Share News

Sun TV Group: సన్‌ టీవీలో ఇంటి పోరు

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:16 AM

దక్షిణాదిలో బలమైన నెట్‌వర్క్‌ కలిగిన సన్‌ టీవీ గ్రూప్‌ ప్రమోటర్ల కుటుంబంలో అగ్గి రాజుకుంది. సన్‌ టీవీ గ్రూప్‌ అధినేతగా ఉన్న తన అన్న కళానిధి మారన్‌, వదిన కావేరి మారన్‌ కుట్ర,

Sun TV Group: సన్‌ టీవీలో ఇంటి పోరు

  • కళానిధి మారన్‌కు తమ్ముడు దయానిధి లీగల్‌ నోటీసు

  • అక్రమంగా షేర్ల బదిలీకి పాల్పడినట్లు ఆరోపణ

చెన్నై (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో బలమైన నెట్‌వర్క్‌ కలిగిన సన్‌ టీవీ గ్రూప్‌ ప్రమోటర్ల కుటుంబంలో అగ్గి రాజుకుంది. సన్‌ టీవీ గ్రూప్‌ అధినేతగా ఉన్న తన అన్న కళానిధి మారన్‌, వదిన కావేరి మారన్‌ కుట్ర, మోసపూరితంగా 2003లో 12 లక్షల షేర్లను ఏకపక్షంగా కేటాయించుకోవడం ద్వారా కంపెనీలో మెజారిటీ వాటాలను చేజిక్కించుకున్నారని చెన్నై సెంట్రల్‌ లోక్‌సభ సభ్యుడు, ఆయన సోదరుడు దయానిధి మారన్‌ ఆరోపించారు. అంతేకాకుండా కళానిధి, కావేరి మారన్‌తో పాటు వారి సన్నిహితులైన కంపెనీకి చెందిన మరో ఆరుగురికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. సన్‌ టీవీ గ్రూప్‌ పూర్తిగా తన ఆజమాయిషీ లో ఉంచుకునేలా కళానిధి మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు దయానిధి ఆ నోటీసుల్లో ఆరోపించారు.


ఏకపక్షంగా 12 లక్షల షేర్ల బదిలీ: 2003లో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ షేర్ల విలువ ఒక్కొక్కటి సుమారు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్యన ఉంటే, తన అన్న, వదిన ఆ 12 లక్షల షేర్లను కేవలం రూ.10 ముఖ విలువకే ఏకపక్షంగా కేటాయించుకున్నట్టు దయానిధి మారన్‌ తెలిపారు. ఈ కేటాయింపులకు తన ఆమోదం గానీ, మరో ప్రమోటరైన కరుణానిధి కుటుంబసభ్యుల ఆమోదం గానీ లేదని స్పష్టం చేశారు.


డివిడెండ్ల రూపంలో రూ.5,926 కోట్ల లబ్ది: ఈ అక్రమ కేటాయింపుల ద్వారా 2003 నుంచి 2023 వరకు డివిడెండ్ల రూపంలోనే కళానిధి మారన్‌, ఆయన భార్య రూ.5,926 కోట్ల అనుచిత లబ్ది పొందారని ఆరోపించారు. గత ఏడాది (2024) కూడా వీరిరువురు సన్‌ టీవీ నుంచి డివిడెండ్‌ రూపంలో రూ.455 కోట్ల లబ్ది పొందినట్టు తెలిపారు. కరుణానిధి కుటుంబ వాటా బదిలీకైతే కళానిధి మారన్‌, ఆయన భార్య పైసా కూడా చెల్లించలేదన్నారు. కంపెనీని, కంపెనీ ఆస్తులను చేజిక్కించుకునేందుకే వీరు కుట్రపూరితంగా ఈ పని చేసినట్టు దయానిధి మారన్‌ తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేరంతో సన్‌ టీవీలోని ఇతర వాటాదారులకు పూడ్చలేని నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వారం రోజుల్లో ఈ మోసాన్ని సరిదిద్ది తమ వాటాను పునరుద్ధరించక పోతే కోర్టుకు వెళతానని దయానిధి మారన్‌ ఆ నోటీసుల్లో హెచ్చరించారు.


అంతా సక్రమమే: కాగా సన్‌ టీవీ నెట్‌వర్క్‌ దీనిపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వాటాల కేటాయింపు, బదిలీ అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది. సన్‌ టీవీ నెట్‌వర్క్‌లో కళానిధి మారన్‌ 75 శాతం వాటా కలిగి ఉన్నారని తెలిపింది. మారన్‌ సోదరుల మధ్య తలెత్తిన విభేదాలు పూర్తిగా కుటుంబపరమైనవి, వ్యక్తిగతమైనవని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వివాదం సంస్థ వ్యాపార కార్యకలాపాలపై ఎంత మాత్రం ప్రభావం చూపించదని పేర్కొంది. కాగా ఈ వార్తలతో శుక్రవారం ఇంట్రాడేలో సన్‌ టీవీ షేరు ఐదు శాతానికిపైగా నష్టపోయి చివరకు 1.09 శాతం నష్టంతో రూ.606.80 వద్ద క్లోజైంది.

Updated Date - Jun 21 , 2025 | 05:17 AM