Pharma Imports: ఫార్మా దిగుమతులపై 250శాతం సుంకాలు..
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:27 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో బాంబు పేలుస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి ఫార్మా కంపెనీలపై పడింది.
ధరలు తగ్గిస్తే సరి..లేదంటే టారిఫ్ పోటు తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో బాంబు పేలుస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి ఫార్మా కంపెనీలపై పడింది. ఈ కంపెనీలు.. అమెరికాలో ఔషధాల ఉత్పత్తి పెంచి ధరలు తగ్గించాలని కోరారు. లేకపోతే భారీ సుంకాల పోటు తప్పవని హెచ్చరించారు. సీఎన్‌బీసీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ‘ప్రారంభంలో ఈ సుంకాల పోటు కొద్ది స్థాయిలోనే ఉంటుంది. ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఇది 150 శాతం, ఆ తర్వాత 250 శాతం వరకు ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికాలో ఔషధాల ధరలు మూడింతలు ఎక్కువగా ఉన్నందున, వాటి ధరలు తగ్గించక తప్పదని ట్రంప్ ఈ ఏడాది మార్చిలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
భారత్‌పై ప్రభావం: ట్రంప్ తాజా హెచ్చరిక భారత ఫార్మా కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి 3,000 డాలర్ల (సుమారు రూ.2.61 లక్షల కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. అందులో అమెరికా వాటా 14 శాతం వరకు ఉంది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ఇంకా కుదరక పోవడంపై భారత ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఆందోళనలో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక అమలైతే భారత జెనరిక్ ఔషధాలకు అమెరికా మార్కెట్ శాశ్వతంగా మూసుకుపోయినట్టేనని పరిశ్రమ వర్గాలు అందోళన చెందుతున్నాయి.