మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:21 AM
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 369 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్... చివరికి...
212 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
రూ.2.61 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 369 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. చివరికి 212.85 పాయింట్ల నష్టంతో 81,583.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్లు కోల్పోయి 24,853.40 వద్ద క్లోజైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు మళ్లీ కాస్త ఎగబాకడంతో పాటు ఈ వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడర్లు ముందు జాగ్రత్త ధోరణితో వ్యవహరించారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లపై త్వరలోనే సుంకాలను ప్రకటించనున్నారన్న వార్తలతో ఔషధ కంపెనీల షేర్లూ ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 నష్టాలు చవిచూడగా.. సన్‌ఫార్మా షేరు 2.18 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు 0.67 శాతం వరకు నష్టపోయాయి.
ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు..
తెలంగాణలో 32 శాతం వృద్ధి
గత నెలతో ముగిసిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్ పథకాల్లోని తెలంగాణ ఇన్వెస్టర్ల ఆస్తులు 32.08 శాతం పెరిగాయని మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తెలిపింది. ఫండ్ల నిర్వహణలోని వీరి సగటు ఆస్తులు 2024 మే నాటికి రూ.93,601.95 కోట్లుగా ఉండగా.. 2025 మే నాటికి రూ.1,23,633.60 కోట్లకు పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ఆధారంగా విశ్లేషించి మోతీలాల్ ఓస్వాల్ ఈ డేటాను విడుదల చేసింది.
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
సంజీవ్ భాసిన్‌పై సెబీ షేధం
మీడియా చానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్లను సిఫారసు చేసే మార్కెట్ నిపుణుడు, ఐఐఎ్‌ఫఎల్ మాజీ డైరెక్టర్ సంజీవ్ భాసిన్‌తోపాటు 11 మందిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధిస్తూ సెబీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాక్ రికమండేషన్లలో భాగంగా కొన్ని కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు సాయపడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సెబీ ఈ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా అయాచితంగా లబ్ది పొందిన రూ.11.37 కోట్లను తమ వద్ద జమ చేయాలని నియంత్రణ మండలి వారిని ఆదేశించింది.
నేడు సెబీ బోర్డు భేటీ
సెబీ బోర్డు బుధవారం సమావేశం కానుంది. ఈ భేటీలో భాగంగా నియంత్రణపరంగా పలు సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సెబీ చైర్మన్‌గా తుహిన్ కాంత పాండే ఈ మార్చి 1న బాధ్యతలు చేపట్టాక జరగనున్న రెండో బోర్డు సమావేశం ఇది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి