Stock Market : మార్కెట్ జోరుకు బ్రేకులు
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:13 AM
కొత్త ఏడాదికి శుభారంభంగా తొలి రెండు సెషన్లలో భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ చతికిలపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు ఒక శాతం

ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు..
సెన్సెక్స్ 720 పాయింట్లు పతనం
ముంబై: కొత్త ఏడాదికి శుభారంభంగా తొలి రెండు సెషన్లలో భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ చతికిలపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు ఒక శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 వద్దకు జారుకుంది. నిఫ్టీ 183.90 పాయింట్లు కోల్పో యి 24,004.75 వద్ద స్థిరపడింది. వచ్చే వారంలో డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. డాలర్ బలోపేతం, రూపాయి క్షీణత, అధిక వాల్యుయేషన్లు వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీశాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 18 నష్టపోయాయి.
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 4 పైసలు తగ్గి రూ.85.79 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి.
గత నెల 27తో ముగిసిన వారంలో భారత్ వద్ద విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు 411 కోట్ల డాలర్ల మేర తగ్గి 64,027 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. గత వారంలోనూ నిల్వలు 847 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. గత కొన్ని వారాలుగా నిల్వలు క్షీణిస్తూ వస్తున్నాయి.
ఐపీఓ సమాచారం: గుజరాత్‌కు చెందిన రాజ్‌పుతానా స్టెయిన్‌లె్‌స లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.9 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్‌కు చెందిన 35 లక్షల ఈక్విటీ షేర్లను సైతం జారీ చేయనుంది.
క్వాడ్రంట్ ఫ్యూచర్ రూ.290 కోట్ల ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.275-290గా నిర్ణయించింది.