Currency Notes Sanjay Malhotra Signature: రూ.100, రూ.200 నోట్లపై సంతకంలో మార్పు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:51 PM
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉన్న కొత్త రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త గవర్నర్ సంతకం ఉన్న నోట్లను త్వరలో విడుదల చేస్తామని ఆర్‌బీఐ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, డిజైన్, ఇతర ఫీచర్ల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొంది. గతంలో ప్రవేశపెట్టిన నోట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయని కూడా పేర్కొంది. కొత్త గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన సంతకంతో కూడిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ విడుదల చేస్తుంటుంది. శక్తికాంత్ దాస్ పదవీ విరమణ తరువాత ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Inflation: మీ వద్ద కోటి ఉందని సంతోషంగా ఉన్నారా? రాబోయే ఈ ముప్పు గురించి తెలుసా?
భారత దేశ చరిత్రలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 18వ శాతబ్దంలో బెంగాల్, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల్లో తొలిసారిగా పేపర్ నగదును ప్రవేశపెట్టింది. ఆ తరువాత 1861 పేపర్ కరెన్సీ చట్టంతో యావత్ దేశంలో పేపర్ నోట్లు ప్రవేశపెట్టే అధికారాన్ని బ్రిటన్ ప్రభుత్వం దఖలు పరుచుకుంది. మొదట్లో భారత కరెన్సీ నోట్లు ఇంగ్లండ్‌లో తయారు చేసేవారు. నాటి నోట్లపై విక్టోరియా రాణి చిత్రం ఉండేది. తొలి రూ.5 నోటును 1903లో ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఇతర నోట్లను కూడా తీసుకొచ్చారు. ఇక 1949 నుంచి భారత కరెన్సీల నోట్లపై అశోక పిల్లర్‌ను ముద్రించడం ప్రారంభమైంది.
Retirement Plan: ఒకేసారి పెట్టుబడి..30 ఏళ్లపాటు నెలకు రూ.87 వేల ఆదాయం, ఎలాగంటే..
1950లో అధికారికంగా భారత కరెన్సీని విడుదల చేశారు. మహాత్మా గాంధీ సీరీస్ నోట్లను 1996లో ఆర్‌బీఐ తొలిసారిగా ప్రవేశపెట్టింది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో వీటిని విడుదల చేసింది. 2005లో మరోసారి సెక్యూరిటీ ఫీచర్లకు ప్రభుత్వం మార్పులు చేసింది. 2016లో నోట్ల రద్దు తరువాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల అయ్యాయి. ఇక 2019-2020లో ప్రభుత్వం కొత్త డిజైన్లతో కొత్త సిరీస్‌లో కరెన్సీ నోట్లను రిలీజ్ చేసింది. ఆ తరువాత 2023లో రూ.2 వేల నోటును ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. దేశంలో నగదు చలామణికి సంబంధించిన అంశాలన్నీ ఆర్‌బీఐ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.