Tata Motors: టాటా మోటార్స్.. ప్చ్
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:07 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి టాటా మోటార్స్ లాభం రూ.4,003 కోట్లకు పరిమితమైంది
క్యూ1 లాభంలో 62 శాతం క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి టాటా మోటార్స్ లాభం రూ.4,003 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.10,587 కోట్ల పోలిస్తే లాభం 62.2ు క్షీణించింది. కంపెనీకి చెందిన అన్ని విభాగాల్లోనూ వాహన విక్రయాలు తగ్గడం, అమెరికా సుంకాల కారణంగా కంపెనీ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) లాభదాయకత క్షీణించడం,బేస్ ఎఫెక్ట్ అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. క్యూ1లో కంపెనీ ఆదాయం సైతం వార్షిక ప్రాతిపదికన 2.5ు తగ్గి రూ.1,04,407 కోట్లుగా నమోదైంది. 2024-25 క్యూ1లో ఆదాయంరూ.1,07,102 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్ ప్రతికూలతల్లోనూ బలమైన వ్యాపార మూలాల మద్దతుతో కంపెనీ లాభాదాయక త్రైమాసికాన్ని నమోదు చేసింది. అమెరికా సుంకాలపైనా స్పష్టత వచ్చింది. పండగ సీజన్ గిరాకీ ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల విక్రయాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బలమైన పనితీరు కనబరచడంపై ప్రధానంగా దృష్టిసారించాం’’ అని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫఓ) పీబీ బాలాజీ అన్నారు.
మరిన్ని విషయాలు..
బ్రిటన్, యూరప్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై అమెరికా సుంకాలు పెంచడంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జేఎల్‌ఆర్ ఆదాయం 9.2ు తగ్గి 660 పౌండ్లకు పడిపోయింది. యూఎ్‌సతో యూకే, యూరప్ ఇప్పటికే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మున్ముందు త్రైమాసికాల్లో కంపెనీ ఆదాయంపై సుంకాల ప్రభావం తగ్గుముఖం పట్టనుందని జేఎల్‌ఆర్ సీఈఓ అడ్రియన్ మార్డెల్ అన్నారు.
ఈ క్యూ1లో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు 10.1ు తగ్గి 1,24,800 యూనిట్లుగా నమోదయ్యాయి. సాధారణంగానే క్యూ1లో వాహనాలకు గిరాకీ తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ మాత్రం ఆశాజనకంగా ఉంది. జూన్ త్రైమాసికంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు 6ు తగ్గి 88,000 యూనిట్లకు పరిమితమయ్యాయి.