రూ.14 లక్షల కోట్లు
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:02 AM
ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) మన బ్యాంక్‌ల్లో భారీగా సొమ్ము జమ చేసుకుంటున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాం క్ (ఆర్‌బీఐ) తాజా డేటా ప్రకారం.. 2024 అక్టోబరు నాటికి భారత బ్యాంకుల్లో జమైన ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్లు....
పదేళ్ల గరిష్ఠానికి ప్రవాసుల డిపాజిట్లు
అధిక వడ్డీ రేట్లు, బలహీన రూపాయి నేపథ్యంలో దేశీయ బ్యాంకుల్లో జోరుగా సొమ్ము జమ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) మన బ్యాంక్‌ల్లో భారీగా సొమ్ము జమ చేసుకుంటున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాం క్ (ఆర్‌బీఐ) తాజా డేటా ప్రకారం.. 2024 అక్టోబరు నాటికి భారత బ్యాంకుల్లో జమైన ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 13.4 శాతం వృద్ధితో పదేళ్ల గరిష్ఠ స్థాయి 16,270 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.13.83 లక్షల కోట్లు) పెరిగాయి. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి రేటు. అంతర్జాతీయంగా మిగతా బ్యాంకులతో పోలిస్తే భారత్‌లోని బ్యాంకులు అధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండటంతో పాటు ఈమధ్య కాలంలో రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గడంతో ఎన్‌ఆర్‌ఐలు స్వదేశీ బ్యాంక్‌ల్లో సొమ్ము జమ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024 -25)లో అక్టోబరుతో ముగిసిన 7 నెలల్లో ఎన్‌ఆర్‌ఐలు మన బ్యాంకు ల్లో నికరంగా 1,190 కోట్ల డాలర్లు (రూ.1.01 లక్షల కోట్లు) డిపాజిట్ చేశారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి 1,470 కోట్ల డాలర్ల ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు దేశీయ బ్యాంకుల్లోకి వచ్చాయి.
ప్రస్తుతం దేశీయ బ్యాంకులు డిపాజిట్ల వేటలో ఉన్నాయి. రుణ డిమాండ్ తగ్గ నిధులు లేక డిపాజిట్లను పెంచుకునేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే బ్యాంకులు ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీగా డిపాజిట్ల సమీకరణపై దృష్టిసారించాయి. రూపాయి బలహీనపడుతుండటంతో ప్రవాసులు దేశీయ బ్యాంకుల్లో దాచుకోవడమే కాకుండా స్వదేశంలోని సంబంధీకులకు భారీ మొత్తా ల్లో డబ్బు పంపిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. గత ఏడాది ఎన్‌ఆర్‌ఐలు రెమిటెన్స్‌ల రూపంలో 12,900 కోట్ల డాలర్ల (రూ.10.96 లక్షల కోట్లు) భారత్‌కు పంపారు. గత ఏడాదికి అత్యధిక రెమిటెన్స్‌లు అందుకున్న దేశాల్లో భారత్ తన అగ్రస్థానాన్ని మరోసారి నెలబెట్టుకుంది.
3 రకాల ఖాతాలు అందుబాటులో..
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశీయ బ్యాంకుల్లో సొమ్ము దాచుకునేందుకు ప్రధానంగా మూడు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది.. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ) అకౌంట్. రెండోది.. నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ) అకౌంట్. మూడోది నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌ఓ) అకౌంట్. కాగా, ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) డిపాజిట్లను విదేశీ కరెన్సీలోనే జమ చేయాల్సి ఉంటుంది. ఆ సొమ్మును రూపాయల్లోకి మార్చుకునే వీలుండదు. ఎన్‌ఆర్‌ఈ అకౌంట్ మాత్రం విదేశాల్లో ఆర్జించిన సొమ్మును భారత కరెన్సీలో జమ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్‌ఆర్‌ఓ అకౌంట్ ద్వారా ప్రవాసులు స్వదేశంలో ఆర్జించిన సొమ్మును రూపాయల్లోనే ఆదా చేసుకునేందుకు వీలుంటుంది.
ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్లలో 50 శాతం వృద్ధి
2024 అక్టోబరుతో ముగిసిన ఏడాది కాలంలో ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్లు ఏకంగా 50 శాతం వృద్ధి చెందాయి. ప్రవాసుల మొత్తం డిపాజిట్లలో ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) ఖాతాల్లోని సొమ్ము వాటా 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి దాదాపు 20 శాతానికి చేరుకుంది. భారత బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఖాతాల్లోని సొమ్ము ఎక్స్ఛేంజ్ రేటు హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాదు, ఈ డిపాజిట్లలోని అసలు, వడ్డీపై భారత్‌లో పన్ను కట్టాల్సిన పనిలేదు. పైగా, పూర్తిగా వెనక్కి తీసుకునే సౌలభ్యమూ ఉంటుంది. కాగా, రూపాయి క్షీణత కారణంగా ఎన్‌ఆర్‌ఈ ఖాతాల్లో డిపాజిట్లు గణనీయంగా పెరిగాయని బ్యాంకులంటున్నాయి.