Repo Rate: ఆరేళ్ల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:31 AM
వరుసగా కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో మరింతగా తగ్గి 2.1 శాతానికి దిగొచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి. 2019 జనవరిలో నమోదైన...
జూన్‌లో 2.1 శాతంగా నమోదు
2019 జనవరి తర్వాత ఇదే తక్కువ
వడ్డీ రేట్లు మరింత దిగొచ్చే చాన్స్
న్యూఢిల్లీ: వరుసగా కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో మరింతగా తగ్గి 2.1 శాతానికి దిగొచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి. 2019 జనవరిలో నమోదైన 1.97% తర్వాత ద్రవ్యోల్బణం ఇంత దిగువకు రావడం ఇదే ప్రథమం. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం వరుసగా ఇది ఎనిమిదో నెల. రుతుపవనాలు సకాలంలో రావడం, విస్తృతంగా వ్యాపించడం కారణంగా ఆహార వస్తువుల ధరలు.. పత్యేకించి కూరగాయల ధరలు -19 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఇవి కాకుండా పప్పులు, పప్పు ఉత్పత్తులు (-11.76ు), మాంసం, చేపలు (-1.62ు), తృణ ధాన్యాలు, అనుబంధ ఉత్పత్తులు; చక్కెర, కన్ఫెక్షనరీ, పాలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాల (-3.03ు) ధరలు కూడా జూన్‌లో గణనీయం గా తగ్గాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 2.82 శాతం ఉండగా గత ఏడాది జూన్‌లో 5.08 శాతంగా ఉంది.
రెపో మరింత తగ్గుతుందా...?
గత నవంబరు నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) ప్రభుత్వం నిర్దేశించిన ద్రవ్యోల్బణం కట్టడి కనిష్ఠ పరిమితి 2 శాతానికి (ఎగువకు లేదా దిగువకు 2ు సద్దుబాటుతో 4ు స్థాయికి కట్టడి) అతి చేరువకు వచ్చింది. ఈ కారణంగా వచ్చే నెల మొదటి వారంలో జరుగనున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో వడ్డీ రేటు మరింతగా తగ్గించవచ్చని అంటున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 1 శాతం మేరకు తగ్గించింది. ఆగస్టులో మరో 0.25 శాతం తగ్గించవచ్చని భావిస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు.
తెలంగాణలో కనిష్ఠం
ప్రాంతాలవారీగా చూసినట్టయితే రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో అత్యంత కనిష్ఠం 0.93 శాతంగా ఉండగా కేరళలో అత్యంత గరిష్ఠం 6.71 శాతంగా నమోదైంది. అంతే కాదు... గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా తక్కువ స్థాయిలో 1.72 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 2.56 శాతంగా ఉంది.
టోకు ధరలదీ అదే దారి
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) అయితే 19 నెలల విరామం అనంతరం నెగిటివ్ జోన్‌లోకి వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జూన్‌లో 0.13 శాతంగా ఉంది. మే నెలలో ఇది 0.39ు ఉండగా గత జూన్‌లో 3.43 శాతంగా ఉంది. టోకు ధరల సూచీలోని ఆహార వస్తువుల విభాగం 3.75 శాతం ప్రతి ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News