మైండ్‌స్పేస్ రీట్ చేతికి సస్టెయిన్ ప్రాపర్టీస్
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:06 AM
రియల్టీ రంగంలోని మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్ )హైదరాబాద్‌లో సస్టెయిన్ ప్రాపర్టీస్ కంపెనీని కొనుగోలు చేసింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రియల్టీ రంగంలోని మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్ )హైదరాబాద్‌లో సస్టెయిన్ ప్రాపర్టీస్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ చేతిలో 18.2 లక్షల కార్యాలయ స్థలం అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.2038 కోట్లు కాగా ఈక్విటీ విలువ రూ.613 కోట్లని మైండ్‌స్పేస్ రీట్ రెగ్యులేటరీ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది. సస్టెయిన్ ప్రాపర్టీ్‌సలో నూరు శాతం వాటాల కొనుగోలుకు తాము కుదుర్చుకున్న ఈ డీల్ మార్చి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని ‘‘కామర్‌జోన్, రాయదుర్గ్’’లో క్వాల్‌కామ్ కంపెనీకి లీజుకిచ్చిన ఈ కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేయడానికి తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకుగాను సస్టెయిన్ ప్రాపర్టీస్ వాటాదారులకు రూ.379.08 యూనిట్ విలువతో 1,61,68,090 మైండ్‌స్పేస్ రీట్ యూనిట్లు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించిందని పేర్కొంది. ఇందుకోసం కంపెనీ రూ.1400 కోట్ల రుణం సమీకరిస్తోంది.