Planning to buy health insurance: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:03 AM
ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. ప్రస్తుత ప్రపంచంలో ఆరోగ్యం మరింత ముఖ్యం. అన్నీ ఉన్నా సరైన ఆరోగ్యం లేకపోతే అన్నీ తిప్పలే. ఇల్లూ ఒళ్లూ గుల్లవుతుంది....
పాలసీ ఎంపికే కీలకం
ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. ప్రస్తుత ప్రపంచంలో ఆరోగ్యం మరింత ముఖ్యం. అన్నీ ఉన్నా సరైన ఆరోగ్యం లేకపోతే అన్నీ తిప్పలే. ఇల్లూ ఒళ్లూ గుల్లవుతుంది. సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను కొంత వరకు అధిగమించవచ్చు. మరి సరైన ఆరోగ్య పాలసీని ఎంచుకోవడం ఎలా? అయితే ఈ స్టోరీ చదవండి.
ఇన్‌క్యూర్డ్ క్లెయిమ్ నిష్పత్తి
ఆరోగ్య బీమా పాలసీ ఇచ్చే కంపెనీ సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు ఇన్‌క్యూర్డ్ క్లెయిమ్ నిష్పత్తి (ఐసీఆర్) ఒక గీటురాయి. ఈ ఐసీఆర్ ద్వారా బీమా కంపెనీ ఒక ఆర్థిక సంవత్సరంలో తన నికర ప్రీమియం వసూళ్లలో ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌లుగా చెల్లిస్తోందనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకు ఒక బీమా కంపెనీ ఐసీఆర్ 85 శాతం అనుకుందాం. అంటే ఆ కంపెనీ నికర ప్రీమియంగా వసూలు చేసే ప్రతి రూ.లక్షలో రూ.85,000 క్లెయిమ్స్‌గా చెల్లిస్తోందని అర్థం. కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వ్యక్తులు, కనీసం 70 నుంచి 90 శాతం ఐసీఆర్ ఉన్న బీమా కంపెనీలనే ఎంచుకుంటే మంచిది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో
ప్రస్తుతం మార్కెట్లో అనేక బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలను మార్కెట్ చేస్తున్నాయి. ప్రతి కంపెనీ లేదా ఆ కంపెనీ ఏజెంట్ మా కంపెనీ పాలసీ మంచిదంటే, మా కంపెనీ పాలసీ మంచిదని మాటలతో మభ్య పెడుతుంటారు. వారి మాటలు గుడ్డిగా నమ్మి పాలసీ తీసుకుంటే ఇక అంతే. క్లెయుమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఆ తిప్పలు వద్దనుకుంటే, పాలసీ తీసుకునే ముందే ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి (సీఎ్‌సఆర్) తెలుసుకుని మరీ పాలసీ తీసుకోవడం మంచిది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే క్లెయిమ్స్‌లో ఎంత శాతం క్లెయిమ్స్‌ని కంపెనీ సెటిల్ చేసిందనే విషయాన్ని సీఎ్‌సఆర్ తెలుపుతుంది. కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వ్యక్తులు కనీసం 90 శాతం కంటే ఎక్కువ సీఎ్‌సఆర్ ఉన్న బీమా కంపెనీల పాలసీలను ఎంచుకోవవం మంచిది.
పాలసీ షరతులు
ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో కొన్ని షరతులు, నిబంధనలు ఉంటాయి. మనం తీసుకునే ప్లాన్, బీమా కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి. వాటిని తెలుసుకుని పాలసీ తీసుకోవడం పాలసీదారుల బాధ్యత. లేకపోతే క్లెయిమ్స్ సమయంలో చిక్కులు తప్పవు. ఆ షరతులు ఏంటంటే?
రూమ్ రెంట్
ఆరోగ్య బీమా పాలసీలో రూమ్ రెంట్‌పై పరిమితులు ఉంటాయి. ఇది పాలసీ మొత్తంలో ఇంత శాతం లేదా ఇంత నిర్ణీత మొత్తమని ఉంటుంది. పాలసీ తీసుకునే ముందే, ప్రతి పాలసీదారుడు ఈ పరిమితులు తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.10 లక్షల పాలసీలో రూమ్ రెంట్ రోజుకి ఒక శాతం అనుకుందాం. అంటే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి హాస్పిటల్‌లో చేరితే రోజువారీ రూమ్ రెంట్ పాలసీ విలువైన రూ.10 లక్షల్లో ఒక శాతం అంటే రూ.10,000 మించకూడదు.
వెయిటింగ్ పీరియడ్
ప్రతి ఆరోగ్య బీమా పాలసీ కవరేజీకి కనీసం నెల రోజుల సమయం ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న నెల రోజుల్లోపు వచ్చే ఆరోగ్య సమస్యలకు బీమా కవరేజీ లభించదు. అలాగే బీమా పాలసీ తీసుకున్న ఒకటి నుంచి మూడేళ్ల వరకు అప్పటికే ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ వర్తించదు. కొన్ని బీమా కంపెనీలు అధిక ప్రీమియంతో ఇప్పటికే ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ కల్పిస్తున్నాయి.
కో-పేమెంట్ లేదా డిడక్షన్ ఆప్షన్
ఈ రెండు ఆప్షన్లలో దేన్ని ఎంచుకున్నా ప్రీమియం తగ్గుతుంది. అయితే పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పాలసీదారుడి జేబుకు చిల్లు పడుతుంది. ఉదాహరణకు 20 శాతం కో-పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, హాస్పిటల్ బిల్లులో 20 శాతం పాలసీదారుడు, మిగతా 80 శాతం బీమా కంపెనీ చెల్లించాలి. అలాగే నిర్ణీత మొత్తాన్ని డిడక్షన్ ఆప్షన్‌గా ఎంచుకుంటే ఆ మొత్తాన్ని పాలసీదారుడు చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని బీమా కంపెనీ భరిస్తుంది.
నెట్‌వర్క్ ఆస్పత్రులు
కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ప్రతి వ్యక్తి ఆ బీమా కంపెనీ జాబితాలోని నెట్‌వర్క్ ఆస్పత్రులు మీకు దగ్గరలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఈ ఆస్పత్రుల్లో చేరితే పాలసీ పరిమితికి లోబడి పైసా కూడా జేబు నుంచి ఖర్చు చేయకుండా బయటపడొచ్చు. అంటే ఈ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందుకోవచ్చన్న మాట. మీకు క్లెయిమ్ చేసే అవసరం లేకుండా ఆస్పత్రే మీ బిల్లును బీమా కంపెనీ నుంచి సెటిల్ చేసుకుంటుంది.
మినహాయింపులు
ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా ఇప్పటికే ఉన్న వ్యాధులు, ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్స్, స్థూలకాయానికి సంబంధించిన చికిత్సలు, కాస్మెటిక్ సర్జరీలు, వంధ్యత్వం, సాహస క్రీడలతో ఏర్పడే గాయాలు, దంత సంరక్షణ, ప్రసూతి చికిత్సలు ఈ మినహాయింపుల పరిధిలోకి వస్తాయి. అయితే ఈ మినహాయింపులు బీమా కంపెనీలను బట్టి మారుతుంటాయి. పాలసీ తీసుకునే ముందే వీటిని చెక్ చేసుకోవాలి.
ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీ
హాస్పిటలో చేరడానికి ముందు లేదా చేరిన తర్వాత జరిపే బ్లడ్ టెస్టులు, ఎక్స్-రే, సీటీ స్కాన్, ఈసీజీ, ఎంఆర్‌ఐ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చుల పరిధిలోకి వస్తాయి. కొన్ని బీమా కంపెనీలు నెల నుంచి రెండు నెలల ముందు జరిపే ఈ పరీక్షలకు కూడా కవరేజీ కల్పిస్తున్నాయి. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక ఔషధాలు, ఫాలో అప్ కన్సల్టేషన్, వ్యాధి నిర్దారణ పరీక్షలు, ఫిజియోథెరపీ, కోలుకోవడానికి అవసరమైన ఇతర వైద్య సేవల ఖర్చులు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల పరిధిలోకి వస్తాయి. చాలా ఆరోగ్య బీమా కంపెనీలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు అయ్యే ఈ ఖర్చులకు కవరేజీ కల్పిస్తున్నాయి.
వీలైనంత ఎక్కువ కాలానికి ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ కల్పించే బీమా కంపెనీల పాలసీలను ఎంచుకుంటే మంచిదని నిపుణుల సూచన. లేకపోతే ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా పెద్ద మొత్తంలో జేబులోని డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News