Share News

రూ 76 25 లక్షల కోట్లు

ABN , Publish Date - May 30 , 2025 | 04:13 AM

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) బ్యాలెన్స్‌ షీట్‌ (ఆస్తి-అప్పుల పట్టిక) వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వృద్ధితో రూ.76.25 లక్షల కోట్లకు పెరిగింది. విదేశీ మారక...

రూ 76 25 లక్షల కోట్లు

2024-25లో 8.2 శాతం పెరిగిన ఆర్‌బీఐ ఆస్తి-అప్పుల పట్టిక

ముంబై: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) బ్యాలెన్స్‌ షీట్‌ (ఆస్తి-అప్పుల పట్టిక) వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వృద్ధితో రూ.76.25 లక్షల కోట్లకు పెరిగింది. విదేశీ మారక (ఫారెక్స్‌) లావాదేవీల ద్వారా లాభాలు 33 శాతం పెరగడం ఇందుకు దోహదపడిందని, దీంతో కేంద్రా నికి ఈసారి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ అందించగలిగినట్లు గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది.

  • 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.70,47,703.21 కోట్లుగా ఉన్న బ్యాలెన్స్‌ షీట్‌.. 2024-25 చివరినాటికి రూ.5,77,718.72 కోట్ల (8.20 శాతం) పెరుగుదలతో రూ.76.25,421.93 కోట్లకు చేరుకుంది.

  • గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఆదాయం 22.77 శాతం వృద్ధి చెందగా.. వ్యయాలు 7.76 శాతం పెరిగాయి. మిగులు నిధులు వార్షిక ప్రాతిపదికన 27.37 శాతం పెరిగి రూ.2,68,590.07 కోట్లుగా నమోదయ్యాయి. ఈ మిగులు నిధులనే ఆర్‌బీఐ డివిడెండ్‌ రూపంలో కేంద్రానికి బదిలీ చేస్తుంది.

  • గోల్డ్‌ (52.09 శాతం), దేశీయ పెట్టుబడులు (14.32 శాతం), విదేశీ పెట్టుబడుల (1.70 శాతం) పెరుగుదల ఆర్‌బీఐ బ్యాలెన్స్‌షీట్‌లో ఆస్తుల వృద్ధికి తోడ్పడింది.

  • గత ఆర్థిక సంవత్సరంలో ఫారెక్స్‌ లావాదేవీల ద్వారా లాభాలు వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.


చలామణిలో ఉన్న కరెన్సీలో

రూ.500 నోట్లదే 86% వాటా

గత ఆర్థిక సంవత్సరం మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం విలువ 6 శాతం, కరెన్సీ నోట్లు 5.6 శాతం పెరిగాయి. నాణేల విలువ 9.6 శాతం, వాటి సంఖ్య 3.6 శాతం పెరిగాయి. చలామణిలో ఉన్న ఈ-రూపీ విలువ 334 శాతం వృద్ధి చెందింది. కాగా, చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్ల వాటా విలువ 86 శాతంగా ఉంది. నోట్ల సంఖ్య 40.9 శాతంగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆ తర్వాత రూ.10 నోట్ల వాటా 16.4 శాతంగా ఉంది. చలామణిలో ఉన్న రూ.10, 20, 50 నోట్ల మొత్తం వాటా 31.7 శాతమని నివేదిక తెలిపింది. రూ.2000 నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే నెలలో ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ మార్చి 31 నాటికి 98.2 శాతానికి సమానమైన రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

కరెన్సీ ముద్రణ ఖర్చులు 25% పెరిగాయ్‌..

గత ఆర్థిక సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.6,372.8 కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ నోట్ల ముద్రణ పెంచాల్సి రావడం ఇందుకు కారణమైంది. 2023-24లో ఈ వ్యయం రూ.5,101.4 కోట్లుగా నమోదైంది.


చలామణిలో రూ.1,000 కోట్ల ఈ-రూపీ

ఈ మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) లేదా ఈ-రూపీ మొత్తం విలువ రూ.1,016 కోట్లకు చేరింది. 2023-24 చివరినాటికి నమోదైన రూ.234 కోట్లతో పోలిస్తే ఈ-రూపీ చలామణి 334 శాతం పెరిగింది. ఈ-రూపీ ద్వారా విదేశీ చెల్లింపులు జరిపే సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్ల్లు ఆర్‌బీఐ తెలిపింది. ఎప్పటిలోగా ఇది ప్రారంభమవుతుందన్న విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఆర్‌బీఐ 2022 నవంబరులో తొలిసారిగా సీబీడీసీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ-రూపీలో రూ.857 కోట్లు రూ.500 డినామినేషన్‌వే. రూ.200 డినామినేషన్‌ ఈ-రూపీ రూ.91 కోట్లు, రూ.100 డినామినేషనలో రూ.38 కోట్లు చలామణిలో ఉన్నాయి.

చిరిగిన నోట్లతో బోర్డుల తయారీ

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చిన చిరిగిన కరెన్సీ నోట్లను ముక్కలు చేసి వాటిని పార్టికల్‌ బోర్డుల తయారీలో ఉపయోగించనున్నట్లు, ఇందుకోసం బోర్డు తయారీదారులను ఎంపికచేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దేశంలో ఏటా చిరిగిన బ్యాంక్‌ నోట్లు లేదా కుదించిన కాగితపు దిమ్మెల బరువు దాదాపు 15,000 టన్నుల స్థాయిలో ఉంటుందని, దాన్ని పారవేయకుండా పర్యావరణహిత పునర్‌వినియోగంపై దృష్టిసారించినట్లు ఆర్‌బీఐ రిపోర్టు పేర్కొంది.


పెద్ద నోట్లలో

నకలీల బెడద

గత ఆర్థిక సంవత్సరం గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 4.7 శాతం ఆర్‌బీఐ వద్ద పట్టుబడ్డాయి. రూ.10, 20, 50, 100 కరెన్సీల్లో నకిలీ నోట్ల బెడద కాస్త తగ్గగా.. రూ.200 నోట్లలో 13.9 శాతం, రూ.500 నోట్లలో 37.3 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

రూ.4.32 లక్షల కోట్ల బంగారం

గత ఆర్థిక సంవత్సరంలో తమ వద్దనున్న పసిడి ఆస్తుల మొత్తం విలువ 57.12 శాతం పెరిగి రూ.4,31,624.8 కోట్లకు చేరుకుందని ఆర్‌బీఐ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మరో 54.13 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని పోగేయడంతో పాటు మార్కెట్లో ఈ విలువైన లోహం ధర భారీగా పెరగడం ఇందుకు దోహదపడిందని వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ మార్చి 31 నాటికి ఆర్‌బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 879.58 మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి.

రూ.36,014 కోట్ల బ్యాంకింగ్‌ మోసాలు

గత ఆర్థిక సంవత్సరం దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన మోసాల విలువ మూడింతలై రూ.36,014 కోట్లకు పెరిగింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా 122 కేసుల పునర్‌వర్గీకరణ ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. 2023-24లో రూ.12,230 కోట్ల బ్యాంకింగ్‌ మోసాలు నమోదయ్యాయి. కాగా, 2023-24లో 36,060 మోసాలను గుర్తించగా.. 2024-25లో మాత్రం ఈ కేసులు 23,953కు తగ్గాయి.


ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:14 AM