Share News

డాలర్‌తోనే రూపాయికి కష్టాలు

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:44 AM

డాలర్‌ మారకం రేటు పుంజుకోవడం వల్లే.. మన రూపాయి మారకం రేటు క్షీణిస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు...

డాలర్‌తోనే రూపాయికి కష్టాలు

ఆర్‌బీఐ జోక్యం మంచిది కాదు: రాజన్‌

దావోస్‌ (స్విట్జర్లాండ్‌): డాలర్‌ మారకం రేటు పుంజుకోవడం వల్లే.. మన రూపాయి మారకం రేటు క్షీణిస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల హెచ్చరికలు డాలర్‌ మారకం రేటును మరింత పెంచుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదన్నారు. అలా చేస్తే మన ఎగుమతులూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డాలర్‌-రూపీ మారకం రేటులో మరీ తీవ్రమైన ఆటుపోట్లు ఏర్పడితే తప్ప ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని రాజన్‌ స్పష్టం చేశారు.


బడ్జెట్‌లో సామాన్య ప్రజానీకంపై దృష్టి పెట్టండి

రాజకీయంగా పటిష్ఠ స్థితిలో ఉన్న కేంద్రంలోని ఎన్‌డీఏ 3.0 ప్రభుత్వం రాబోయే కేంద్ర బడ్జెట్లో వృద్ధిని, ఉపాఽధి కల్పనను ఉత్తేజితం చేయగల, సంక్లిష్టమైన సంస్థాగత సంస్కరణలకు నడుం బిగించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సూచించారు. ఆర్థిక వ్యవస్థను సుస్థిర వృద్ధి బాటలో నడపడమే బడ్జెట్‌ ప్రాథమిక లక్ష్యం కావాలన్నారు. కేవలం వృద్ధిని పెంచితే చాలదని, సమాజంలో అసమానతలు తగ్గించాలన్నారు. ప్రధానంగా దేశ జనాభాలో దిగువ అర్ధభాగం భారీ వినియోగ శక్తి వృద్ధికి చోదకంగా ఉంటుందని చెప్పారు. వారు మరింతగా సంపాదించినట్టయితే మరింతగా వ్యయం చేస్తారని, ఫలితంగా ఉత్పత్తి పెరిగి మరిన్ని ఉపా ధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సుబ్బారావు చెప్పారు.

Updated Date - Jan 24 , 2025 | 05:44 AM