మళ్లీ ట్రూజెట్ విమాన సర్వీసులు!
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:27 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ట్రూజెట్’ మళ్లీ తన విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తన నిరభ్యంతర పత్రాన్ని...
అనుమతుల కోసం ప్రయత్నాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ట్రూజెట్’ మళ్లీ తన విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) పునరుద్ధరించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ)కు ట్రూజెట్ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఎంఓసీఏ ఇందుకు ఆమోదం తెలిపితే పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నుంచి కంపెనీ తన పాత ఎయిర్ ఆపరేషన్స్ పర్మిట్ (ఏఓపీ)ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు కంపెనీ బోర్డులోని సభ్యుల నియామకాలకూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. ఈ అనుమతులన్నీ పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి మళ్లీ కొద్దిపాటి ఏటీఆర్ టర్బో విమానాలతో ప్రాంతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని ట్రూజెట్ భావిస్తోంది.,
రూ.100 కోట్ల పెట్టుబడి: విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ట్రూజెట్ యాజమాన్యం రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు సమాచారం. దీంతో ఐదు ఏటీఆర్ విమానాలతో పాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల మధ్య ఎయిర్‌బస్ ఏ-320 విమాన సర్వీసులూ ప్రారంభించాలని యోచిస్తోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఏ-320 పాత విమానాలను ఆఫ్రికా లేదా ఇతర దేశాల నుంచి కొనాలని కంపెనీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరాంతం నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని ట్రూజెట్ చూస్తోంది. ఈ ఎయిర్‌బస్ విమానాలకు విశాఖ విమానాశ్రయం, ఏటీఆర్ విమానాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవాలని ట్రూజెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా 2015 నుంచి 2022 వరకు ట్రూజెట్ కార్యకలాపాలు సాగించింది. అయితే కొవిడ్ కారణంగా పరిస్థితులు తలకిందులు కావటంతో 2022 ఫిబ్రవరిలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.
Read More Business News and Latest Telugu News