Share News

వైరస్‌ కలకలం

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:29 AM

చైనాను వణికిస్తోన్న హ్యూమన్‌ మెటానిమో వైర్‌స (హెచ్‌ఎంపీవీ) భారత్‌కూ వ్యాపించిందన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,441 పాయింట్లకు పైగా పతనమైంది...

వైరస్‌ కలకలం

78,000 దిగువ స్థాయికి సూచీ

388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

చిన్న కంపెనీల షేర్లు విలవిల

  • రూ.11 లక్షల కోట్ల సంపద ఫట్‌

  • సెన్సెక్స్‌ 1,258 పాయింట్లు పతనం

ముంబై: చైనాను వణికిస్తోన్న హ్యూమన్‌ మెటానిమో వైర్‌స (హెచ్‌ఎంపీవీ) భారత్‌కూ వ్యాపించిందన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,441 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి 1,258.12 పాయింట్ల (1.59 శాతం) నష్టంతో 77,964.99 వద్ద స్థిరపడింది. దాంతో సూచీ 78,000 కీలక స్థాయిని కోల్పోయినట్లైంది. నిఫ్టీ 388.70 పాయింట్లు (1.62 శాతం) క్షీణించి 23,616.05 వద్దకు జారింది. కొత్త వైరస్‌ కలకలంతో పాటు మూడో త్రైమాసికంలో కంపెనీల ఆదాయ వృద్ధిపై ఆందోళనలు, రూపాయి క్షీణత -డాలర్‌ బలోపేతం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానాలపై అనిశ్చితి, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి వంటి అంశాలు మార్కెట్‌ను మరింత కుంగదీశాయి. దాంతో మదుపరులు అన్ని విభాగాలు, రంగాల షేర్లలో అమ్మకాలను పోటెత్తించారు. మార్కెట్‌ సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.10.98 లక్షలకు పైగా పతనమై రూ.438.79 లక్షల కోట్లకు (5.11 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ మినహా అన్నీ నష్టపోయాయి. టాటా స్టీల్‌ షేరు 4.41 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 3 శాతానికి పైగా విలువను కోల్పోయాయి.

  • ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి సంస్థల షేర్లలో మదుపరులు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 3.17 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.44 శాతం క్షీణించాయి.

  • అన్ని రంగాల సూచీలూ నేలచూపు చూశాయి. యుటిలిటీస్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 4.16 శాతం పతనమైంది. పవర్‌, సర్వీసెస్‌, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎనర్జీ సూచీలు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.

  • బీఎ్‌సఈలో 4,244 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,530 నష్టపోయాయి. 611 లాభపడగా, 114 యథాతథంగా ముగిశాయి. 113 సంస్థల షేర్లు 52 వారాల కనిష్ఠానికి జారుకోగా.. 176 ఏడాది గరిష్ఠాన్ని తాకాయి.

  • ఎన్‌ఎ్‌సఈ విషయానికొస్తే, నిఫ్టీతో పాటు బ్యాంక్‌ నిఫ్టీ సూచీలు 200 రోజుల చలన సగటు (డీఎంఏ) కిందికి పడిపోయాయి.


  • మార్కెట్‌ భారీగా నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. గత శుక్రవారం సెషన్‌లో సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయాయి.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి రూ.85.68 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నష్టపోయిన రూపీ.. ఆర్‌బీఐ జోక్యంతో మళ్లీ పుంజుకుందని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 76.27 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

  • దేశ రాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.79,000కు దిగిరాగా.. కిలో వెండి రూ.300 పెరిగి రూ.90,700కు చేరుకుంది. కాగా, అంతర్జాతీయ విపణిలో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 2,659.60 డాలర్లు, సిల్వర్‌ 30.87 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

Updated Date - Jan 07 , 2025 | 06:29 AM