Share News

Tesla Trillion Dollar Package: మస్క్‌కు టెస్లా ట్రిలియన్‌ డాలర్ల ఆఫర్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:14 AM

అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా సారథి ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే నం.1 ధనవంతుడన్న విషయం తెలిసిందే. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ డేటా ప్రకారం.. శుక్రవారం నాటికి ఆయన సంపద విలువ 378 బిలియన్‌ డాలర్లు...

Tesla Trillion Dollar Package: మస్క్‌కు టెస్లా ట్రిలియన్‌ డాలర్ల ఆఫర్‌

ప్రపంచ కార్పొరేట్‌ రంగంలో ఇదే అతిపెద్ద పారితోషిక ప్యాకేజీ

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా సారథి ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే నం.1 ధనవంతుడన్న విషయం తెలిసిందే. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ డేటా ప్రకారం.. శుక్రవారం నాటికి ఆయన సంపద విలువ 378 బిలియన్‌ డాలర్లు. అంటే, 37,800 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.33.26 లక్షల కోట్ల పైమాటే. తాజాగా ఈ కుబేరుడికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించే ఆఫర్‌ దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. టెస్లా బోర్డు మస్క్‌కు భవిష్యత్‌లో ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసే పనితీరు ఆధారిత భారీ పారితోషిక ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. ప్రపంచ కార్పొరేట్‌ రంగంలో ఇప్పటివరకిదే అతిపెద్ద ప్యాకేజీ. బీవైడీ, ఇతర చైనా కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక విక్రయాలు భారీగా తగ్గి డీలాపడిన టెస్లా.. ఈ ప్యాకేజీలో భాగంగా మస్క్‌కు అత్యంత భారీ లక్ష్యాలను నిర్దేశించింది.

కంపెనీ మార్కెట్‌ విలువను (క్యాపిటలైజేషన్‌) ప్రస్తుత 1.12 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్‌ డాలర్ల (8.5 లక్షల కోట్ల డాలర్లు) స్థాయికి చేర్చడం, కంపెనీ కార్ల వార్షిక విక్రయాలను గత ఏడాదిలో నమోదైన 20 లక్షల లోపు యూనిట్ల నుంచి 2 కోట్ల యూనిట్లకు పెంచడం, రోబో ట్యాక్సీలు, హ్యుమనాయిడ్‌ రోబోల అమ్మకాలను 10 లక్షల యూనిట్లకు పెంచడం అందులో ప్రధానమైనవి.

లక్ష్యాలన్నింటినీ చేరుకుంటేనే,ప్యాకేజీలో భాగంగా ఆఫర్‌ చేసిన 42.37 కోట్ల కంపెనీ షేర్లు మస్క్‌కు దక్కుతాయి. ప్రస్తుతం వాటి విలువ 8,780 కోట్ల డాలర్లు. పదేళ్లలో కంపెనీ మార్కెట్‌ విలువ 8.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరితే ఆయన వాటా షేర్ల మొత్తం విలువ ట్రిలియన్‌ డాలర్లు దాటనుంది. ఈ ప్యాకేజీ ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే, మస్క్‌ కంపెనీలో కనీసం ఏడున్నరేళ్లు కొనసాగాలి. పదేళ్లలో లక్ష్యాలన్నింటినీ సాధించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..

బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..

Updated Date - Sep 06 , 2025 | 03:23 AM