Share News

వైమానిక రంగంలో అద్భుత అవకాశాలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:03 AM

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వైమానిక రంగం పెట్టుబడులకు అద్భుత అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు...

వైమానిక రంగంలో అద్భుత అవకాశాలు

విదేశీ సంస్థలు పెట్టుబడులతో రావాలి

విమానాల తయారీ కేంద్రంగా భారత్‌

ఐఏటీఏ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వైమానిక రంగం పెట్టుబడులకు అద్భుత అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి భారత విమానాల నిర్వహణ, మరమ్మతులు, కార్యకలాపాల (ఎంఆర్‌ఓ) రంగం 400 కోట్ల డాలర్ల స్థాయికి చేరనుందన్నారు. భారత్‌ను విమానాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌ను ఒక మార్కెట్‌గా కాకుండా.. వాల్యూ చెయిన్‌ లీడర్‌గా చూడాలని కోరారు. దేశీయ విమానయానపరంగా చూస్తే ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానయానాన్ని దగ్గర చేసేందుకు తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉడాన్‌ పథకం భారత విమానయాన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమన్నారు.


విమాన సంస్థల లాభాలు రూ.3 లక్షల కోట్లు

కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నా ఈ సంవత్సరం అంతర్జాతీయ విమానయాన సంస్థలు 97,900 కోట్ల డాలర్ల (సుమారు రూ.83.59 లక్షల కోట్లు) ఆదాయంపై 3,600 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.07 లక్షల కోట్లు) లాభాలు ఆర్జించే అవకాశం ఉందని ఐఏటీఏ అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 360 కోట్ల డాలర్లు ఎక్కువని ఐఏటీఏ డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్ష్‌ ప్రకటించారు. ప్రస్తుతం విమానయాన రంగం ప్రపంచ జీడీపీలో 3.9 శాతం వాటా కలిగి ఉందన్నారు. భారత విమానయాన రంగం జీడీపీకి 560 కోట్ల డాలర్లు (సుమారు రూ.47,818 కోట్లు) సమకూరుస్తూ నేరుగా 3,69.700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. ఖర్చులు, పన్నుల భారం పెరుగుతున్నా పదేళ్ల క్రితంతో పోలిస్తే విమానయాన సంస్థల వాస్తవ ఖర్చులు 40 శాతం వరకు తగ్గాయని ఐఏటీఏ డైరెక్టర్‌ జనరల్‌ అన్నారు. పరోక్షంగా విమానయాన రంగంతో ముడిపడి ఉన్న పర్యాటక రంగాన్ని కూడా కలుపుకుంటే భారత విమానయాన రంగం 77 లక్షల మందికి ఉపాధి, జీడీపీకి 1.5 శాతం సమకూరుస్తోందన్నారు.


ప్లాంట్‌ పెట్టేందుకు రెడీ: ఎంబ్రాయర్‌

భారత్‌లో పూర్తి స్థాయి అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్‌ విమానాల తయారీ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. కాకపోతే ఇందుకు భారత విమానయాన సంస్థల నుంచి కనీసం 200 విమానాల ఆర్డర్‌ అవసరమని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ ఫ్రాన్సిస్కో గొమెస్‌ నెటో స్పష్టం చేశారు. ఐఏటీఏ సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. తమ విమానాలు అమ్మేందుకు ఇండిగో, ఎయిర్‌ ఇండియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు నెటో వెల్లడించారు.

మరో 50 ఎయిర్‌పోర్టులు

వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 164కు చేరిందన్నారు. ఉడాన్‌ పథకంతో దేశంలో విమానయానం ప్రజాస్వామ్యీకరించబడి 619 మార్గాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. విమానాల నిర్వహణ మరమ్మత్తులకూ భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:03 AM