పెట్టుబడుల రక్షణే కీలకం
ABN , Publish Date - May 11 , 2025 | 03:34 AM
భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారినట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా సమసిపోవాలంటే మరికొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాలు...
ఉద్రిక్తతల నేపథ్యంలో ఆచితూచే ధోరణి బెస్ట్
భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారినట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా సమసిపోవాలంటే మరికొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాలు అలానే ఉన్నాయి. అమెరికా సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయటంతో కొన్ని రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగాయి. అయితే భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో మరోసారి మార్కెట్లు ఆటుపోట్లలో సాగుతున్నాయి. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతుండటంతో మదుపరుల్లో ఇంకా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే మంచిదో తెలుసుకుందాం.
మల్టీ అసెట్ విధానం
గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదంటారు. పెట్టుబడులకు ఈ సూత్రం చక్కగా వర్తిస్తుంది. అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ సమయాల్లో ఇది మరింతగా వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు తమ పెట్టుబడులను ఏదో ఒక ఆస్తికే పరిమితం చేయకుండా ఈక్విటీ, బంగారం, రియల్ ఎస్టేట్, స్థిర ఆదాయాన్ని ఇచ్చే మంచి పరపతి రేటింగ్ ఉన్న రుణ పత్రాల వంటి వివిధ ఆస్తులకు (మల్టీ అసెట్) విస్తరించడం మంచిది. అందులో ఒక ఆస్తి నష్టపోయినా.. మిగతా వాటిలో ఏదో ఒకటి ఆదుకుని పెట్టుబడులకు రక్షణగా ఉంటుంది. వీటిని ఒక్కొక్కటి విడిగా కొనలేమనుకుంటే మంచి పనితీరు కనబరుస్తున్న మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) అందించే మల్టీ అసెట్ ఫండ్స్‌ను ఎంచుకోవటం మంచిది.
స్మాల్,మిడ్ క్యాప్స్‌కు దూరంగా ఉంటే బెటర్
ఒకవేళ ఈక్విటీకే పరిమితం కావాలనుకుంటే మీ పోర్టుఫోలియో నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లను తప్పించటం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కంపెనీల షేర్లు ఇటీవలి కాలంలో బాగా దిద్దుబాటుకు లోనయ్యాయి. అయినా వీటి వాల్యుయేషన్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వీటికి బదులు దేశీయ వినియోగ ఆధారిత లార్జ్‌క్యాప్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్ల లో మదుపు చేయడం మంచిది. మార్కెట్ ప్రతి పతనంలో నూ మదుపరులు ఈ షేర్లలో పొజిషన్లు తీసుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. యుద్ధం వచ్చినా, ఎలాంటి అనిశ్చిత పరిస్థితులున్నా ఈ కంపెనీల వ్యాపార వృద్ధి మెరుగ్గానే ఉంటుంది. ఈ కంపెనీల షేర్లు భారీ లాభాలు ఇవ్వకపోయినా పెట్టుబడులకు మాత్రం రక్షణ ఉంటుంది. ఇదే సమయంలో ఐటీ, బ్యాంకింగ్ రంగంలోని స్టాక్స్ పైనా మదుపరులు కన్నేయవచ్చంటున్నారు.
బులియన్
అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి పరిస్థితులున్నా పెద్దగా రిస్క్ లేకుండా పెట్టుబడుల రక్షణ కోరుకునే మదుపరులు బంగారాన్ని ఆశ్రయించవచ్చు. గత ఏడాది పసిడి మదుపరులకు 30 శాతం వరకు లాభాలు పంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసినా 20 శాతంపైనే పెరిగింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఒక దశలో రూ.లక్ష దాటింది. ప్రస్తుతం రూ.లక్ష దిగువన ఉన్నా త్వరలోనే మళ్లీ ఆ స్థాయిని మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 3,350 డాలర్లకు చేరువలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి 4,000 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే పసిడి ధర మరింత భగ్గుమనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దగా రిస్క్ తీసుకోలేని మదుపరులు తమ పెట్టుబడుల రక్షణ కోసం నేరుగా బంగారం, వెండి కొనిపెట్టుకోవచ్చు. లేదంటే డిజిటల్ రూపంలో లభించే సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎ్‌ఫలు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్టర్లు మదుపు చేయడం మంచిది.
స్థిర ఆదాయ పథకాలు
ఏ మాత్రం నష్టభయం (రిస్క్) భరించలేని మదుపరులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు స్థిరమైన ఆదాయాన్ని అందించే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ‘ట్రిపుల్ ఏ’ పరపతి రేటింగ్ ఉన్న కంపెనీల రుణ పత్రాలు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయడం మంచిది. వీటిపై రాబడులు తక్కువగా ఉన్నా, అసలు, వడ్డీ చెల్లింపులకు ఢోకా ఉండదు. కంపెనీల కంటే.. ప్రభుత్వ రుణ పత్రాలు మేలు. ఇవన్నీ ఎందుకనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అందించే డెట్ ఫండ్స్‌లో మదుపు చేయడం బెటర్.
ఎగుమతి ఆధారిత కంపెనీలు
అమెరికా అఽధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యాయి. భారత్-బ్రిటన్ మధ్య ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. భారత్-అమెరికా మధ్యన త్వరలోనే ఎఫ్‌టీఏ కుదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా, ఈయూ, జపాన్ వంటి దేశాలు అనుసరిస్తున్న చైనా+1 విధానం మన దేశానికి కలిసి రానుంది. దీంతో ఎగుమతి ఆధారిత టెక్స్‌టైల్, లెదర్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ విడిభాగాలు, ఫార్మా, ఐటీ కంపెనీల షేర్ల ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కొద్దిపాటి రిస్క్‌కు సిద్ధమైన మదుపరులు ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలోనూ ఈ కంపెనీల షేర్లలో పొజిషన్లు తీసుకునే విషయాన్ని పరిశీలించవచ్చు.
తగ్గుతున్న వడ్డీ రేట్లు
యుద్ధ వాతావరణం ఉన్నా మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఆర్‌బీఐ ఇప్పటికే కీలక రెపో రేటును అర శాతం తగ్గించింది. ఈ ఏడాది చివరికల్లా మరో అర శాతం తగ్గించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈఎంఐల చెల్లింపుల భారం తగ్గనుంది. దీనికి తోడు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను రాయితీలతో ప్రజల చేతుల్లోకి రూ.లక్ష కోట్ల అదనపు నిధులు రానున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఖర్చులు, పొదుపు రూపంలో తిరిగి మార్కెట్లోకి రానున్నాయి. ఇవన్నీ మన స్టాక్ మార్కెట్‌కు మేలు చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
Read More Business News and Latest Telugu News