మూడు రోజుల తర్వాత లాభాల్లోకి
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:24 AM
వరుసగా మూడు రోజులు నష్టపోయిన ఈక్విటీ సూచీలు బుధవారం మళ్లీ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతోపాటు...
260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: వరుసగా మూడు రోజులు నష్టపోయిన ఈక్విటీ సూచీలు బుధవారం మళ్లీ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతోపాటు మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ఒకదశలో 350 పాయింట్ల వరకు పెరిగి 81,000 స్థాయిని దాటిన సెన్సెక్స్.. చివరికి 260.74 పాయింట్ల లాభంతో 80,998.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77.70 పాయింట్ల వృద్ధితో 24,620.20 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 18 రాణించాయి.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసల నష్టంతో రూ.85.87 వద్ద ముగిసింది. ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ఏబీఎ్‌ఫఆర్‌ఎల్) నుంచి ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అనుబంధ విభాగమైన ఫ్లిప్‌కార్ట్ ఇన్వె్‌స్టమెంట్స్ పూర్తిగా వైదొలిగింది. ఏబీఎ్‌ఫఆర్‌ఎల్‌లో తనకున్న 6 శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా రూ.583 కోట్లకు విక్రయించింది.
ఐపీఓకు ఏకస్
బెలగావీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఏకస్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని సమాచారం.
అపోలో మైక్రోసిస్టమ్స్ రూ.416 కోట్ల సమీకరణ
హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రోసిస్టమ్స్ ప్రిఫరెన్షియల్ పద్ధతిన ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా రూ.416 కోట్లు సమీకరించింది. ప్రమోటర్ గ్రూప్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్, ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌కు వీటిని జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి