Indian Stock Indices: ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ
ABN , Publish Date - May 17 , 2025 | 02:43 AM
ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో అమ్మకాల వల్ల శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయాయి.
200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: ఐటీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో పాటు భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక సూచీలు శుక్రవారం నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ 200.15 పా యింట్లు కోల్పోయి 82,330.59 వద్దకు జారుకుంది. నిఫ్టీ 42.30 పాయింట్ల నష్టంతో 25,019.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 13 నష్టపోయాయి. బీఎస్ ఈలోని స్మాల్‌క్యాప్ సూచీ 1.18 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.85 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీల్లో ఇండస్ట్రియల్స్, రియల్టీ, క్యాపిటల్‌గూడ్స్, యుటిలిటీస్, పవర్ 1.80 శాతం వరకు పెరిగాయి. ఐటీ, టెక్, ఫోకస్డ్ ఐటీ, మెటల్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 2,876.12 పాయింట్లు (3.61 శాతం), నిఫ్టీ 1,011.8 పాయింట్లు (4.21 శాతం) లాభపడ్డాయి.