State Bank of India: ఎస్‌బీఐ @ రూ.100 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:25 AM
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సరికొత్త రికార్డును సృష్టించింది. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లుకు చేరుకుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మంగళవారం...
సరికొత్త రికార్డు స్థాయికి బ్యాంక్ మొత్తం వ్యాపారం
ఆస్తుల మొత్తం విలువ పరంగా ప్రపంచంలో 43వ అతిపెద్ద బ్యాంక్
క్యూ2 లాభం రూ.21,137 కోట్లు
యెస్ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా రూ.4,593 కోట్ల రాబడి
ముంబై: దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సరికొత్త రికార్డును సృష్టించింది. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లుకు చేరుకుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మంగళవారం తెలిపారు. ఈ మార్చి చివరి నాటికి మరో రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి రూ.105 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. మొత్తం ఆస్తుల విలువపరంగా ప్రపంచంలో 43వ అతిపెద్ద బ్యాంక్‌గా నిలిచిందని సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం 23,050 శాఖలను నిర్వహిస్తోన్న ఎస్‌బీఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) చివరికల్లా మరో 500 బ్రాంచీలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
క్యూ2 లాభంలో 6.84 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.84 శాతం వృద్ధితో రూ.21,137 కోట్లకు పెరిగింది. ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా రూ.4,593 కోట్లు సమకూరడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ2లో బ్యాంక్ స్టాండ్ ఎలోన్ లాభం 10 శాతం పెరిగి రూ.20,160 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలంలో లాభం రూ.18,331 కోట్లుగా ఉంది. ఈ జూలై-సెప్టెంబరులో బ్యాంక్ రుణాలు 12.73 శాతం వృద్ధి చెందినప్పటికీ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) మాత్రం కేవలం 3.28 శాతం పెరిగి రూ.42,984 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 0.17 శాతం తగ్గి 2.97 శాతానికి జారుకోవడం ఇందుకు కారణమైంది.
రుణ వృద్ధి అంచనా 12-14 శాతానికి పెంపు
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి రుణ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 11 శాతం నుంచి 12-14 శాతానికి పెంచుతున్నట్లు శెట్టి తెలిపారు. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు, ఆదాయం పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆర్‌బీఐ నిబంధనల సడలింపులు సహా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన చర్యలు ఇందుకు దోహదపడనున్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చాక రుణాలు, ముఖ్యంగా వాహన విభాగంలో భారీగా పుంజుకున్నాయని అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఐఎం 3 శాతంగా నమోదుకావచ్చని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్‌పీఏలు 1.73 శాతం
బ్యాంక్ ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, ఈ జూలై-సెప్టెంబరులో కొత్తగా రూ.4,754 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. అయితే, ఈ సెప్టెంబరు చివరి నాటికి బ్యాంక్ మొత్తం మొండి బాకీలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్ ఎన్‌పీఏ) 1.73 శాతానికి తగ్గాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యల్పమని ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి అన్నారు. కాగా, క్యూ2లో బ్యాంక్ కేటాయింపులు రూ.5,400 కోట్లకు పెరిగాయి.
అమెరికా సుంకాల ప్రభావం లేదు..
భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలు ఆగస్టు చివర్లో అమలులోకి వచ్చినందున వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు సెప్టెంబరు త్రైమాసికాన్ని పరిగణనలోకి తీసుకోలేమని శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఇప్పటివరకైతే బ్యాంక్ రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యతపై ట్రంప్ సుంకాల ప్రభావం లేదన్నారు. సమీక్షా కాలానికి బ్యాంక్ విదేశీ రుణాల వాటా రూ.6.76 లక్షల కోట్లు కాగా, అందులో అమెరికా మార్కెట్ వాటా 25 శాతంగా ఉందన్నారు.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి