Stock Market Losses: మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి
ABN , Publish Date - May 31 , 2025 | 03:31 AM
స్టాక్‌మార్కెట్ వారాంతం రోజున తిరిగి నష్టాల్లోకి జారుకుంది. ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా వాణిజ్య అస్థిరతలు, ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్‌ను క్షీణత వైపు నడిపించాయి.
ముంబై: స్టాక్‌మార్కెట్ వారాంతం రోజున మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను అమెరికా అప్పీల్ కోర్టు పాక్షికంగా పునరుద్ధరించడంతో మరోసారి వాణిజ్య అస్థిరతలు ఏర్పడడం, ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్‌ను పతన బాటలోకి నడిపాయి. జీడీపీ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావ డం కూడా ఇందుకు కారణమని విశ్లేషకులంటున్నారు. శుక్రవారం పూర్తిగా ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 182.01 పాయింట్లు నష్టపోయి 81,451.01 వద్ద ముగియగా నిఫ్టీ 82.90 పాయింట్ల నష్టంతో 24,750.70 వద్ద క్లోజైంది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 270.07 పాయింట్లు, నిఫ్టీ 102.45 పాయింట్లు నష్టపోయాయి.
అర్షద్ వార్సిపై సెబీ నిషేధం: సాధనా బ్రాడ్‌కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలంటూ యూట్యూబ్‌లో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే వీడియోలు పోస్ట్ చేసినందుకు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ఆయన భార్య మరియా గొరెట్టి, మరో 57 సంస్థలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి 1 నుంచి 5 సంవత్సరాల పాటు సెబీ నిషేధించింది. దీనికి తోడు వార్సి, మరియాలపై ఒక్కొక్కరికి రూ.5 లక్షల జరిమానా విధించింది. మిగతా 57 సంస్థలపై రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్యలో జరిమానా విధించింది. ఈ లావాదేవీ ద్వారా అక్రమంగా ఆర్జించిన రూ.58.01 కోట్లు 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని వార్సి, మరియాలతో పాటు 57 సంస్థలను కూడా ఆదేశించింది.