Sovereign Gold Bond final redemption: సావరిన్ గోల్డ్ బాండ్స్ తెచ్చిన భారీ రిటర్న్స్
ABN , Publish Date - May 03 , 2025 | 08:42 PM
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 8 ఏళ్ల క్రితం ఈ స్క్రీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు మూడింతల లాభం పొందనున్నారు. అంటే 221% రిటర్న్స్ అన్నమాట.
Sovereign Gold Bond final redemption: సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్నవారికి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం ఆర్బీఐ(RBI) తెచ్చిన ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ఒక రకంగా జాక్‌పాట్ తగిలిందనే అనుకోవాలి. 2017 మే నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించిన రిడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 9ని మెచ్యూర్ తేదీగా నిర్ణయించింది. గ్రాము బంగారం ధరను రూ.9,486గా నిర్ణయించారు. అంటే అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లభిస్తుంది. దీనికి గోల్డ్ బాండ్లపై ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50 శాతం నామమాత్ర వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్‌బీఐ చెల్లిస్తుంది.
గ్రాము బంగారం ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్‌కు ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను రూ.9486గా నిర్ణయించారు. ఏప్రిల్ 28- మే 2 మధ్య ధరల సగటు ఆధారంగా గ్రాము ధరను నిర్ణయించారు. ఇటీవల గోల్డ్ ధర పది గ్రాములకు రూ.1లక్ష మార్కు దాటిన వేళ పసిడి బాండ్లు రిడెంప్షన్‌కు రావడం అప్పటి మదుపర్లకు జాక్ పాట్ అనే చెప్పాలి.
పైగా సావరిన్ గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్ చేసుకోగా వచ్చిన మొత్తానికి ఒక్క పైసా పన్ను చెల్లించక్కర్లేదు. 2015-16 బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే, చివరి సారిగా 2024 ఫిబ్రవరి 12-16 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం ఆపేసింది. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఆర్‌బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లు.
2017 మే నెలలో 2017-18 సిరీస్ 1 పసిడి బాండ్లను జారీ చేశారు. అప్పట్లో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధరను రూ.2,951గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్