రిలయన్స్ లాభం 18,540 కోట్లు
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:53 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో డిసెంబరుతో...

రూ.2.43 లక్షల కోట్లకు ఆదాయం
కలిసివచ్చిన జియో టారిఫ్ పెంపు
మళ్లీ పుంజుకున్న ఓ2సీ వ్యాపారం
‘రిటైల్’ విభాగమూ వృద్ధి పథంలోనే..
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) గాను రిలయన్స్ రూ.18,540 కోట్ల (ఒక్కో షేరుకు రూ.13.70) ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి నమోదు చేసిన రూ.17,265 కోట్ల (ఒక్కో షేరుకు రూ. 12.76) లాభంతో పోలిస్తే 7.4ు వృద్ధి కనబరిచింది. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఆర్జించిన రూ.16,563 కోట్ల లాభంతో పోల్చినా గణనీయంగా పెరిగింది. సమీక్షా కాలానికి కంపెనీ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 8ు వృద్ధితో రూ.48,003 కోట్లుగా నమోదైంది. జియో టెలికాం సేవల టారి్‌ఫల పెంపుతో పాటు చమురు శుద్ధి వ్యాపార మార్జిన్లు పుంజుకోవడం, రిటైల్ వ్యాపారమూ ఆశాజనక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ3లో రిలయన్స్ ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రెవెన్యూ రూ.2.27 లక్షల కోట్లుగా ఉంది. ఈ డిసెంబరు చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ. 3,50,453 కోట్లుగా నమోదైంది. ఆ సమయానికి కంపెనీ రూ.2,34,988 కోట్ల నగదు, నగదుకు సమానమైన నిల్వలను కలిగి ఉంది. దాంతో కంపెనీ నికర రుణ భారం రూ.1,15,465 కోట్లకు తగ్గింది.
ఓ2సీ
రిలయన్స్‌కు చెందిన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) వ్యాపార విభాగ ఆదాయం ఈ క్యూ3లో 6 శాతం వృద్ధితో రూ.1,49,595 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 2.4 శాతం పెరిగి రూ.14,402 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభాల మార్జిన్ 9 శాతంగా నమోదైంది. దేశీయంగా బలమైన గిరాకీతో పాటు ఉత్పత్తి పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది.
ఆయిల్ అండ్ గ్యాస్
కంపెనీకి చెందిన ముడిచమురు, సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తి విభాగ ఆదాయం ఈ క్యూ3లో 5.2 శాతం తగ్గి రూ.6,370 కోట్లకు జారుకోగా.. నిర్వహణ లాభం 4.1 శాతం తగ్గుదలతో రూ.5,565 కోట్లకు పరిమితమైంది. ఏపీలోని కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణమైంది.
జియో ప్లాట్‌ఫామ్స్
టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహా డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి చేర్చడం ద్వారా ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం ఈ క్యూ3లో 26 శాతం వృద్ధి చెంది రూ.6,861 కోట్లకు పెరిగింది. ఆదాయం 19.2 శాతం పెరిగి రూ.38,750 కోట్లకు చేరుకుంది. రిలయన్ జియో టారిఫ్ పెంపు ఇందుకు ప్రధానంగా దోహదపడింది. క్యూ3లో జియోకు ఒక్కో వినియోగదారు నుంచి లభించిన సగటు ఆదాయం (ఆర్పూ) రూ.203.3కు చేరింది. కంపెనీ ఆర్పూ రూ.200 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. కాగా, డిసెంబరు చివరినాటికి జియో కస్టమర్ల సంఖ్య 48.2 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ రిటైల్
గడిచిన 3 నెలలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.3,458 కోట్లకు చేరుకోగా.. స్థూల ఆదాయం 8.7 శాతం పెరిగి రూ.90,333 కోట్లకు ఎగబాకింది. గత త్రైమాసికంలో కొత్తగా 779 స్టోర్లను ప్రారంభించినట్లు, దాంతో మొత్తం విక్రయ కేంద్రాల సంఖ్య 19,102కు చేరుకుందని సంస్థ తెలిపింది.