితేనే క్రెడిట్‌ తీసుకోవటానికి వీలవుతుంది. అంటే ‘లేదా అనే స్థానంలో ‘మరియు’ అని పెట్టడం జరిగింది. ఈ మార్పుతో ప్లాంట్‌, మెషినరీ ఏదో ఒక దాంట్లో కాకుండా రెండింటికి కలిపిన నిర్వచనంలోకి సదరు సరఫరా పడినప్పుడే క్రెడిట్‌ వస్తుంది. ఈ సవరణ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేట్లు (రెట్రోస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌) ప్రతిపాదించటం జరిగింది.


ఇంకా ఎగవేతకు ఆస్కారం ఉన్న ఉత్పత్తులకు సంబంధించి ఇక మీదట సరఫరాదారులు ప్రత్యేక సంఖ్య లేదా కోడ్‌ ముద్రించాలి. దీనివల్ల ఆయా ఉత్పత్తుల అమ్మకాలు, రవాణా, నిల్వలను ప్రభుత్వం గుర్తించటానికి వీలు ఉంటుంది. తద్వారా ఎగవేతలను నిరోధించవచ్చు. అయితే దీని పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు లే దా వ్యక్తులకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది.

ఇకపోతే క్రెడిట్‌ నోట్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. చేసిన సరఫరాలో ఏవేని మార్పులు ఉంటే.. అంటే ఇన్వాయి్‌సలో చూపిన విలువకు, సంఖ్యకు లేదా పన్ను కంటే వాస్తవ సరఫరా తక్కువ ఉంటే, ఆ తక్కువ మేరకు ఒక క్రెడిట్‌ నోట్‌ను సరఫరాదారుడు కొనుగోలుదారునికి జారీ చేస్తాడు. అలాగే ఇన్వాయిస్‌ విలువను రిటర్న్‌లో చూపించి పన్ను చెల్లించి ఉంటాడు కాబట్టి, క్రెడిట్‌ నోట్‌లో చూపిన విలువను తదుపరి రిటర్న్‌లో తగ్గించుకునే సౌలభ్యం అతనికి ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణ ప్రకారం సదరు కొనుగోలుదారుడు క్రెడిట్‌ నోట్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను రివర్స్‌ చేసినప్పుడు మాత్రమే ఆ సరఫరాదారుడు క్రెడిట్‌ నోట్‌ విలువను తగ్గించుకునే అవకాశం ఉంది.


మరొక ముఖ్య మార్పు అప్పీల్‌కు సంబంధించినది. ఏదేనీ ఆర్డర్‌ మీద అప్పీల్‌ దాఖలు చేయాలంటే ‘పన్ను’ విలువలో 10 శాతం ‘ప్రీ డిపాజిట్‌’ చేయాల్సి ఉంటుం ది. దీని కోసం ఆర్డర్‌లో పన్ను, పెనాల్టీ, వడ్డీ కలిపి ఉన్నా పన్ను విలువను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదించిన మార్పు ప్రకారం ఆర్డర్‌లో ఒకవేళ పన్ను లేకుండా ‘పెనాల్టీ’ మాత్రమే ఉన్నట్లయితే సదరు పెనాల్టీ మీద 10 శాతం ప్రీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పన్ను, పెనాల్టీ ఇంకా ఇతర అంశాలు కలిపి ఉంటే ఇప్పటి ప్రకారమే పన్ను విలువలో 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

పైన ప్రతిపాదించిన మార్పుల్లో ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు సంబంధించిన మార్పు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుండగా మిగతా మార్పులు సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేసినప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Feb 09 , 2025 | 04:04 AM