Share News

Raghuram Rajan: అనుకరణ నుంచి సృజనాత్మకత వైపు మళ్లాలి.. భారతీయ కార్పొరేట్లకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సూచన

ABN , Publish Date - Jul 13 , 2025 | 07:15 PM

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సృజనాత్మకత వైపు మళ్లాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశంలో యువ జనాభా వృద్ధులుగా మారే లోపే దేశం సంపన్నంగా మారేందుకు ఇది అత్యవసరమని తెలిపారు.

Raghuram Rajan: అనుకరణ నుంచి సృజనాత్మకత వైపు మళ్లాలి.. భారతీయ కార్పొరేట్లకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సూచన
Raghuram Rajan

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ ఉత్పత్తులు ఏవీ లేకపోవడంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) విచారం వ్యక్తం చేశారు. భారత్ ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ప్రపంచస్థాయి సృజనాత్మక లేకపోతే ఆ పురోగతి మొత్తం డొల్లగా మారినట్టేనని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జాతీయ మీడియాలో రాసిన ఓ కాలమ్‌లో ఆయన తేల్చి చెప్పారు.

‘ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులను తయారు చేసే ఒక్క భారతీయ సంస్థ కూడా లేదు. సోనీ, టొయోటా, మెర్సిడీజ్, పోర్షే, శాప్ వంటివేవీ లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో మన ఆటోమొబైల్ ఉత్పత్తులు ఏవీ చెప్పుకోదగ్గ స్థాయిలో విక్రయించట్లేదు’ అని అన్నారు. రిస్క్‌లెస్ క్యాపిటలిజమ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రఘురామ్‌ రాజన్ అభిప్రాయపడ్డారు. విదేశీ పోటీ, సృజనాత్మకత నుంచి భారత కార్పొరేట్లకు ప్రభుత్వ రక్షణ లభిస్తున్నందున ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. అనుకరణ నుంచి సృజనాత్మకత వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


భారతీయ ఫార్మా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ జనరిక్ ఔషధాల నుంచి ఒరిజినల్ ఫార్మ్యులేషన్స్‌ వైపు మళ్లలేకపోతున్నాయని అన్నారు. ఇక సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన ఉత్పత్తులను తయారు చేయలేకపోతున్నాయని తెలిపారు. ‘భారతీయ టిక్‌టాక్, డీప్‌సీక్, చాట్‌జీపీటీ వంటివేవీ ఎందుకు లేవని ప్రశ్నించారు. వీటిని పోలిన దేశీ వర్షెన్లు ఉన్నప్పటికీ అవి అనుకరణ ఉత్పత్తులు కావడంతో ప్రపంచస్థాయి మార్కెట్‌ వాటికి లేదని అభిప్రాయపడ్డారు.

అయితే, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ దిశగా ఓ ముందడుగు అని అన్నారు. దేశంలో యువ జనాభా వృద్ధాప్యం అంచులకు చేరుకునే లోపు భారత్ సంపన్న దేశంగా మారాలంటే సృజనాత్మకత వైపు మళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారినందుకు సంతృప్తి చెందకూడదని, ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకమైన దేశంగా ఎదగాలని అన్నారు.


ఇవీ చదవండి:

ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డాం.. ఇంటెల్ సీఈఓ ఆందోళన

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 07:27 PM