Share News

‘సిప్‌’ కొనసాగించాలా.. వద్దా?

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:52 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం ‘బేర్‌’ పట్టులో ఉంది. దాదాపు ఈ ఏడాది ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగుతూ వస్తోంది. ఈ డౌన్‌ట్రెండ్‌ ఇంకా ఎంత కాలమో ఎవరూ అంచనా...

‘సిప్‌’ కొనసాగించాలా.. వద్దా?

స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం ‘బేర్‌’ పట్టులో ఉంది. దాదాపు ఈ ఏడాది ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగుతూ వస్తోంది. ఈ డౌన్‌ట్రెండ్‌ ఇంకా ఎంత కాలమో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఫిబ్రవరి నెలలో సెన్సెక్స్‌ 5.5 శాతానికి పైగా నష్టపోయింది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా రూ.40 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లలో ఈ పతనం మరింత ఎక్కువగా ఉంది. మరి ఇలాంటప్పుడు స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ విభాగంలో మదుపు చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) నిర్వహించే క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (సిప్‌) కొనసాగాలా? వద్దా? అనే ప్రశ్న మదుపరుల్లో తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.


పెట్టుబడులు ఆపొద్దు

ప్రస్తుత మార్కెట్‌ పతనాన్ని చూసి సిప్‌ ఆపటం ఏ మాత్రం మంచిది కాదు. నెలనెలా అందే సిప్‌ మొత్తాలను ఫండ్‌ మేనేజర్లు ఎప్పటికప్పుడు తమదైన పెట్టుబడి వ్యూహంతో మంచి కంపెనీల షేర్లలో మదుపు చేస్తుంటారు. మార్కెట్‌ ఆటుపోట్లకు లోనైంత మాత్రాన ఈ ఫండ్స్‌ దీర్ఘకాలిక రాబడులు దెబ్బతింటాయని భావించలేం. కాకపోతే ఇది ఒక కుదుపు మాత్రమే. దీర్ఘకాలిక పొదుపు, సంపద సృష్టికి స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేసే ఎంఎ్‌ఫల ‘సిప్‌’ చక్కటి పెట్టుబడి సాధనమనే విషయం మర్చిపోవద్దు. కాకపోతే ఫండ్‌ పనితీరుతో పాటు ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డునీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.


దీర్ఘకాలిక పెట్టుబడి

లార్జ్‌ క్యాప్‌ షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో రాబడులు ఎక్కువ. కాకపోతే ఇందుకు ఓర్పు కూడా అవసరం. మిడ్‌ అండ్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కూ ఇది వర్తిస్తుంది. కనీసం పదేళ్లపాటైనా ఈ ఫండ్స్‌లో ‘సిప్‌’ పెట్టుబడులు కొనసాగిస్తే, పెద్దగా నష్ట భయం లేకుండా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు పొందవచ్చు.

లిక్విడిటీ

ఏ పెట్టుబడి అయినా అవసరమైనప్పుడు వెంటనే అమ్ముకుని నగదు చేసుకునే సౌలభ్యం ఉండాలి. స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేసే ఈక్విటీ పథకాలకూ ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఫండ్‌ మేనేజర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 15 నుంచి 20 శాతం నిధులను నగదు రూపంలో ఉంచుకుంటారు. ఎప్పుడు ఏ రిడెంప్షన్‌ ఒత్తిడి వచ్చినా తట్టుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. మార్కెట్‌ దిద్దుబాటులో ఉన్నప్పుడు ఇది మరింత అవసరం.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మదుపరులు ప్రస్తుతం మార్కెట్‌ పతనంలోనూ చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో మదుపు చేసే ఈక్విటీ పథకాల్లో సిప్‌ పెట్టుబడులు కొనసాగించడమే మంచిది.


Read Also : బిగ్ బాస్కెట్ బిగ్ టార్గెట్.. త్వరలో ఐపీఓకు, ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ..

March 2025 Bank Holidays Telugu: మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..

UPI 3.0: యూపీఐ 3.0 కొత్త ఫీచర్లు ఇవేనా

Updated Date - Mar 02 , 2025 | 03:52 AM