Share News

India Mobility Expo : ‘ఆటో’పెట్టుబడుల కేంద్రంగా భారత్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:30 AM

మొబిలిటీ రంగం భవిష్యత్తు భారత్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో గత ఏడాది రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయని, అనేక దేశాల జనాభా కన్నా మన దేశంలో కార్ల అమ్మకాలు

India Mobility Expo : ‘ఆటో’పెట్టుబడుల కేంద్రంగా భారత్‌

నాలుగేళ్లలో వాహన రంగంలోకి రూ.3.09 లక్షల కోట్ల ఎఫ్‌డీఐ

ఏడాదిలో 2.5 కోట్ల వాహనాల విక్రయం..

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో ప్రధాని

న్యూఢిల్లీ: మొబిలిటీ రంగం భవిష్యత్తు భారత్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో గత ఏడాది రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయని, అనేక దేశాల జనాభా కన్నా మన దేశంలో కార్ల అమ్మకాలు అధికమని చెప్పారు. కేవలం నాలుగేళ్ల కాలంలో మొబిలిటీ రంగంలోకి 3,600 కోట్ల డాలర్ల (రూ.3.09 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 ప్రదర్శనను ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మొబిలిటీ (ఆటోమొబైల్‌) రంగంలో తన భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలనుకునే ప్రతి ఇన్వెస్టర్‌కు భారత్‌ అద్భుతమైన గమ్యమన్నారు. ఆటోమోటివ్‌ పరిశ్రమకు ఇన్నోవేషన్‌, టెక్నాలజీలే చోదకమని పేర్కొంటూ ‘‘ప్రపంచం కోసం దేశంలో తయారుచేయండి’’ అనే మంత్రంతో ముందడుగేసే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పూర్తి మద్దతు, ప్రోత్సాహం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ మంత్రం ఆటోమొబైల్‌ రంగం వృద్ధికి ఎంతో దోహదపడిందని చెప్పారు. పీఎల్‌ఐ పథకాలు ఈ ప్రచారానికి కొత్త ఉత్తేజం కల్పించడంతో పాటు రూ.2.25 లక్షల కోట్ల విక్రయాలు, 1.5 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలకు బాట వేశాయని తెలిపారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడో పెద్ద ప్రయాణికుల వాహన మార్కెట్‌గా ఉందన్నారు. అధిక సంఖ్యలో ఉన్న యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి జీవులు, వేగవంతమైన నగరీకరణ, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి, అందుబాటులోకి వస్తున్న అఫర్డబుల్‌ వాహనాలు మొబిలిటీ మార్కెట్‌కు బలమని ఆయన అన్నారు.

వేగంగా విస్తరిస్తున్న ఈవీ మార్కెట్‌

దేశంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోందని ప్రధాని చెప్పారు. గత దశాబ్ది కాలంలో ఈవీ విక్రయాలు 640 రెట్లు పెరిగాయ న్నారు. 10ఏళ్ల క్రితం ఏడాదికి 2,600 ఈవీలు అమ్ముడుపోగా గత ఏడాది ఆ సం ఖ్య 16.8 లక్షలకు చేరిందన్నా రు. ఈ దశాబ్ది చివరి నాటికి ఈ సంఖ్య 8 రెట్లు పెరగవచ్చని అంచనా వేశారు.

రతన్‌ టాటా, ఒసాము సుజుకీలకు నివాళి

ఆటోమొబైల్‌ దిగ్గజాలైన రతన్‌ టాటా, ఒసాము సుజుకీలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత ఆటోమొబైల్‌ వృద్ధికి, మధ్య తరగతి ప్రజల కలల సాకారానికి వారిద్దరి సేవలు చిరస్మరణీయమన్నారు. మొత్తం భారత మొబిలిటీ రంగానికి వారిద్దరి వారసత్వం ఎల్లప్పుడూ స్ఫూర్తిని అందిస్తుందని నివాళి ఘటించారు.

మెర్సిడెస్‌ బెంజ్‌ రెండు కొత్త కార్లు

మెర్సిడెస్‌ బెంజ్‌.. ఆటో ఎక్స్‌పోలో సరికొత్త బ్యాటరీ విద్యుత్‌ కారు (బీఈవీ) ఈక్యూఎస్‌ మేబాక్‌ ఎస్‌యూవీ 680 ‘‘నైట్‌ సీరీ్‌స’’ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.63 కోట్లు. దీనితో పాటు మెర్సిడెస్‌ మేబాక్‌ జీఎల్‌ఎస్‌ 600 నైట్‌ సీరీస్‌ కారు కూడా విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.71 కోట్లు. ఇవి కాకుండా కొత్తగా డెవలప్‌ చేసిన కాన్సెప్ట్‌ సీఎల్‌ఏ కారును ఆవిష్కరించింది.

బీఎండబ్ల్యూ ఇండియా ఈవీ

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ పూర్తిగా స్థానికంగా తయారుచేసిన బీఎండబ్ల్యూ ఎక్స్‌ 1 లాంగ్‌ వీల్‌ బేస్‌ ఈవీని విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.49 లక్షలు. దీన్ని చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు. బీఎండబ్ల్యూ నుంచి పూర్తిగా దేశీయంగా తయారైన తొలి ఈవీ ఇది.


Suzuki-e-scooters.jpg

సుజుకీ తొలి విద్యుత్‌ స్కూటర్‌

సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తొలి విద్యుత్‌ స్కూటర్‌ ఈ-యాక్సె్‌సను, మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఈ యాక్సెస్‌ 3.07 కిలోవాట్ల లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇతర మోడళ్లలో జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ఫ్లెక్స్‌ ఫ్యుయెల్‌ బైక్‌, పూర్తిగా కొత్తగా తయారుచేసిన యాక్సెస్‌ 125 సీసీ స్కూటర్‌ ఉన్నాయి.

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ సైబర్‌స్టర్‌

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ రెండు కొత్త ఈవీ మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఎంజీ సైబర్‌స్టర్‌ కారు దేశంలోని తొలి ఆల్‌ ఎలక్ర్టిక్‌ రోడ్‌స్టర్‌ కారు. రెండోది ఎంజీ ఎం9. ఇది మూడు వరుసలున్న తొలి విద్యుత్‌ లిమోసిన్‌ కారు. ఈ రెండు కార్లను ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేస్తారు. ఈ కార్లతో తాము యాక్సెసిబుల్‌ లగ్జరీ విభాగంలోకి ప్రవేశించినట్టు కంపెనీ ప్రకటించింది.

పోర్షే కొత్త విద్యుత్‌ ఎస్‌యూవీ

జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల కంపెనీ పోర్షే సరికొత్త విద్యుత్‌ ఎస్‌యూవీ మకాన్‌, సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన స్పోర్ట్‌ సెలూన్‌ టైకాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మకాన్‌ బీఈవీ మూడు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. ధర రూ.1.22 కోట్ల నుంచి రూ.1.69 కోట్ల మధ్యన ఉంటుంది. కొత్త హంగులతో విడుదల చేసిన టైకాన్‌ ధర రూ.1.89 కోట్ల నుంచి రూ.2.53 కోట్ల మధ్యన ఉంటుంది.

హీరో మోటోకార్ప్‌

టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ నాలుగు కొత్త వాహనాలను ప్రదర్శించింది. ఎక్స్‌ట్రీమ్‌ 250 ఆర్‌ ద్వారా 250 సీసీ వాహనాల విభాగంలోకి తొలిసారిగా ప్రవేశించింది. అలాగే ఎక్స్‌పల్స్‌ 210 బైక్‌, జూమ్‌ 125, జూమ్‌ 160 స్కూటర్లు కూడా ప్రదర్శించిన వాహనాల్లో ఉన్నాయి. ఈ వాహనాలన్నింటి బుకింగ్స్‌ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి వాహనాల డెలివరీ ప్రారంభిస్తారు.

Maruti-eVITARA.jpg

మారుతి ఈ-విటారా

దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ తొలి బ్యాటరీ విద్యుత్‌ కారు ఈ-విటారాను ఆవిష్కరించింది. ఈ కారు 49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేసి 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మోడల్‌కు భారత్‌ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా చేయాలనుకుంటున్నట్టు కంపెనీ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ తెలిపారు.

Updated Date - Jan 18 , 2025 | 05:31 AM