2047 నాటికి ఫార్మా ఎగుమతులు రూ.30 లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:02 AM
భారత ఫార్మా ఎగుమతులు 2047 నాటికి 35,000 కోట్ల డాలర్లకు (రూ.30.10 లక్షల కోట్లు) చేరుతాయని అంచనా. అంటే ప్రస్తుత విలువతో పోల్చితే 10 రెట్లు అధికం. అలాగే ప్రస్తుతం ఫార్మా ఎగుమతుల్లో...

టాప్ 5లోకి భారత్ చేరే చాన్స్
బెయిన్ అండ్ కంపెనీ నివేదిక వెల్లడి
ముంబై: భారత ఫార్మా ఎగుమతులు 2047 నాటికి 35,000 కోట్ల డాలర్లకు (రూ.30.10 లక్షల కోట్లు) చేరుతాయని అంచనా. అంటే ప్రస్తుత విలువతో పోల్చితే 10 రెట్లు అధికం. అలాగే ప్రస్తుతం ఫార్మా ఎగుమతుల్లో ప్రపంచ స్థాయిలో భారత్ 11వ స్థానంలో ఉండగా అప్పటికి టాప్ 5లోకి చేరుతుందని ఫార్మెక్సిల్, భారత ఫార్మా సంస్థలతో కలిసి బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పరిమాణం ఆధారిత వైఖరి నుంచి విలువ ఆధారిత వ్యూహం అనుసరించడం ద్వారానే భారత్ ఈ ఘనత సాధిస్తుందని కూడా పేర్కొంది. భారత్ ప్రస్తుతం జెనరిక్ ఔషధాల సరఫరాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. 2023లో ఫార్మా ఎగుమతులు 2,700 కోట్ల డాలర్ల (రూ.2.32 లక్షల కోట్లు) స్థాయిలో ఉండగా 2030 నాటికి 6,500 కోట్ల డాలర్లకు (రూ.5.59 లక్షల కోట్లు) చేరగలవని అంచనా. రాబోయే కాలంలో స్పెషాలిటీ జెనరిక్స్, బయో సిమిలర్స్, ఇన్నోవేటివ్ ఫార్మా ఉత్పత్తులపై దృష్టి సారించటం ద్వారా విలువ మరింతగా పెరుగుతుందని ఆ నివేదికలో తెలిపారు.
విధానపరమైన
మద్దతు అవసరం
భారత ఫార్మా సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగంలోకి తేవాలంటే విధానపరమైన మద్దతు అవసరమని ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫాక్యరర్స్ సమాఖ్య (ఐడీఎంఏ) జాతీయ అధ్యక్షుడు విరంచి షా అన్నారు. ప్రధానంగా ఎగుమతులకు నాన్ టారిఫ్ అవరోధాలను తొలగించి విభిన్న దేశాలకు విభిన్న ఎగుమతి వ్యూహాలు అనుసరించాలని సూచించారు. 40 కొత్త కెమికల్, బయోలాజికల్ ఎంటిటీలు అభివృద్ధి దశలో ఉన్న నేపథ్యంలో ఇన్నోవేషన్ విభాగంలో భారత ఎగుమతులు 2047 నాటికి 1,300-1,500 కోట్ల డాలర్లకు (రూ.11.18 -12.90 లక్షల కోట్లు) చేరగలవని అంచనా. కాగా స్పెషాలిటీ జెనరిక్స్, బయో సిమిలర్స్, వ్యాక్సిన్లు, అడ్వాన్స్‌డ్ థెరపీల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా 2047 నాటికి అంచనా వేస్తున్న ఎగుమతుల స్థాయికి చేరగలుగుతామని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను అన్నారు.
మూడు అంశాలపై
దృష్టి పెడితే సాధ్యమే
విలువ ఆధారిత వ్యూహంలో దృష్టి సారించాల్సిన మూడు అంశాలను ఆ నివేదికలో గుర్తించారు. యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ) ఎగుమతులు పెంచుకోవడం ఒకటి. ప్రస్తుతం ఏపీఐ ఎగుమతుల పరిమాణం 500 కోట్ల డాలర్లుండగా (రూ.43,000 కోట్లు).. 2047 నాటికి 8,000 -9,000 కోట్ల డాలర్లకు (రూ.6.88-7.74 లక్షల కోట్లు) చేరవచ్చని అంచనా. మొత్తం ఔట్‌సోర్సింగ్ ఏపీఐ మార్కెట్లో 35ు వాటాతో చైనా అగ్రగామిగా ఉంది. ప్రపంచ సరఫరా వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా భారత్ కూడా తన మార్కెట్‌ను పెంచుకోవచ్చు. ఈ కోణంలో చూస్తే అమెరికా రూపొందించిన బయోసెక్యూర్ చట్టం భారత్‌కు మంచి అవకాశమని ఆ నివేదికలో తెలిపారు. ఏపీఐ మార్కెట్లో గట్టి పట్టు సాధించాలంటే బల్క్ డ్రగ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టడం, ముడిసరుకులో స్వయం సమృద్ధి సాధించడం అవసరమని పేర్కొన్నారు.
భారత బయో సిమిలర్ ఎగుమతులు ప్రస్తుతం 80 కోట్ల డాలర్లుండగా (రూ.6,880 కోట్లు).. 2047 నాటి కి 3000-4000 కోట్ల డాలర్లకు (రూ.2.58-3.44 లక్షల కోట్లు) చేరగలవని అంచనా. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టడం, అమెరికా వంటి మార్కెట్లలో నిబంధనల సరళీకరణ, సామర్థ్యాల విస్తరణ బయో సిమిలర్ విభాగంలో భారత్ స్థానాన్ని పటిష్ఠం చేస్తాయంటున్నారు.
ప్రస్తుతం మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 70 శాతం వాటా జెనరిక్ ఫార్ములేషన్లదే. వీటి ప్రస్తుత విలువ 1,900 కోట్ల డాలర్లుండగా (రూ.1.63 లక్షల కోట్లు).. 2047 నాటికి 18,000-19,000 కోట్ల డాలర్లకు (రూ.15.48-16.34 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. ఇందుకోసం భారత్ సాధారణ జెనరిక్స్ నుంచి అధిక మార్జిన్లుండే స్పెషాలిటీ జెనరిక్స్ వైపు దృష్టి కేంద్రీకరించాలి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..