Share News

RBI : రుణగ్రహీతలకు రిలీఫ్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:52 AM

రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లతో పాటు ఇప్పటికే తీసుకున్న రెపో ప్రామాణిక రుణాలపై ఈఎంఐల భారం కూడా తగ్గనుంది. ఎందుకంటే, కీలక వడ్డీ (రెపో) రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. దాంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది.

RBI : రుణగ్రహీతలకు రిలీఫ్‌

తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు జూఈఎంఐల భారం కూడా..

ఐదేళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటు 0.25% తగ్గింపు

6.25 శాతానికి తగ్గిన రెపో రేటు

2025-26 వృద్ధి అంచనా 6.7 శాతం

ద్రవ్యోల్బణం 4.2 శాతానికి తగ్గొచ్చు..

ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ

ఏప్రిల్‌ 7-9 తేదీల్లో తదుపరి సమీక్ష

ముంబై: రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లతో పాటు ఇప్పటికే తీసుకున్న రెపో ప్రామాణిక రుణాలపై ఈఎంఐల భారం కూడా తగ్గనుంది. ఎందుకంటే, కీలక వడ్డీ (రెపో) రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. దాంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది. రెపో రేటును తగ్గించడం ఐదేళ్ల (2020 మే) తర్వాత ఇదే తొలిసారి. రెండున్నరేళ్ల సుదీర్ఘ యథాతథ స్థితి తర్వాత రెపోను సవరించడం కూడా ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన తొలి ద్రవ్యపరపతి సమీక్షలోనే రేటు తగ్గింపునకు శ్రీకారం చుట్టడం మరో విశేషం.

ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులపాటు సమావేశమైంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేటును పావు శాతం తగ్గించాలని సభ్యులు ఏకగ్రీవంగా ఓటేశారు. పరపతి విధానంపై తటస్థ వైఖరిని మాత్రం అలాగే కొనసాగించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అత్తెసరు ఆదాయం, ధరాఘాతంతో సతమవుతున్న మధ్య తరగతి వర్గాలపై కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి రూ.12 లక్షల వరకు వార్షికాదాయంపై పన్ను ఊరట కల్పించింది. తాజాగా ఆర్‌బీఐ సైతం రుణగ్రహీతల కోసం వడ్డీ భారాన్ని తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 7-9 తేదీల్లో తదుపరి సమీక్షను నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.


చాలాకాలంగా ఎదురుచూస్తున్న రుణగ్రహీతలకు రెపో తగ్గింపుతో కొంత ఉపశమనం లభించనుందని, ఆర్థిక వృద్ధికి సైతం ఈ నిర్ణయం దోహదపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. మున్ముందు రెపో మరింత తగ్గేందుకు పునాదులు వేసిందన్నారు. పన్ను ఊరట ద్వారా వినియోగం పెంచేందుకు బడ్జెట్లో ప్రకటించిన చర్యలకు రెపో తగ్గింపు మరింత తోడ్పడనుందన్నారు. ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడనుందన్నారు. రెపో పావు శాతం తగ్గింపుతో రియల్టీ రంగానికి ప్రత్యక్ష ప్రయోజనం కొంతేనని.. గృహాలకు డిమాండ్‌ పుంజుకునేందుకు వడ్డీ రేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉందని క్రెడాయ్‌ అభిప్రాయపడింది. వాహన రంగం మాత్రం సంతోషం వ్యక్తం చేసింది. టూవీలర్లు, చిన్న కార్ల విక్రయాలు పెరిగేందుకు తోడ్పడవచ్చని అభిప్రాయపడింది.

ధరలు తగ్గుముఖం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 4.2 శాతానికి తగ్గవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2024-25 ద్రవ్యోల్బణం అంచనాను మాత్రం యథాతథంగా 4.8 శాతంగా కొనసాగించింది. సరఫరా అవాంతరాలు ఎదురుకాని పక్షంలో, మెరుగైన ఖరీఫ్‌ దిగుబడితో ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్‌ సుంకాల దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు, ఇంధన ధరల పెరుగుదల అవకాశాలు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులతో ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం లేకపోలేదన్నారు.

7 శాతానికి పైగా వృద్ధి సాధ్యమే..

భారత్‌ 7 శాతానికి పైగా వృద్ధిని సాధించగలదని, మనం అందుకోసం ఆకాంక్షించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతానికి పెరగవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. మెరుగైన రబీ దిగుబడితో పాటు పారిశ్రామికోత్పత్తిలో పునరుద్ధరణ ఇందుకు దోహదపడనున్నాయని మల్హోత్రా అన్నారు. అలాగే, ఈసారి బడ్జెట్లో ప్రకటించిన పన్ను ఊరటతో ప్రైవే టు వినియోగానికి ఊతం లభించనుందని, ఇది కూడా వృద్ధికి చోదకంగా పనిచేయనుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మాత్రం వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం ఈ మధ్యనే అంచనాలను విడుదల చేసింది.

బ్యాంకులకు ప్రత్యేక డొమైన్‌ నేమ్స్‌

దేశీయ ఆర్థిక సేవల రంగంలో భారీగా పెరిగిన డిజిటల్‌ మోసాలకు మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత బ్యాంకులకు ‘బ్యాంక్‌.ఇన్‌’, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎ్‌ఫసీ) ‘ఫిన్‌.ఇన్‌’ ప్రత్యే కడొమైన్‌ నేమ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఏప్రిల్‌ నుంచి బ్యాంకులకు బ్యాంక్‌.ఇన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుందని, ఆ తర్వాత ఎన్‌బీఎ్‌ఫసీలకు ఫిన్‌.ఇన్‌ డొమైన్‌ నేమ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. కాగా, కార్డు లేకుండా ఆన్‌లైన్‌లో జరిపే అంతర్జాతీయ చెల్లింపుల్లో అదనపు ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని కూడా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జారీ చేసిన కార్డులతో జరిపే అంతర్జాతీయ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ ఇప్పటికే అమలులో ఉంది.


జలాన్‌ కమిటీ సిఫారసులపై అంతర్గత సమీక్ష

ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీకి సంబంధించి ఎకనామికల్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఈసీఎ్‌ఫ)పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులపై అంతర్గత సమీక్ష కొనసాగుతోందని మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఆకస్మిక అవసరాలు, నష్టాల కోసం బ్యాలెన్స్‌షీట్‌లో గరిష్ఠంగా 6.5 శాతం వరకు నిల్వను కేటాయించవచ్చు. గత ఏడాది ఆర్‌బీఐ రికార్డు స్థాయిలో రూ.2.11 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది.

కేవలం ఈసారే పాలసీ సడలింపు!

ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం ఈ సమావేశంలో ద్రవ్య పరపతి విధానాన్ని కాస్త సడలించడం జరిగిందని, తద్వారా రెపో రేటును 0.25 శాతం తగ్గించగలిగామని ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. మున్ముందు సమీక్షల్లోనూ ఇదే వైఖరి ఉండబోదన్నారు. వృద్ధికి మద్దతిస్తూనే ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించే దిశగా పరపతి విధాన వైఖరి ఉంటుందన్నారు. దీర్ఘకాలం పాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఆందోళనకరం

రూపాయి విలువ క్షీణత కూడా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతోందన్నారు. రూపాయి విలువ 5 శాతం క్షీణిస్తే, దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణం 0.30 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గుల కంటే అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఆర్‌బీఐ పాలిట అతిపెద్ద ఆందోళనకర అంశంగా మారిందన్నారు. ఎందుకంటే, అంతర్జాతీయ అనిశ్చితులు ఆర్థిక వృద్ధి, పెట్టుబడి నిర్ణయాలు, వినియోగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు.

బడ్జెట్‌ భళా

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చాలా బాగుందని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు. బడ్జెట్‌ ప్రకటనలు ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యానికి తోడ్పడేలా ఉన్నాయన్నారు. భారీ పన్ను ఊరటతో మధ్యతరగతి వర్గాల చేతుల్లోకి అదనంగా రూ.లక్ష కోట్లు అందుబాటులోకి రానున్నాయని.. తద్వారా మార్కెట్లో వినియోగం పెరగనుందన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 06:52 AM