Share News

NTPC Nuclear Power: అణు విద్యుత్‌ ప్రాజెక్టులపై ఎన్‌టీపీసీ గురి

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:54 AM

దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ.. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో అణు విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే రెడీ అవుతోంది. 2047 నాటికి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష మెగావాట్ల అణు విద్యుత్‌...

NTPC Nuclear Power: అణు విద్యుత్‌ ప్రాజెక్టులపై ఎన్‌టీపీసీ గురి

  • అనువైన ప్రదేశాల కోసం అన్వేషణ జూ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ: దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ.. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో అణు విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే రెడీ అవుతోంది. 2047 నాటికి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష మెగావాట్ల అణు విద్యుత్‌ సామర్థ్యంలో 30ు వాటా (30,000 మెగావాట్లు) సాధించాలని ఎన్‌టీపీసీ లక్ష్యంగా ఏర్పరచుకుంది. ఇందులో భాగంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో 700, 1,000, 1,600 మెగావాట్ల అణు విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో భాగస్వామి అయిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రాజెక్టులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ సహా మరికొన్ని రాష్టాల్లో అనువైన ప్రాంతాలు, భూముల కోసం అన్వేషిస్తున్నట్టు ఆయన తెలిపారు. వీటిలో అణు ఇంధన రెగ్యులేటరీ బోర్డ్‌ (ఏఈఆర్‌బీ) గుర్తించి, అనుమతించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఒక గిగావాట్‌ (1,000 మెగావాట్లు) అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.15,000 -20,000 కోట్లు ఖర్చవుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంటే తక్కువ పెట్టుబడిని పరిగణనలోకి తీసుకున్నా 30,000 మెగావాట్ల సామర్థ్యం సాధించేందుకు రూ.4.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. అదే గరిష్ఠ పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటే రూ.6 లక్షల కోట్లు అవసరం. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరడానికి కనీసం మూడేళ్లు పడుతుందని అంచనా.


దేశీయ రియాక్టర్లే ఉపయోగిస్తాం

700, 1,000 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన భార జల రియాక్టర్లనే వినియోగిస్తామని, 1,600 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం మాత్రం టెక్నాలజీ భాగస్వామ్యాలకు అన్వేషిస్తామని ఆ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ముడిసరుకు లభ్యతపై కూడా ఎన్‌టీపీసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం విదేశాల్లో యురేనియం ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యురేనియం ఆస్తుల టెక్నో-కమర్షియల్‌ అధ్యయనం ఉమ్మడిగా చేపట్టేందుకు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో (యూసీఐఎల్‌) ఇప్పటికే ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేసినట్టు ఎన్‌టీపీసీ వర్గాలు తెలిపాయి. 1975లో ఏర్పాటైన ఎన్‌టీపీసీ ప్రస్తుతం 84,848 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగి ఉంది.

వీటిలో బొగ్గు, గ్యాస్‌/ద్రవ ఇంధనం, హైడ్రో, సోలార్‌ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం భారత అణు ఇంధన కార్పొరేషన్‌తో (ఎన్‌పీసీఐఎల్‌) ఉమ్మడి భాగస్వామ్యంలో రాజస్థాన్‌లో రూ.42,000 కోట్ల వ్యయంతో ఒక అణు ప్రాజెక్టును ఎన్‌టీపీసీ చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ అశ్వినిలో (అణుశక్తి విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌) ఎన్‌టీపీసీ 49ు వాటా కలిగి ఉండగా ఎన్‌పీసీఐఎల్‌ 51ు వాటా కలిగి ఉంది.

ఇవీ చదవండి:
Car parking: అక్కడ.. 800 కార్లు పార్క్‌ చేయొచ్చు...
Drone chases the accused: వరుడిపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్!

Updated Date - Nov 17 , 2025 | 05:54 AM