రెండేళ్లలో 1 7 లక్షల కోట్లకు
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:58 AM
దేశంలోని వినియోగదారుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. గతంలోలా ఇంటికి దగ్గర్లో ఉన్న చిల్లర దుకాణాలకు వెళ్లి సరుకులు కొనేందుకు ఇష్టపడడం లేదు. మొబైల్ ఆన్ చేయడం...
జోరుగా క్విక్ కామర్స్ వ్యాపారం.. చిన్న నగరాలకు విస్తరణ : కెర్నీ
న్యూఢిల్లీ: దేశంలోని వినియోగదారుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. గతంలోలా ఇంటికి దగ్గర్లో ఉన్న చిల్లర దుకాణాలకు వెళ్లి సరుకులు కొనేందుకు ఇష్టపడడం లేదు. మొబైల్ ఆన్ చేయడం.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ సైట్లు ఓపెన్ చేసి కావాల్సిన సరుకుల కోసం ఆర్డర్ చేస్తున్నారు. చిరుతిళ్లు, గిఫ్టింగ్, పర్సనల్ కేర్, నిత్యావసరాల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మరో రెండేళ్లలో మన దేశంలో ఈ సంస్థల వ్యాపారం రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.1.7 లక్షల కోట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని కెర్నీ అనే సంస్థ అంచనా. ముఖ్యం గా ప్రీమియం ఉత్పత్తుల విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
వేగంగా డెలివరీ: పది పదిహేను నిమిషాల్లోనే కావాల్సిన సరుకులు ఇంటికి చేరడం, క్విక్ కామర్స్ సంస్థలు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నట్టు కెర్నీ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాల్లో ఇటీవల అనేక రిటైల్ కంపెనీల మాల్స్ మూతపడడానికి ఇది కూడా కారణం. ఐదు లక్షలు అంతకు మించి జనాభా ఉన్న ప్రధాన నగరాలన్నిటిని క్విక్ కామర్స్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నగరాల్లో వార్షిక ఆదాయం రూ.6 లక్షలు అంతకు మించి ఉన్న కుటుంబాలు ఎక్కువగా తమ నిత్యావసరాలు, చిరుతిళ్లు, గిఫ్ట్‌లు, పర్సనల్ కేర్ ఉత్పత్తుల కోసం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నాయి.
మహీంద్రా ఈపీసీ రికార్డు...
సూక్ష్మ సేద్య రంగంలో ప్రముఖ సంస్థ మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఆర్థిక సంవత్సరం 2025లో గణనీయమైన విజయాన్ని ప్రకటించింది. తమ సూక్ష్మ సేద్య పద్ధతులు, వ్యవసాయ నీటి నిర్వహణ ప్రాజెక్టుల ద్వారా సుమారు 262 కోట్ల లీటర్ల నీటిని, 8.4 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్‌ను ఆదా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. "ప్రతి బొట్టుకు, ఎక్కువ పంట" అనే ప్రభుత్వ లక్ష్యానికి, మహీంద్రా గ్రూప్ సుస్థిరత ప్రణాళికకు అనుగుణంగా ఈ విజయం ఉందని మహీంద్రా ఈపీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ రామచంద్రన్ తెలిపారు. రైతుల శ్రేయస్సు, సహజ వనరుల సంరక్షణకు తమ నిబద్ధతను ఈ మైలురాయి చాటుతుందని ఆయన అన్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి