China: అమెరికా-బ్రిటన్ ట్రేడ్ డీల్.. చైనాకు విషపు మాత్రలతో సమానం
ABN , Publish Date - May 14 , 2025 | 09:07 PM
అమెరికా, బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తమకు కీడు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరే ఎలాంటి ఒప్పందం అయినా మూడో దేశం ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉండకూదని వ్యాఖ్యానించింది.
అమెరికాతో బ్రిటన్ కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందం (US-UK Trade Deal)పై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఒప్పందం విషపు మాత్రలతో సమానం అని వ్యాఖ్యానించింది. బ్రిటన్ కంపెనీలు చైనా (China) ఉత్పత్తులను మినహాయించాలని ఒత్తిడి చేసే విధంగా అమెరికాతో బ్రిటన్ పొత్తు పెట్టుకుందని ఆరోపించింది. అమెరికా, బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తమకు కీడు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరే ఎలాంటి ఒప్పందం అయినా మూడో దేశం ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉండకూదని వ్యాఖ్యానించింది.
గత వారం అమెరికా, బ్రిటన్‌లు ట్రేడ్ డీల్‌ను కుదర్చుకున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం బ్రిటన్ చేసే కార్లు, ఉక్కు ఎగుమతులపై అమెరికా పన్నులను తగ్గిస్తుంది. బ్రిటన్ నుంచి ప్రతి ఏటా దిగుమతి చేసుకునే లక్ష వాహనాలకు అమెరికా పన్నులను ప్రస్తుతం ఉన్న 27.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తుంది. అలాగా యూకే నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై కూడా అమెరికా పన్నులను తగ్గిస్తుంది. అయితే ఆయా కంపెనీలు అమెరికా సూచించే కొన్ని భద్రతా నియమాలను పాటించాలి.
ఆయా సంస్థలు అమెరికా నిబంధనలకు అనుగుణంగా విడి భాగాల కొనుగోలు, యాజమాన్యాల విషయంలో పారదర్శకంగా ఉండాలి. యూకేలోని చాలా ప్రముఖ సంస్థలకు చైనా నుంచే విడి భాగాలు వస్తాయి. అలాగే కొన్ని సంస్థల్లో చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా యూకేపై అమెరికా ఒత్తిడి చేసే ప్రమాదం ఉండడంతో చైనా ఆందోళన చెందుతోంది. యూకే తీసుకునే చర్యలు చైనాకు విషపు మాత్రలుగా మారే ప్రమాదం ఉందని చైనా ట్రేడ్ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన టారిఫ్‌ల కంటే ఈ డీల్ చైనాకు ఎక్కవ నష్టాన్ని కలుగచేస్తుందని అంచానా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..