స్టార్‌లింక్ కాస్ట్‌లీనే
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:44 AM
దేశ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో మరో విప్లవాత్మక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్టార్‌లింక్ సంస్థ త్వరలోనే మన దేశంలోనూ తన ఉపగ్రహ ఆధారిత...
హార్డ్‌వేర్‌కు రూ.33,000
నెలవారీ చార్జీ రూ.3,000
2 నెలల్లో సేవలు షురూ!
న్యూఢిల్లీ: దేశ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో మరో విప్లవాత్మక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్టార్‌లింక్ సంస్థ త్వరలోనే మన దేశంలోనూ తన ఉపగ్రహ ఆధారిత (శాట్‌లైట్ బేస్డ్) బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించనుంది. టెలికాం శాఖ (డాట్) నుంచి ఇప్పటికే ఇందుకు ప్రాథమిక అనుమతి (ఎల్‌ఓఐ) పొందింది.స్పెక్ట్రమ్ కేటాయింపులు లభించిన వెంటనే ఈ సేవలు ప్రారంభించనుంది. దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే స్టార్‌లింక్‌కు స్పెక్ట్రమ్ కేటాయింపులు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్పెక్ట్రమ్ కేటాయింపులు లభించిన వెంటనే ఇతర అనుమతులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేసుకుని రెండు నెలల్లో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించాలని స్టార్‌లింక్ యోచిస్తోంది. ప్రారంభంలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవల బ్యాండ్‌విడ్త్ సామర్ధ్యం 600 నుంచి 700 గిగాబైట్స్ పర్ సెకండ్ (జీబీపీఎ్‌స)గా ఉంటుందని అంచనా. దీంతో మన దేశ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లోనూ ఇవే టారిఫ్‌లు
భారత్‌లో తాను ప్రారంభించే ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల టారి్‌ఫలను స్టార్‌లింక్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఖాతాదారులు నెలకు కనీసం రూ.3,000 టారి్‌ఫగా చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు హార్డ్‌వేర్ కోసం వన్‌టైమ్ చార్జీల కింద మరో రూ.33,000 (జీఎ్‌సటీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అంటే స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే ఖాతాదారులు తొలి ఏడాదే కనీసం రూ.69,000 వరకు చెల్లించాలి. బంగ్లాదేశ్‌లోనూ స్టార్‌లింక్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఇవే చార్జీలు వసూలు చేస్తోంది.
టెల్కోల ఆందోళన
గత ఏడాది డిసెంబరు నాటికి మన దేశంలో వైర్‌లెస్, వైర్‌లైన్ పద్దతిలో 94.49 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుకుంటున్నారు. ఇందులో మొబైల్ ఆధారిత వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారుల సంఖ్య 90.4 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇందుకు తోడుకానున్నాయి. తన సేవలు ప్రారంభించిన తొలి ఏడాదే కనీసం కోటి మంది ఖాతాదారులను సంపాదించాలని స్టార్‌లింక్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఈ మార్కెట్‌పై ఎక్కడ తమ గుత్తాధిపత్యానికి గండి పడుతుందోనని టెలికాం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. తమలాగే ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీలకూ వేలం ద్వారానే స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ప్రభుత్వం అందుకు తిరస్కరించడంతో కనీసం స్పెక్ట్రమ్ ధరైనా తమకు కేటాయించిన స్థాయిలో ఉండాలని కోరాయి. ట్రాయ్ దీనిపై సానుకూలంగా స్పందించడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు మాత్రం స్టార్‌లింక్ వంటి సంస్థల బ్రాడ్‌బ్యాండ్ సేవలతో టెలికాం కంపెనీల సేవలకు పెద్ద పోటీ ఏమీ ఉండదని చెబుతున్నాయి. ఈ కంపెనీలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో టెలికాం కంపెనీలతో పోటీపడినా టారి్‌ఫలపరంగా పట్టణ ప్రాంతాల్లో పోటీపడడం కష్టమని తేల్చేస్తున్నాయి.
ప్రత్యేకత ఏమిటంటే..
ప్రస్తుతం మన దేశంలోని టెలికాం కంపెనీలు కేబుల్ లేదా మొబైల్ వైర్‌లెస్ ద్వారా తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాల్లోని గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని ఖాతాదారులకు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలంటే, ఆ ప్రాంతాలకు కేబుల్ వేయడం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాలి. ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ విధానంలో భూ దిగువ కక్ష్య (ఎల్‌ఈఓ) పరిభ్రమించే ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్‌ను నేరుగా ఖాతాదారుల హార్డ్‌వేర్‌కు పంపించడం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తారు. ప్రపంచంలో దాదాపు వందకుపైగా దేశాల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..