తయారీ, ఎగుమతుల ప్రోత్సాహానికి రెండు కొత్త కార్యక్రమాలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:12 AM
ప్రపంచం యావత్తు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న అవకాశాలు...

పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ
ముంబై/న్యూఢిల్లీ: ప్రపంచం యావత్తు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సంసిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామిక రంగానికి పిలుపు ఇచ్చారు. తయారీ, ఎగుమతి రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రెండు కొత్త మిషన్లు (కార్యక్రమాలు) ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో బడ్జెట్ అనంతర వెబినార్‌లో నియంత్రణలు, పెట్టుబడులు, వ్యాపార సరళీకరణ సంస్కరణలపై ప్రధాని మాట్లాడారు. మెరుగైన టెక్నాలజీ, ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రపంచ డిమాండుకు దీటుగా వారికి అవసరమైన కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పరిశ్రమకు ఆయన సూచించారు. నూతన ప్రపంచ డిమాండును తీర్చగల సామర్థ్యం భారత పరిశ్రమకున్నదని ఆయన అన్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి నిలిచి భారత్ నేడు ప్రపంచ వృద్ధికి చోదకశక్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు. నేడు ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యం పటిష్ఠం చేసుకోవాలనుకుంటున్న కారణంగా ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని పారిశ్రామిక రంగానికి సూచించారు. స్థిరమైన విధానాలు, సంస్కరణల పట్ల చిత్తశుద్ధి కారణంగా పరిశ్రమకు ప్రభుత్వంపై కొత్త విశ్వాసం ఏర్పడిందని చెప్పారు.
ఎంఎ్‌సఎంఈలకు కొత్త రుణ విధానాలు: దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రలకు (ఎంఎ్‌సఎంఈ) తక్కువ వడ్డీపై సకాలంలో రుణాలందించేందుకు కొత్త విధానాలు అందుబాటులోకి రావలసిన అవసరం ఉన్నదని ప్రధాని నొక్కి చెప్పారు. తొలిసారిగా పారిశ్రామికవేత్తలవుతున్న మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ ఆంత్రపెన్యూర్లకు రూ.2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్టు తెలిపారు. ఎంఎ్‌సఎంఈలకు రుణాలందించినంత మాత్రాన చాలదని, చక్కని మార్గదర్శకత్వం కూడా కావాలని పేర్కొంటూ వారికి అవసరం అయిన మెంటార్‌షిప్ కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా పారిశ్రామిక రంగ ప్రతినిధులకు పిలుపు ఇచ్చారు. తాము జన్‌విశ్వాస్ 2.0 బిల్లును ప్రవేశపెట్టనున్నామంటూ ఆర్థికేతర నియంత్రణలపై సమీక్షకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రధాని చెప్పారు. నియంత్రణలేవైనా ఆధునికం, అనుసరణీయంగాను, విశ్వసనీయత పెంచేవిగాను ఉండాలని వ్యాఖ్యానించారు.
రాష్ర్టాలు కూడా సంస్కరణలు చేపట్టాలి: రాష్ర్టాలు కూడా వ్యాపార సరళీకరణకు సంస్కరణలు చేపట్టాలని, అప్పుడు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ప్రధాని సూచించారు. రాష్ర్టా లు పరస్పర పోటీ సామర్థ్యం పెంచుకుని ప్రగతిశీలక విధానాలతో ముందుకు వచ్చినట్టయితే పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రాలుగా కంపెనీలు వాటిని ఎంచుకుంటాయని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..