Share News

2030 నాటికి రూ.52 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:58 AM

భారత వాహన పరిశ్రమ పరిమాణం 2030 నాటికి రెట్టింపు స్థాయి 60,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.52 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చని టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక....

2030 నాటికి రూ.52 లక్షల కోట్లు

వచ్చే ఐదేళ్లలో ప్రపంచ నం.1

భారత వాహన పరిశ్రమపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

భారత ఆటోమొబైల్‌ రంగంపై గూగుల్‌-బీసీజీ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ పరిమాణం 2030 నాటికి రెట్టింపు స్థాయి 60,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.52 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చని టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో ఈ నివేదికను విడుదల చేశారు. అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా భారత ఆటోమొబైల్‌ రంగం తనదైన వినూత్న మార్గంలో దూసుకెళ్లుతోందని నివేదిక పేర్కొంది. ‘‘భారత్‌ ఇప్పటికే మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమగా ఎదిగింది. వచ్చే కొన్నేళ్లలో ఇండస్ట్రీ విప్లవాత్మక మార్పులకు లోనుకానున్నది. విద్యుత్‌ వాహనాల్లో అంతర్జాతీయ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డిజిటల్‌, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక వినియోగం వాహన తయారీదారులకు అత్యంత కీలకంగా మారింది. ఈ రంగం లో విజయం సాధించాలంటే, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణమైన వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుందని’’ బీసీజీ ఎండీ, పార్ట్‌నర్‌ నటరాజన్‌ శంకర్‌ అన్నారు. ప్రీ-పర్చేజ్‌ నుంచి ఇన్‌ వెహికిల్‌ ఎక్స్‌పీరియెన్స్‌, ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌ వరకు ఏఐ ద్వారా వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు వాహన విలువను పెంచేందుకు వీలుంటుందని గూగుల్‌ ఇండియా ఓమ్నీ చానల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రమేశ్‌ అన్నారు. ఆటో రంగంలో ఆవిష్కరణలు, వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఇండస్ట్రీతో భాగస్వామ్యానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..


  • భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు గిరాకీ వేగంగా పెరుగుతోంది. ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఒకరు ఈవీ కొనుగోలు ఆలోచనలో ఉన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుదారులు ఆధునిక హంగులు, ఆధునిక టెక్నాలజీ, సమగ్రతకు ప్రాధాన్యమిస్తుండగా.. ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ వినియోగదారులు సౌకర్యం, అందుబాటు ధరలో లభిస్తుందా..?, వాస్తవికత అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

  • ఈవీల కొనుగోలు నిర్ణయంలో ఆ ఇంటి మహిళల ప్రభావం 52 శాతంగా ఉంది. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ వాహనాల కొనుగోలు విషయంలో ఇది 38 శాతంగా ఉంది.

  • ఎలక్ట్రిక్‌, షేర్డ్‌, కనెక్టెడ్‌ మొబిలిటీ విభాగాల ఆదాయం 10,000 కోట్ల డాలర్ల (రూ.8.66 లక్షల కోట్లు) స్థాయికి చేరవచ్చని అంచనా.

  • భారత వాహన వినియోగదారుల వినూత్న, వేగంగా మారుతున్న ప్రాధాన్యాలను ఇండస్ట్రీ వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉంది.


భారత వాహన పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించనుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశీయ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ఇప్పటివరకు 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని, మిగతా రంగాలతో పోలిస్తే ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, జీఎస్‌టీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం పంచుతున్న రంగం కూడా ఇదేనన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) ఆధ్వర్యంలో శనివారం జరిగిన సదస్సులో మంత్రి ప్రసంగించారు. భారత్‌లో తయారైన వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందన్నారు. దేశంలో తయారవుతున్న మొత్తం మోటార్‌ సైకిళ్లలో 50 శాతం విదేశాలకు ఎగుమతవుతున్నాయని అన్నారు. 2014లో తాను కేంద్ర రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశీయ వాహన పరిశ్రమ సైజు రూ.7.5 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్‌ రంగ పరిశ్రమ సైజు రూ.22 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందన్నారు. కాగా, యూఎస్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ సైజు రూ.78 లక్షల కోట్లు, చైనా వాహన మార్కెట్‌ రూ.47 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి.

Updated Date - Jan 19 , 2025 | 01:58 AM