Share News

Tech Mahindra Q4 Results: టెక్‌ మహీంద్రా లాభం జూమ్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:27 AM

టెక్‌ మహీంద్రా క్యూ4లో 76. శాతాం లాభం పెరిగింది. ఒక్కో షేరుకు రూ.30 తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఏడాది మొత్తానికి 80% లాభ వృద్ధి నమోదు.

Tech Mahindra Q4 Results: టెక్‌ మహీంద్రా  లాభం జూమ్‌

  • ఒక్కో షేరుకు రూ.30 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 76.5 శాతం వృద్ధి చెంది రూ.1,166.7 కోట్లకు పెరిగింది. ఆదాయం 4 శాతం పెరిగి రూ.13,384 కోట్లుగా నమోదైంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే మాత్రం కంపెనీ లాభంలో 19 శాతం, ఆదాయంలో కేవలం 1 శాతం వృద్ధి నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి టెక్‌ మహీంద్రా నికర లాభం 80 శాతం వృద్ధితో రూ.4,252 కోట్లకు, ఆదాయం 2 శాతం పెరుగుదలతో రూ.52,988 కోట్లకు చేరుకుంది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండ టంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.30 తుది డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • క్యూ4లో కంపెనీ 79.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.6,800 కోట్లు) విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకుంది. ఏడాది క్రితం ఇదే కాలానికి లభించిన ఆర్డర్లతో పోలిస్తే 60 శాతం అధికమిది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి లభించిన కొత్త డీల్స్‌ విలువ 270 కోట్ల డాలర్లు (దాదాపు రూ.23,000 కోట్లు)గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 42 శాతం ఎక్కువ.


  • క్యూ3తో పోలిస్తే క్యూ4లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,757 మేర తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 3,276 మంది తగ్గారు. దాంతో, ఈ మార్చి 31 నాటికి టెక్‌ మహీంద్రాలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,48,731కి జారుకుంది. కాగా, మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 11.8 శాతంగా నమోదైంది.

  • గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ నియామకాల ద్వారా 6,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలన్న లక్ష్యాన్ని మించి 6,100 నియామకాలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) క్యాంపస్‌ హైరింగ్‌ లక్ష్యాన్ని వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. ట్రంప్‌ సుంకాలతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో ఐటీ సేవలకు డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణంగా పేర్కొంది.

  • ఈ మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ వద్ద రూ.7,656 కోట్ల నగదు, అందుకు తత్సమానమైన నిల్వలు ఉన్నాయని టెక్‌ మహీంద్రా వెల్లడించింది.

Updated Date - Apr 25 , 2025 | 05:28 AM